పంతం నెగ్గించుకున్నారు… కానీ ?
కేశినేని నాని.. విజయవాడ నుంచి టీడీపీ తరపున వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో కేశినేని నాని జగన్ ప్రభంజనంలోనూ రెండోసారి గెలిచాక నాని పార్టీ [more]
కేశినేని నాని.. విజయవాడ నుంచి టీడీపీ తరపున వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో కేశినేని నాని జగన్ ప్రభంజనంలోనూ రెండోసారి గెలిచాక నాని పార్టీ [more]
కేశినేని నాని.. విజయవాడ నుంచి టీడీపీ తరపున వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో కేశినేని నాని జగన్ ప్రభంజనంలోనూ రెండోసారి గెలిచాక నాని పార్టీ అధిష్టానాన్ని సైతం లెక్క చేయట్లేదు. విజయవాడ టీడీపీకి తానే బాస్‌ను అని.. అందరూ తన మాటే వినాలని…. ఓడిన ఎమ్మెల్యేల మాటకు విలువ ఇవ్వక్కర్లేదని ఓపెన్ స్టేట్మెంట్లే ఇస్తున్నారు. చంద్రబాబు సైతం కేశినేని నానిపై ఎంత అసహనం ఉన్నా ఇంత సంక్లిష్ట పరిస్థితుల్లోనూ రెండోసారి గెలవడంతో ఏం చేయలక కక్కలేక… మింగలేక ఉన్నారు. ఇక కార్పొరేషన్ ఎన్నికల వేళ నాని తన కుమార్తె శ్వేతను ముందుగానే తనకు తానే మేయర్ అభ్యర్థిగా ప్రకటించేసుకుని ప్రచారం ప్రారంభించారు. గతేడాదే ఈ తంతు జరిగింది. గద్దె, బుద్ధా, నాగుల్ మీరాతో పాటు బొండా ఉమా సైతం నాని తీరుకు వ్యతిరేకంగా ఒక్కటయ్యారు. కేశినేని శ్వేతకు మేయర్ ఇవ్వడం కుదరదని వీళ్లందరూ భీష్మించుకుని ఉన్నారు.
అనేక సవాళ్లు….
గత పది రోజులుగా బెజవాడ రాజకీయాలను హీటెక్కిస్తోన్న ఈ అంశంపై ఎట్టకేలకు అధిష్టానం క్లారిటీ ఇచ్చేసింది. కేశినేని నానికే ఓటేసింది.. బెజవాడ మేయర్ అభ్యర్థిగా పార్టీ నుంచి కేశినేని శ్వేత బరిలో ఉంటారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామం బెజవాడ నగరంలో మిగిలిన సీనియర్ నేతలకు, మాజీలకు ఏ మాత్రం రుచించడం లేదు. కుమార్తె శ్వేతకు పంతం వేసి మేయర్ అభ్యర్థిత్వం ప్రకటించుకున్నా నాని ముందు చాలా సవాళ్లే ఉన్నాయి. ఓ వైపు గుంటూరు మేయర్ పదవిని కూడా కమ్మ వర్గానికి చెందిన కోవెలమూడి రవీంద్రకే పార్టీ ఇస్తున్నట్టు ప్రకటన చేసింది. బెజవాడ మేయర్ పదవిపై పార్టీలో ఆశలు పెట్టుకున్న మిగిలిన సామాజిక వర్గాల నేతలను కలుపుకుని వెళ్లాలి.
భారమంతా ఆయనపైనే…?
ఈ క్రమంలోనే మూడు నియోజకవర్గాల్లో పార్టీ తరపున పోటీ చేస్తోన్న కార్పొరేటర్లలో మెజార్టీ కార్పొరేటర్లను గెలిపించుకుంటేనే కేశినేని నాని కుమార్తె మేయర్ అవుతారు. ఇటు ఆమె పోటీ చేస్తోన్న డివిజన్లలోనూ పార్టీలో కీలక నేతల నుంచి సపోర్ట్ లేదు. అక్కడ శ్వేతను గెలిపించుకోవడంతో పాటు మిగిలిన డివిజన్లలో పార్టీ నేతలకు భారీ స్థాయిలో ఆర్థిక సాయం చేయడంతో పాటు ప్రచారం చేయాల్సిన బాధ్యత కేశినేని నానిమీదే ఉంది. అధికార పార్టీ అభ్యర్థులను ఎదుర్కొని నిలబడాలంటే నానికి భారీగా చేతిచమురు వదిలేలా ఉంది. తూర్పు నియోజకవర్గంలో గద్దె సైలెంట్‌గా ఉన్నారు. ఆయన తన నియోజకవర్గంలో పార్టీ తరపున పోటీ చేస్తోన్న కార్పొరేటర్లకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు రాని పరిస్థితి.
సక్సెస్ ఎంతవరకూ అన్నది…?
ఇక నిన్నటి వరకు ఎలాగైనా తన సెంట్రల్ నియోజకవర్గానికే మేయర్ పదవి ఇప్పించుకోవాలని తీవ్రంగా ఫైట్ చేసిన మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సైతం ఇప్పుడు ఎన్నికలను పెద్దగా పట్టించుకోలేదు.. పైగా కేశినేని నాని కుమార్తెను మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అటు పశ్చిమ నియోజకవర్గంలో పట్టున్న ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, షేక్ నాగుల్ మీరాలు ప్రచారంలో కానరావడం లేదు. ఇక్కడ వీరిద్దరు సపోర్ట్ చేయకపోతే పార్టీ మంత్రి వెల్లంపల్లిని ఎదుర్కొని మెజార్టీ డివిజన్లలో పాగా వేయడం కష్టం. ఏదేమైనా కేశినేని నాని కుమార్తెను మేయర్ అభ్యర్థిగా ఒప్పించుకోవడంలో సక్సెస్ అయినా… ఈ వ్యతిరేక అంశాలను ఎదుర్కొని పార్టీని కార్పొరేషన్లో ఎంత వరకు పాగా వేయిస్తారన్నది మాత్రం చెప్పలేం ?