కియా ఇలా చేసిందేమిటి?
ఆంధ్రప్రదేశ్ లో కొత్త గొడవ మొదలైంది. మూడు రాజధానుల అంశం ఒకవైపు రగులుతూనే ఉంది. మరోవైపు అధికార, ప్రతిపక్షాలు రచ్చకెక్కేందుకు కియా మోటార్స్ కథనం ముడిసరుకుగా దొరికింది. [more]
ఆంధ్రప్రదేశ్ లో కొత్త గొడవ మొదలైంది. మూడు రాజధానుల అంశం ఒకవైపు రగులుతూనే ఉంది. మరోవైపు అధికార, ప్రతిపక్షాలు రచ్చకెక్కేందుకు కియా మోటార్స్ కథనం ముడిసరుకుగా దొరికింది. [more]
ఆంధ్రప్రదేశ్ లో కొత్త గొడవ మొదలైంది. మూడు రాజధానుల అంశం ఒకవైపు రగులుతూనే ఉంది. మరోవైపు అధికార, ప్రతిపక్షాలు రచ్చకెక్కేందుకు కియా మోటార్స్ కథనం ముడిసరుకుగా దొరికింది. కాదేదీ కవితకు అనర్హం అన్నట్లుగా .. టీడీపీ, వైసీపీల రాజకీయ రగడకు మరో కొత్త అంశం జోడైంది. రాష్ట్ర ప్రయోజనాలు, భవిష్యత్తు వంటి అంశాలకంటే పార్టీల వైరమే ప్రధాన పాత్ర పోషిస్తోంది. నవ్యాంద్రప్రదేశ్ ఆవిర్భవించిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన అతిపెద్ద పరిశ్రమ కియా మోటార్స్. 14 వేల కోట్ల రూపాయల వ్యయంతో నెలకొల్పిన ఈ పరిశ్రమ ద్వారా 12వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. రాజకీయంగా ఈ క్రెడిట్ ను చంద్రబాబు తన ఖాతాలో వేసేసుకున్నారు. తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రలతో పోటీ పడి ఈ పరిశ్రమను ఆంధ్రాకు రప్పించిన ఘనత గత ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ దానికి అనేక రకాల రాయితీలు, ఖజానాపై భారం పడిన మాట కూడా వాస్తవమే. తాజాగా కియా మోటార్స్ తమిళనాడుకు తరలిపోయేందుకు ఆ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందంటూ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ కలకలం రేపింది. అదిప్పుడు రెండు పార్టీల మధ్య రాజకీయ వివాదానికి మరోసారి ఆజ్యం పోస్తోంది.
ఎవరేం చేశారు?
కియా మోటార్స్ సంస్థ రాష్ట్రానికి ఊరకనే రాలేదు. అనేక రకాల డిమాండ్లను ముందు పెట్టి సాధించుకుంది. ఆ కంపెనీ పెట్టిన పెట్టుబడుల కంటే రానున్న పది సంవత్సరాల్లో రాయితీల రూపంలో రాష్ట్రం భరించే మొత్తమే ఎక్కువనేది ఒక వాదన. విద్యుత్తు రాయితీలు, నీటి సరఫరా ఖర్చులు, చౌకగా భూమి, వాయిదాల పద్ధతి ఇవన్నీ ఆ సంస్థకు సమకూరిన ప్రయోజనాలు. అందుకే మౌలిక వసతుల పరంగా మెరుగైన స్థితిలో ఉన్న తమిళనాడును కాదని ఏపీలో పరిశ్రమను నెలకొల్పారు. అయితే పరిశ్రమలో అత్యధికులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారేనని స్థానికులలో కొంత అసంతృప్తి నెలకొంది. ఈ పరిశ్రమ కారణంగా అక్కడి భూముల విలువ మాత్రం భాగానే పెరిగింది. అనుబంధ పరిశ్రమలు సైతం వస్తే లాజిస్టిక్స్ పరంగా తన కంపెనీకి మద్దతు లభిస్తుందని కియా ఆలోచించింది. అయితే భూముల ధరలు విపరీతంగా పెరగడం, దానికితోడు కొత్త ప్రభుత్వం విధానపరంగా 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించడంతో కొన్ని అవరోధాలు ఏర్పడ్డాయి. 2017 నుంచి 2019 మధ్య రికార్డు కాలంలో కంపెనీ నిర్మాణపనులను పూర్తి చేశారు. ఏటా మూడులక్షల వాహనాల ఉత్పత్తితో 20 వేల కోట్ల రూపాయలకు పైగా వ్యాపార టర్నోవర్ సాధించాలనేది కంపెనీ లక్ష్యం.
పాలసీ మార్పులు…
రాష్ట్రప్రభుత్వ పాలసీ పరంగా వచ్చిన మార్పుల్లో స్థానికులకే ఉద్యోగాలు అన్న అంశం కియా వంటి అంతర్జాతీయ కంపెనీలకు కొంత మేరకు ఇబ్బంది కరంగా మారింది. ఆరునెలలలోపు ఆయా కంపెనీలు స్థానికులకు ప్రభుత్వ సహకారంతో శిక్షణ ఇచ్చి వారిని నియమించుకోవాలని చట్టం చెబుతోంది. ఇప్పటికే పని ప్రారంభించిన కంపెనీలకు ఈ నిబంధన విషయంలో సడలింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాకుండా గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల విషయంలో పునస్సమీక్ష చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై కూడా పారిశ్రామిక వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్తు, నీరు, మౌలిక సదుపాయాలకు సంబంధించి రాయితీలు స్థానిక ఉద్యోగాలతో ముడిపెట్టాలనేది నూతన ప్రభుత్వ యోచనగా ఉంది. ఈ విషయంలో ఎదురవుతున్న ఒత్తిడి పరిశ్రమలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కియా పరిశ్రమ తమిళనాడు తరలి వెళ్లడానికి తమిళనాడు సర్కారుతో చర్చలు జరుపుతోందన్న రాయిటర్స్ కథనం మాత్రం ప్రకంపనలు పుట్టించింది. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. అయితే పెట్టుబడులతో కూడిన ఒక పెద్ద పరిశ్రమను తరలించడమంటే మాటలు కాదు. అది అసాధారణం కూడా. అందుకే అటు ప్రభుత్వం, ఇటు కంపెనీ యాజమాన్యం స్పందించి తరలింపు కథనాలను ఖండించాయి.
దీర్ఘ దృష్టి …
ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పరిశ్రమలకు ఇచ్చిన హామీల విషయంలో కట్టుబడే ఉండాలి. అయితే రాష్ట్రంలో టీడీపీ, వైసీపీలు వైరి శిబిరాలుగా మోహరించడంతో సమస్య తలెత్తుతోంది. కియా వివాదంలో మళ్లీ రచ్చ కెక్కి ఈ పార్టీలు కాట్టాడుకుంటున్నాయి. ఎవరేం చేశారంటూ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నాయి. కియా ను తరలించేది లేదంటూ అధికారికంగానే కంపెనీ తరఫున యాజమాన్య ప్రతినిధి ఖండించారు. అంతటితో సమస్య ముగిసినట్లే. కానీ టీడీపీ లోక్ సభ సభ్యులు పార్లమెంటులోనూ ఈ అంశాన్ని లేవనెత్తారు. వైసీపీ ఎంపీలు తీవ్రంగా ఖండించారు. పరిశ్రమల వ్యవస్థాపకులు సాధారణంగా రాజకీయ వైరాలను కోరుకోరు. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ తమ పని జరిగితే చాలని కోరుకుంటారు. ఆ రకమైన పారిశ్రామిక వాతావరణాన్ని వైసీపీ, తెలుగుదేశం పార్టీలు దెబ్బతీస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలకు ఇది చేటు తెచ్చి పెడుతుంది. అంతర్జాతీయంగా మాంద్యం పరిస్థితులు నెలకొన్న స్థితిలో చాలా దేశాలు పెట్టుబడుల కోసం వెంపర్లాడుతున్నాయి. తమ మధ్య రాజకీయ వైరాలు ఎలా ఉన్నప్పటికీ పరిశ్రమలను ఆకర్షించే విధానంలో రాజకీయాలకు అతీతంగా పార్టీలు స్పందించడం ఎంతైనా అవసరం.
-ఎడిటోరియల్ డెస్క్
- Tags
- kia
- à°à°¿à°¯à°¾