కోలగట్ల కుమిలిపోతున్నారట….అందుకేనా ?
రాజకీయాల్లో ప్రత్యర్ధులు మాత్రమే ఉంటారు. శత్రువులు ఉండరు అని అంటారు. కానీ వర్తమానంలో చూసుకుంటే శత్రువులే ఉంటున్నారు. పోనీ వారు బయట ఉంటే ఫరవాలేదు. సొంత పార్టీలోనే [more]
రాజకీయాల్లో ప్రత్యర్ధులు మాత్రమే ఉంటారు. శత్రువులు ఉండరు అని అంటారు. కానీ వర్తమానంలో చూసుకుంటే శత్రువులే ఉంటున్నారు. పోనీ వారు బయట ఉంటే ఫరవాలేదు. సొంత పార్టీలోనే [more]
రాజకీయాల్లో ప్రత్యర్ధులు మాత్రమే ఉంటారు. శత్రువులు ఉండరు అని అంటారు. కానీ వర్తమానంలో చూసుకుంటే శత్రువులే ఉంటున్నారు. పోనీ వారు బయట ఉంటే ఫరవాలేదు. సొంత పార్టీలోనే ఉంటూ కాళ్ళలో కర్రలు పెడుతూ ఉంటే తట్టుకోవడం ఎంతటి ఘనాపాటీలకైనా కష్టమే సుమా. విజయనగరం జిల్లా రాజకీయాల్లో చూసుకుంటే కోలగట్ల వీరభద్రస్వామి సీనియర్ వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే కూడా. వైశ్య కమ్యూనిటీలో పెద్దతలకాయగా ఉంటూ రాజకీయాల్లోకి దూకిన ఉత్సాహవంతుడు. ఆయనది మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితం.
ఒకే గురువు నీడలో …..
ఇక కోలగట్ల వీరభద్రస్వామి, మంత్రి బొత్స సత్యనారాయణ ఒకే గురువు నీడలో రాజకీయ అక్షరాలు దిద్దారు. ఈ మధ్యకాలంలో దివంగతులైన ఉత్తరాంధ్రా జిల్లాల వరిష్ట నేత పెనుమత్స సాంబశివరాజు వద్దనే శిష్యరికం చేసిన ఈ ఇద్దరూ మాత్రం రాజకీయంగా వేరే దారుల్లో సాగారు. గురువుకు విధేయత చూపుతూ తన రాజకీయాన్ని నెమ్మదిగా కోలగట్ల వీరభద్రస్వామి మొదలుపెడితే అడ్డు వచ్చిన వారిని నెట్టుకుంటూ బొత్స దూకుడుగా ముందుకు సాగారు. ఈ పరిణామాల నేపధ్యంలో 1989 నుంచి పోటీ చేస్తూ వచ్చినా కూడా 2004 నాటికి కానీ కోలగట్లకు ఎమ్మెల్యేగా విజయం దక్కలేదు. అది కూడా కాంగ్రెస్ లో టికెట్ దక్కకుండా బొత్స చేస్తే ఇండిపెండెంట్ గా దిగి మరీ నాటి మంత్రి అశోక్ గజపతిరాజుని ఓడించి రికార్డు సృష్టించారు.
జగన్ మెచ్చినా…..
ఇక వైఎస్సార్ ఉన్నంతవరకూ కోలగట్ల వీరభద్రస్వామిని ఆదరించి దగ్గరకు తీశారు. ఆ తరువాత బొత్సదే కాంగ్రెస్ లో హవా కావడంతో కోలగట్ల వైసీపీలో చేరారు. గురువు సాంబశివరాజుతో కలసి కొత్త పార్టీకి పునాదులు వేశారు. కానీ మళ్ళీ అక్కడ కూడా బొత్స రావడంతో కోలగట్లకు ఉక్కబోత తప్పలేదు. 2014 ఎన్నికల్లో కోలగట్ల ఓటమి చెందినా జగన్ ఆయన్ని ఎమ్మెల్సీ చేశారు. 2019 ఎన్నికలకు ముందే జిల్లాలో మొదటి టికెట్ ఆయనకే జగన్ ఇచ్చారు. ఇక మంత్రి చాన్స్ వస్తుంది అనుకుంటే మాత్రం కుల సమీకరణల కారణంగా బొత్సను అది వరించింది. దాంతో వట్టి ఎమ్మెల్యేగానే కోలగట్ల వీరభద్రస్వామి మిగిలిపోయారు.
అది కూడా రాదా…?
ఇక జగన్ మంత్రి పదవులు రాని వారి కోసం అన్నట్లుగా ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఉత్తరాంధ్రా బోర్డుకు చైర్మన్ గా కోలగట్ల వీరభద్రస్వామి గట్టిగానే ట్రై చేస్తున్నారు. మంత్రి పదవితో సమానమైన ఈ పదవి కోసం రేసులో మరో సీనియర్ ఎమ్మెల్యే ఎస్టీ అయిన పీడిక రాజన్న దొర కూడా ఉన్నారుట. అయితే బొత్స ఇక్కడ కూడా కోలగట్లకు ఈ పదవి దక్కకుండా అడ్డుచక్రం వేస్తున్నట్లుగా ప్రచారం అయితే సాగుతోంది. ఇక ఇప్పటికే ఈ తరహా రాజకీయాలతో విసిగిపోయిన కోలగట్ల 2024 ఎన్నికల్లో పోటీ చేయను అంటున్నారు. తన కుమార్తె శ్రావణికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కూడా జగన్ ని కోరుతున్నారు. అయితే వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే మీసాల గీతను తీసుకువచ్చి కోలగట్ల వీరభద్రస్వామి ఫ్యామిలీని పూర్తిగా సైడ్ చేయాలని బొత్స వర్గం వేస్తున్న ఎత్తులతో కోలగట్ల మరింతగా కుములుతున్నారుట. ఇక మరి జగనే తమను ఆదుకోవాలని ఆయన వర్గీయులు కోరుతున్నారు.