క్వశ్చనే లేదట
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే, గత ఏడాదే కాకుండా అంతకు ముందు నుంచి కూడా జిల్లాలో తమకుపట్టు [more]
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే, గత ఏడాదే కాకుండా అంతకు ముందు నుంచి కూడా జిల్లాలో తమకుపట్టు [more]
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే, గత ఏడాదే కాకుండా అంతకు ముందు నుంచి కూడా జిల్లాలో తమకుపట్టు పెంచుకున్న వైసీపీ నాయకులు చాలా మంది ఉన్నారు. వీరు పార్టీతో సంబంధం లేకుండా ఆయా నియోజకవర్గాల్లో పట్టు సాధించి, వరుస ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కుతున్నారు. ఇలాంటివారు చాలా మంది ఉన్నప్పటికీ ఓ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి కొనసాగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ వైసీపీ నాయకులు పరస్పరం ఆధిపత్య రాజకీయాలు చేసుకున్నారనే వాదనలు ఉన్నాయి. వారే జగన్ సామాజిక వర్గానికి చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి.
ఇద్దరి మధ్య….
ఈ ఇద్దరు రెడ్ల మధ్య రాజకీయంగా ఆధిపత్య ధోరణి కొనసాగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వరుసగా విజయాలు సాధించారు. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్‌రెడ్డి తన హవా నిలబెట్టుకుంటున్నారు. ఇద్దరూ కూడా రాజకీయంగా వ్యూహ ప్రతివ్యూహాలు తెలిసిన వారే. అయితే, వీరిలో కోటంరెడ్డికి ఆది నుంచి దూకుడు ఎక్కువనేది అందరికీ తెలిసిందే. ఉన్నది మొహం మీద చెప్పే యడం, చేయాలనుకున్నది చేసేయడం ఆయన నైజం. ఈ క్రమంలోనే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నసమయంలో క్రికెట్ బెట్టింగులకు పాల్పడిన కేసులో ఆయన పేరు తెరమీదికి వచ్చింది.
కాకాని ప్రమేయం ఉందని….
ఆ టైంలో ఆయనపై కేసులు కూడా నమోదు చేశారు. అయితే, ఆయనను ఇలా కేసుల్లో ఇరికించడం వెనుక కాకాని హస్తం ఉందనే ప్రచారం సాగింది. జిల్లాలో తన సత్తా చూపుతూ ముందుకు సాగుతూ పార్టీ వాయిస్‌ను బలంగా వినిపిస్తున్నారనే కారణంగా కాకాని కోటంరెడ్డిని టార్గెట్ చేశారనే వాదన ఉంది. ఇక, ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇద్దరూ మంత్రి పదవులు ఆశించారు. కానీ, జగన్ ఈ ఇద్దరినీ పక్కన పెట్టి కేవలం మేకపాటి కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చారు. అయితే, రెండున్నరేళ్ల తర్వాత మాత్రం మళ్లీ మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశం ఉండడంతో ఈ ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది. ఈ ఇద్దరిలోనూ కాకాని మంత్రి పీఠంపై మరింత ఎక్కువగానే ఆశలు పెట్టుకున్నారు.
అందుకే టార్గెట్….
దీంతో తనకు పోటీ వస్తారని భావించిన కోటంరెడ్డిని టార్గెట్ చేశారనేది నిర్వివాదాంశం. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఎంపీడీవో వ్యవ హారం తీవ్రంగా కుదిపేసింది. తనను కోటంరెడ్డి బెదిరించడంతోపాటు మద్యం తాగి తన ఇంటికి వచ్చి హల్చల్ చేశారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ ఘటన జరిగింది సర్వేపల్లి నియోజకవర్గంలో కావడంతో అక్కడి ఎమ్మెల్యేకాకాని ప్రోద్బలంతోనే తనపై కేసులు నమోదు చేశారని కోటంరెడ్డి బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఇప్పటి వరకు ఉన్న అంతర్గత విభేదాలు, ఆధిపత్య రాజకీయాలు కూడా ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ పరిణామం వైసీపీని రాజకీయంగా కుదుపునకు గురిచేసింది. ఈ విషయంపై సీరియస్ అయిన సీఎం జగన్ ఇద్దరికీ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. దీంతో ప్రస్తుతానికి ఇద్దరు సైలెంట్ అయినా అంతర్గతంగా మాత్రం ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు రెడీ అయ్యారు.
జగన్ వద్ద లాబీయింగ్ చేసి….
ఇక్కడ మరో విషయం ఏంటంటే తనను రాజకీయంగా అణిచేసేందుకు ప్రయత్నం జరుగుతోందని అసెంబ్లీలో కోటంరెడ్డి బాహాటంగానే విమర్శలు గుప్పించడం. ఇటీవల ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఈ ఏడు మాసాల కాలంలో తాను అనేక సార్లు మాట్లాడేందుకు చెయ్యెత్తానని, కానీ, తనకు అవకాశం ఇవ్వడం లేదని స్పీకర్ తమ్మినేనిపై కోటంరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల వెనుక కూడా జగన్ దగ్గర కాకాని లాబీయింగ్ చేస్తున్నారనే వాదనను కోటంరెడ్డి వర్గం చెబుతోంది. సో మొత్తానికి పైకి మాత్రం ఇప్పుడు మౌనంగా ఉన్నప్పటికీ ఈ ఇద్దరు నాయకుల మధ్య అంతర్గతంగా మాత్రం విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయని అంటున్నారు.మరి రాబోయే రోజుల్లో ఇవి సద్దు మణుగుతాయా? లేక మరింత పెరుగుతాయా? చూడాలి.