స్ట్రిక్ట్ గా ఉన్నారు…. సిల్లీగా వదిలేశారు
దేశం ఆకలి చావుల బారిన పడకుండా ఉండాలంటే ముందుకు సాగక తప్పదని గ్రహించే లాక్ డౌన్ ను దాదాపు తొలగించి వేశారు. విద్యాసంస్థలు బార్లు, సినిమా థియేటర్లు, [more]
దేశం ఆకలి చావుల బారిన పడకుండా ఉండాలంటే ముందుకు సాగక తప్పదని గ్రహించే లాక్ డౌన్ ను దాదాపు తొలగించి వేశారు. విద్యాసంస్థలు బార్లు, సినిమా థియేటర్లు, [more]
దేశం ఆకలి చావుల బారిన పడకుండా ఉండాలంటే ముందుకు సాగక తప్పదని గ్రహించే లాక్ డౌన్ ను దాదాపు తొలగించి వేశారు. విద్యాసంస్థలు బార్లు, సినిమా థియేటర్లు, ఫంక్షన్లు మినహా అన్నిటికీ అనుమతులిచ్చేశారు. ఇంకా కొంత భయాందోళనలు ఉన్నప్పటికీ దీనిని అందరూ ఆహ్వానిస్తున్నారు. ఉపాధికి సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వడం లో చాలా జాప్యం చేసిందనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. కొన్ని కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. సాంకేతికంగా, అధికారికంగా లెక్కలు లేకపోయినప్పటికీ ఆకలిచావులు, వలస కార్మికుల చావులు వేలల్లోనే ఉంటాయని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు. దేశ ప్రజలు తమను తాము కట్టడి చేసుకుంటూ ప్రభుత్వ నిర్బంధంలో ఎన్నో త్యాగాలు చేశారు. వీటి ఫలితాలను కాపాడటానికి ప్రభుత్వం తగినంత జాగ్రత్తలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రార్థనలు, దైవ దర్శనాల పేరిట సామూహికంగా జనం గుమికూడే అవకాశం ఉన్న మత సందర్శనలకు లాకు లెత్తేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచక్షణ ప్రదర్శించలేకపోయాయనే వాదనలున్నాయి.
ఎందుకీ తొందరపాటు…
ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మార్చి నెలలో లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నారు. తీవ్ర కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ ప్రజలు దీనిని సహించారు. సహకరించారు. కానీ మూడో దశలోనే మద్యంపై నిషేధం ఎత్తేశారు. వ్యాధి వ్యాపించడానికి, రోగ నిరోధక శక్తి తగ్గడానికి అవకాశం ఉన్న మద్య విక్రయాలను ప్రభుత్వం అనుమతించడమెందుకో ఎవరికీ అర్థం కాలేదు. రాష్ట్రప్రభుత్వాలకు నిధుల సర్దుబాటుకు ఈ వెసులుబాటు కల్పించారు. నిజానికి దేశ ఆర్థికవ్యవస్థ, ప్రజారోగ్యంతో పోల్చుకుంటే మద్యం ఆదాయం పెద్దదేమీ కాదు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి మద్యం విక్రయాల ద్వారా రోజుకు లభించే సగటు ఆదాయం వెయ్యి కోట్ల రూపాయలు మాత్రమే. గడచిన 80 రోజుల్లో లాక్ డౌన్ తో దేశం 40 లక్షల కోట్ల రూపాయల జీడీపీని నష్టపోయింది. కచ్చితంగా నాలుగైదు కోట్ల మంది రోడ్డునపడ్డారు . ఉద్యోగాలు పోయాయి. దాంతో పోలిస్తే మద్యం ఆదాయం ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవాల్సినది కాదు. అయినా సరే అమ్మకాలు మొదలు పెట్టి సాగిస్తున్నారు. అలాగే తాజాగా తీసుకున్న నిర్ణయం ఆలయాలు, మసీదులు, చర్చిలవంటి మత సంస్థల్లోకి ప్రజలను అనుమతించడం. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయనేది అంతుపట్టనిదిగా వైద్యులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా విద్యాలయాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న సర్కారు మత సంస్థల విషయంలో ఉదారంగా ఉండటం పైనే ఆక్షేపణలు వెల్లువెత్తుతున్నాయి.
బూడిదలో పోసిన పన్నీరేనా..?
ఏ మతానికి చెందిన ప్రార్థన కేంద్రాలు, సందర్శన స్థలాలైనా సామూహికంగా జనం గుమికూడే అవకాశం కల్పిస్తాయి. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు విధించినా నియంత్రించడం అసాధ్యం. అందులోనూ కొన్నిమతాల్లో సామూహిక ప్రార్థనలు ఆనవాయితీ. ఒక్కసారి అనుమతి ఇచ్చిన తర్వాత అదుపు చేస్తామనుకోవడం, స్వచ్ఛందంగా ప్రజలు సంయమనం పాటించి జాగ్రత్తలు తీసుకుంటారని ఆశించడం భ్రమే. లాక్ డౌన్ సమయంలో నిత్యావసరాల కోసం ప్రజలు ఎగబడిన తీరు గుర్తుంది కదా. అలాగే మద్యం షాపుల వద్ద పోటెత్తిన వైనమూ మనకు తెలిసిందే. భారతదేశంలో మతం వ్యక్తిగతం. ఇళ్లల్లోనే చాలమందికి పూజామందిరాలు, దేవుని చిత్రపటాలు ఉంటాయి. అందువల్ల ప్రార్థనలకు ఆటంకాలు ఏమీ ఉండవు. అందులోనూ భారతీయత మనసే మందిరమని చెబుతుంది. తాత్విక , ఉపనిషత్ వాక్యాలు విన్నప్పటికీ అదే విషయం స్పష్టమవుతుంది. గుడులు, గోపురాలు, విగ్రహాలు ప్రతీకలు మాత్రమే. ఉపాధి, వ్యాపార, పారిశ్రామిక సంస్థలతో పోలిస్తే మతసంస్థలను తెరవాలనే డిమాండ్ పెద్దగా లేదు. అయినా ప్రభుత్వం తనంతతానుగా సాహసించి ఈ నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ఫలితాలు బూడిదలో పోసిన పన్నీరుగా మారితే ప్రభుత్వమే ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందంటున్నారు వైద్యనిపుణులు.
ఇదా సమయం..?
నిజానికి భారత్ లో తొలిదశలో కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందడానికి ఢిల్లీలో జరిగిన ఒక మతపరమైన సమావేశమే కారణమని ఆరోపణలు వచ్చాయి. ఆలయాలు, చర్చిలు, మసీదులు సందర్శించి వెళ్లేవారు ఎక్కడెక్కడ తిరుగుతారో, ఎవరినీ కలుస్తారో చెప్పడం కష్టం. విస్తృత వ్యాప్తికి అవకాశమున్న బలహీనమైన కేంద్రాల్లో మత కార్యక్షేత్రాలు కీలకమైనవి. మరి కొంతకాలం వీటిపై ఆంక్షలు కొనసాగించి ఉంటే ముందుజాగ్రత్త తీసుకునే వెసులుబాటు ఉండేది. దీనిని ప్రభుత్వం విస్మరించింది. ఒకవైపు రోజువారీ పదివేల కేసులు నమోదవుతున్న పరిస్థితి. మరణాల సంఖ్య పెరుగుతోంది. సూపర్ స్ప్రెడింగ్ పాయింట్లను అన్నిటితోబాటే మమ అని వదిలేశాయి సర్కారులు. కనీసం విద్యాసంస్థల తరహాలోనైనా ఇంకొన్ని రోజులు వేచి చూసి ఉంటే బాగుండేది. ఆర్థిక,ఉపాధి కార్యకలాపాలు, ఆత్మసాంత్వననిచ్చే మత కార్యకలాపాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేకపోవడం ప్రభుత్వాల తప్పిదమే. కేసుల సంఖ్య, కమ్యూనిటీ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ భారత్ ప్రమాదం ముంగిట్లో ఉందని చెబుతోంది. ఈ స్థితిలో ఎక్కడెక్కడ వెసులుబాటు ఇవ్వాలి? ఎక్కడ ఉదారంగా ఉండాలనే విషయంలో ప్రభుత్వం పెద్దగా కసరత్తు చేయకపోవడం విచిత్రమే. తొలి దశలో పూర్తి నియంత్రుత్వం కనబరిచి అవసరం లేనంత హడావిడి చేసి అన్నివర్గాలను ప్రభుత్వ యంత్రాంగం ఇబ్బందుల పాలు చేసింది. ఇప్పుడేమో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మరిచి ప్రజారోగ్యాన్ని గాలికొదిలేస్తున్న తీరు కనిపిస్తోంది.
-ఎడిటోరియల్ డెస్క్