కమలం పడమటి రాగం
తూర్పు ఉదయించే వెలుగుకు సంకేతం. పడమర వాలే పొద్దునకు చిహ్నం. ప్రభంజనంలా పెరిగిన భారతీయ జనతపార్టీ ప్రాభవం గడచిన ఏడేళ్లుగా పతాకస్థాయికి చేరుకుంది. దేశంలో ఎదురులేని రాజకీయ [more]
తూర్పు ఉదయించే వెలుగుకు సంకేతం. పడమర వాలే పొద్దునకు చిహ్నం. ప్రభంజనంలా పెరిగిన భారతీయ జనతపార్టీ ప్రాభవం గడచిన ఏడేళ్లుగా పతాకస్థాయికి చేరుకుంది. దేశంలో ఎదురులేని రాజకీయ [more]
తూర్పు ఉదయించే వెలుగుకు సంకేతం. పడమర వాలే పొద్దునకు చిహ్నం. ప్రభంజనంలా పెరిగిన భారతీయ జనతపార్టీ ప్రాభవం గడచిన ఏడేళ్లుగా పతాకస్థాయికి చేరుకుంది. దేశంలో ఎదురులేని రాజకీయ శక్తిగా రూపుదాల్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రజాస్వామ్య దేశంలో గతంలో ఎన్నడూ లేనంత బలీయమైన ప్రధానిగా నరేంద్రమోడీ తన్నుతాను మలచుకున్నారు. చాలా విషయాల్లో ఇందిరాగాంధీ రికార్డులను సైతం తిరగరాసేశారు. అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తూ ఉంటారు. అది పూర్తి వాస్తవం కాకపోయినా అసత్యం కూడా కాదు. అర్ధసత్యం అందులో దాగి ఉందనవచ్చు. ఎంతటి బలీయమైన రాజుకైనా, ప్రధానికైనా అధికారం శాశ్వతం కాదు. పవర్ లో ఉండటం పర్మినెంటూ కాదు. అందులోనూ మతము, భావజాలం పేరిట గిచ్చి కయ్యాలు పెట్టుకునే మనస్తత్వం ఉన్న కమలనాథులకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. మోడీ జమానాకి పొద్దు తిరుగుతోందా? పడమటి రాగం మొదలైందా? అన్న అనుమానాలు పార్టీలో భయాందోళనలు పుట్టిస్తున్నాయి. ఇందుకు పశ్చిమబెంగాల్ వేదిక కాబోతోందనే సందేహాలు ముసురుకుంటున్నాయి.
భయం గుప్పెట్లో…
దేశంలో పెద్ద నాయకులను భయం గుప్పెట్లోకి నెట్టేసిన ఘనత నరేంద్రమోడీ సర్కారుకే దక్కుతుంది. ఎదురుతిరిగిన వాళ్లంతా శంకరగిరి మాన్యాలు పట్టిపోయారు. దీటుగా బీజేపీని, మోడీని ఎదిరించే నాయకులు లేకుండా పోయారు. దళిత్ ఐకాన్ గా ఉన్న జాతీయ నాయకురాలు మాయావతి, సమాజ్ వాదీ పార్టీ అధినేతగా వెలిగిన ములాయం సింగ్ యాదవ్, ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ వంటి మహామహులంతా రాజీ పడిపోయారు. తమ పాత్రను కుదించుకున్నారు. కురచనైపోయారు. మాజీ ప్రధాని దేవెగౌడ కర్ణాటకలో తన పార్టీ అస్తిత్వం మిగిలితే చాలన్నట్లుగా మోడీ ఊసే ఎత్తడం లేదు. అరవింద్ కేజ్రీవాల్ వంటి రెబల్ స్టార్ కూడా కిమ్మనడం లేదు. జాతీయంగా చక్రం తిప్పానని చెప్పుకునే ఒకనాటి యునైటెడ్ ప్రంట్ కన్వీనర్ చంద్రబాబు బీజేపీ కరుణాకటాక్షవీక్షణల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఘనమైన ప్రజాబలం కలిగిన జగన్ మోహన్ రెడ్డి ‘ఎస్ సార్’గా తన ధోరణిని మార్చేసుకున్నారు. దీనికి ప్రధాన కారణం కేంద్ర దర్యాప్తు సంస్థల చాకచక్యం , దాదాపు నేతలంతా ఏవో లొసుగులతో సతమతం కావడమే భయం గుప్పెట్లో చిక్కుకుపోవడానికి ప్రదాన కారణం. దీంతో గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా ప్రతిపక్షాలు కనిపిస్తున్నాయి. తొమ్మిదో దశకం నుంచీ పోటాపోటీగా దేశంలో ప్రతిపక్ష, అధికార పార్టీల మధ్య సమతూకం ఉంటూ వస్తోంది. 2014 నుంచీ ఈ స్థితిలో మార్పు వచ్చింది. అధికారపార్టీకి ఎదురులేని రాజకీయ వాతావరణం నెలకొంది.
ప్రతిపక్షాల బలహీనతలు..
ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసు పార్టీ స్వీయపరాధాలతో తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంది. పరిపాలనలో, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడంలో మన్మోహన్ సింగ్ చాలా బాగా పనిచేశారు. కానీ రాజకీయం నడపటంలో పార్టీ అధ్యక్షురాలైన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వైఫల్యం చెందారు. చిదంబరం, దిగ్విజయ్, గులాం నబీ అజాద్ వంటి వారు పార్టీని పూర్తిగానే భ్రష్టు పట్టించారు. తమ ప్రయోజనాల కోణంలో పార్టీని పక్కదారి పట్టించారు. చిదంబరం తన అధికారంతో చేసిన కుంభకోణాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. యువతరం పార్టీలో బలపడకుండా దిగ్విజయ్ లు, కమలనాథ్ లు, ఆజాద్ లు అడుగడుగునా అడ్డుకుంటూ వచ్చారు. ఫలితం ప్రస్తుత దుస్థితి. కాంగ్రెసు ఇప్పటికీ కేంద్రస్థానంలో ఉంది . కానీ దానికి ఆసరానిస్తూ చుట్టూ చేరేందుకు ఇతర పార్టీలు సిద్దం కావడం లేదు. ప్రతిపక్షాల్లో ఐకమత్యం లోపించడంతో ఎటూ పాలుపోని దుస్థితి నెలకొంది. ఈ స్థితిలో ప్రస్తుతం జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు విపక్షాలు మానసిక స్తైర్యాన్ని నింపుకునేందుకు దోహదం చేయవచ్చుననే భావన వ్యక్తమవుతోంది. షా వ్యూహాలు, మోడీ కరిష్మాలు పనిచేయకపోతే ప్రజా తీర్పులో సామాన్యుని కష్టాలే ప్రతిబింబిస్తే కచ్చితంగా మార్పునకు పునాది పడుతుందంటున్నారు.
మార్పు దిశలో…
ప్రతిపక్షాలన్నిటినీ ఒకే తాటిపై నడపాలంటే దీటైన నాయకత్వం కావాలి. ఇందుకు కాంగ్రెసు పార్టీ కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. వారసత్వం పట్ల తనకు ఏమాత్రం నమ్మకం లేదంటున్న రాహుల్ గాంధీ ఇతరుల నాయకత్వంలో పనిచేసేందుకూ సిద్దం కావాలి. కాంగ్రెసు దేశంలో బీజేపీ తర్వాత పెద్ద పార్టీ. అయినప్పటికీ ఆ పార్టీ ని విశ్వసించి దాని చెంత చేరేందుకు ఇతర ప్రాంతీయ పార్టీలు ముందుకురావడం లేదు. ఈ స్థితిలో మమతా బెనర్జీ నాయకత్వంపై మరోసారి చర్చ మొదలైంది. బెంగాల్ లో విజయమో, వీరస్వర్గమో అన్న రీతిలో మమతా బెనర్జీ తెగించి పోరాడుతున్నారు. మోడీ, షా , కేంద్ర దర్యాప్తుసంస్థలు, సంఘ్ పరివార్ శక్తులు అన్నిటినీ ఆమె ఒంటి చేత్తో ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పోరాటంలో మమత విజయం సాధించి పశ్చిమబెంగాల్ లో మరోసారి అధికారం దక్కించుకుంటే భారత చరిత్రలో కీలక రాజకీయ పరిణామమే అవుతుంది. చెల్లాచెదురై ఉన్న విపక్షాలు మళ్లీ ఒక గొడుగు కిందకు చేరేందుకు ఆసరా లభిస్తుంది. దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులకు పశ్చిమబెంగాల్ ఆశ్రయంగా మారవచ్చునంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మమత ఈ దిశలో నాయకత్వం వహించే అవకాశాలున్నాయి. ఆమె నాయకత్వాన్ని కాంగ్రెసు సహా అన్ని పక్షాలు అంగీకరించాల్సి రావచ్చు. ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్, తెలంగాణ లో కేసీఆర్, కర్ణాటకలో దేవెగౌడ, తమిళనాడులో స్టాలిన్, మహారాష్ట్రలో శరద్ పవార్, బిహార్ లో తేజస్వి యాదవ్ , ఢిల్లీలో కేజ్రీవాల్ వంటి వారు ఆమె వెంట నడిచేందుకు సిద్దంగా ఉన్నట్లు ఇప్పటికే సంకేతాలు వెలువడుతున్నాయి. పశ్చిమబెంగాల్ ఫలితం తేలిన తర్వాత దేశంలో నవీన రాజకీయ పరిణామాలకు బాటలు పడే అవకాశాలున్నాయి. ఒకవేళ అనూహ్యంగా మమతా బెనర్జీ బీజేపీ చేతిలో పరాజయం చవి చూస్తే 2024 పై కూడా విపక్షాలు ఆశలు వదులుకోవాల్సి రావచ్చు.
-ఎడిటోరియల్ డెస్క్