ఈ ఎంపీకి నో ఎంట్రీ ?
అధికార వైసిపి పార్టీ లో లుకలుకలు క్యాడర్ కి తలనొప్పులు గా మారాయి. గోదావరి జిల్లాల్లో తిరుగులేని మెజారిటీ సాధించిన వైసిపి ఇప్పుడు సొంత పార్టీలో వేరు [more]
అధికార వైసిపి పార్టీ లో లుకలుకలు క్యాడర్ కి తలనొప్పులు గా మారాయి. గోదావరి జిల్లాల్లో తిరుగులేని మెజారిటీ సాధించిన వైసిపి ఇప్పుడు సొంత పార్టీలో వేరు [more]
అధికార వైసిపి పార్టీ లో లుకలుకలు క్యాడర్ కి తలనొప్పులు గా మారాయి. గోదావరి జిల్లాల్లో తిరుగులేని మెజారిటీ సాధించిన వైసిపి ఇప్పుడు సొంత పార్టీలో వేరు వేరు కుంపట్లు ఎక్కువ అవుతూ ఉండటంతో కుదేలు అవుతుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్ రామ్ పోకడలు ప్రోటోకాల్ వివాదాలతో ఎమ్యెల్యేలకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయని ప్రచారం నడుస్తుంది. దాంతో ఎంపి భరత్ కి మొహమాటం లేకుండా మా నియోజకవర్గాలకు రాకండి బాబు అంటూ చెప్పేశారని టాక్. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో మొత్తం ఏడు నియోజకవర్గాలు వున్నాయి. అందులో రాజమండ్రి అర్బన్, రూరల్ లలో టిడిపి విజయం సాధించింది. మిగిలిన రాజానగరం, అనపర్తి నియోజకవర్గాలతోపాటు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల్లో ఎంపికి నో ఎంట్రీ బోర్డు తగిలించారని అంటున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో తానేటి వనిత మాత్రం కొన్ని కారణాల రీత్యా ఎంపి భరత్ ఎంట్రీకి అభ్యంతరం చెప్పడం లేదంటున్నారు.
అనుభవరాహిత్యమేనా …?
రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ మార్గని భరత్ రామ్ యువకుడు. రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేని వ్యక్తి. పొలిటికల్ ఎంట్రీకి ముందు సినీ హీరో గా కొన్ని సినిమాల్లో కూడా నటించారు భరత్. ఆయన తండ్రి మార్గాని నాగేశ్వరరావు కు బిసి సంఘం నేతగా రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరే వుంది. ఆయన బ్రాండ్ నేం కారణంగానే భరత్ కి బిసి కోటాలో జగన్ టిక్ పెట్టారు. సంప్రదాయంగా కమ్మ సామాజిక వర్గానికే ఏ పార్టీ అయినా సీటు ఇచ్చే రాజమండ్రి స్థానాన్ని గత ఎన్నికల్లో జగన్ మార్చి బిసి కి కేటాయించారు. వైసిపి హవాలో భరత్ రామ్ ఎంపి గా మంచి మెజారిటీతో గెలిచినా అందరితో సఖ్యతగా మెలగడంలో ఫెయిల్ అయినట్లు ప్రచారం నడుస్తుంది. తాను ఎంపీని కాబట్టి తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ తో పాటు ఆయన కోటరీ చేసే హంగామా మిగిలిన నేతలకు ఆయన్ను దూరం పెడుతున్నట్లు పార్టీలో చర్చ సాగుతుంది. రాజమండ్రిలో వైసిపి బలహీనంగా వున్న నేపథ్యంలో నామినేటెడ్ పోస్ట్ ల భర్తీకి ఇటీవల పార్టీ నేతలు ప్రయత్నం చేస్తే తమ వారికే అగ్రతాంబూలం ఇవ్వాలని ఎంపి భరత్ పట్టుబట్టడంతో ఆ పోస్ట్ లు పెండింగ్ లో పడటంతో క్యాడర్ లో అసంతృప్తి పెల్లుబికింది. అవి కూడా తమ సామాజికవర్గం వారికే దక్కాలన్న పట్టు పట్టడంతో సీనియర్ నేతలు ఎంపీ పోకడలపై అసంతృప్తి గా వున్నారని చెబుతున్నారు.
ప్రోటోకాల్ కోసం తరచూ వివాదాలు …
ప్రోటోకాల్ కోసం తరచూ ఎంపి భరత్ ఆయన వర్గం చేస్తున్న వివాదాలు వైసిపి కి చెడ్డపేరు తెస్తున్నాయని అంటున్నారు. దేవాదాయ శాఖ అధికారుల నుంచి వివిధ శాఖల అధికారులకు ఆహ్వాన పత్రికలు లేదా శిలాఫలకాలపై తన పేరు ముందు వుండాలంటూ ఎంపి భరత్ హుకుం జారీచేస్తున్నారని అంటున్నారు. వాస్తవానికి స్థానిక కార్పొరేటర్, మేయర్, ఎమ్యెల్యే, ఆ తరువాత ఎంపీ, మంత్రి పేరు ప్రోటోకాల్ ఉంటాయి. అయితే అలా కాకుండా ముందు తనపేరు వుండాలని ఎంపి భరత్ పట్టుబట్టడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారని వైసిపి వర్గాలే అంటున్నాయి. అలాగే సీనియర్ నేతలను గౌరవించడంలో కానీ వారిని కలుపుకోవడంలో సైతం ఆయన పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీటిపై ఇప్పటికే అధిష్టానం కు కొందరు ఫిర్యాదు చేశారని తెలుస్తుంది.
ఫిర్యాదులతో దూరం పెడుతున్నారా … ?
భరత్ యువ ఎంపి కావడంతో ముఖ్యమంత్రి జగన్ సైతం ఆయనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఆయన అమెరికా పర్యటనకు సైతం భరత్ ని తీసుకువెళ్లడం గమనార్హం. అయితే ఇటీవల జగన్ ఢిల్లీ పర్యటనలో భరత్ ఎక్కడా కనిపించకపోవడానికి కారణం ఏమిటన్న చర్చ మొదలైంది. వైసిపి వర్గాల ఫిర్యాదులతోనే ఆయన భరత్ ను దూరం పెడుతున్నారా అనే అనుమానాలు పార్టీలో పొడసూపుతున్నాయి. ప్రధాని, హోం మంత్రి, న్యాయ మంత్రులతో భేటీల్లో జగన్ రాజమండ్రి ఎంపి ని తీసుకువెళ్ళలేదు. అదే ఇప్పుడు పార్టీ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే నియోజకవర్గాల్లో వున్న కార్యక్రమాల రీత్యా ఎంపి ఆ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు ఎంపి వర్గం చెబుతుంది.
టార్గెట్ భరత్ …
టివి ఛానెల్స్ చర్చల్లో పార్టీ వాయిస్ ను బలం గా వినిపించే భరత్ ను కూడా చేర్చి టిడిపి అధినేత చంద్రబాబు ఇసుక స్కామ్ లో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అదికూడా ఆయన కు బ్లాక్ షీట్ తెచ్చి పెట్టింది. ఒక పక్క అవినీతి రహిత పాలన అని జగన్ సర్కార్ ప్రకటిస్తూ సాగుతున్న నేపథ్యంలో ఎంపి భరత్ పై ఆరోపణలు కొత్త వివాదానికి తెరతీశాయి. ఇదిలా ఉంటే రాజమండ్రిలో కీలకమైన నిర్మాణాల అనుమతులకు సైతం ఎంపి భరత్ నో చెపుతున్నారంటూ టిడిపి సైతం ఆరోపణలు గుప్పిస్తుంది. ఇలా యువ ఎంపి భరత్ రామ్ పై ఒక పక్క ప్రత్యర్ధులు మరోపక్క సొంత పార్టీలోనూ ముప్పేట దాడి జరుగుతుంది. రాబోయే స్థానిక ఎన్నికల లోగా ఈ పరిణామాలు సద్దుమణగకపోతే మాత్రం రాజమండ్రి అర్బన్ రూరల్ లలో బలహీనంగా వున్న వైసిపికి మరింత గడ్డు పరిస్థితి తప్పదని ఆ పార్టీ క్యాడర్ ఆందోళనలో వుంది. మరి అధినేత జగన్ దీన్ని ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి.