కీలక సమయంలో సుచరిత మౌనం.. వెనుక ఏం జరిగిందంటే..!
రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరితకు సంబంధించి కొన్నాళ్లుగా ప్రచారంలో ఉన్న ఒక విషయం నిజమేనని అంటున్నారు హోంశాఖ అధికారులు. ఆమెకు హోం శాఖ పగ్గాలైతే [more]
రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరితకు సంబంధించి కొన్నాళ్లుగా ప్రచారంలో ఉన్న ఒక విషయం నిజమేనని అంటున్నారు హోంశాఖ అధికారులు. ఆమెకు హోం శాఖ పగ్గాలైతే [more]
రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరితకు సంబంధించి కొన్నాళ్లుగా ప్రచారంలో ఉన్న ఒక విషయం నిజమేనని అంటున్నారు హోంశాఖ అధికారులు. ఆమెకు హోం శాఖ పగ్గాలైతే ఇచ్చారు కానీ, గతంలో వైఎస్ చేసినట్టుగానే ఇప్పుడు జగన్ కూడా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. నిజానికి ఈ విషయాలు ఆమె మంత్రిగా పగ్గాలు చేపట్టినప్పుడే ప్రచారంలోకి వచ్చాయి. తర్వాత రాజధాని ఉద్యమం విషయంలోనూ నిజమని అనుకున్నారు. అయితే పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో అమలవుతున్న లాక్డౌన్ తదనంతర జనతా కర్ఫ్యూ వంటి వాటి నేపథ్యంలో హోం మంత్రి ఫుల్ గా సైలెంట్ అయిపోవడంతో సదరు ప్రచారానికి బలం చేకూరుతోంది.
అప్పట్లో సబిత కూడా….
విషయంలోకి వెళ్తే.. గతంలో వైఎస్ జమానాలో 2004లో ఆయన ఉమ్మడి ఏపీ సీఎంగా అధికారం చేపట్టాక హోంశాఖ మంత్రిగా మహిళను ఎంపిక చేసుకున్నారు. అప్పట్లో పటోళ్ల సబితా ఇంద్రారెడ్డిని హోం మంత్రిని చేశారు. అయితే, అప్పట్లో ఆమె పేరుకే హోం మంత్రి. కానీ, కీలకమైన శాంతి భద్రతల విభాగం మాత్రం వైఎస్ తన చేతికిందే ఉంచుకున్నారు. దీంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా కూడా ఆయన లెక్కచేయలేదు. ఆ తర్వాత వైఎస్ మరణాంతరం రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి ఇద్దరు సీఎంగా ఉన్నప్పుడు సైతం పోలీసుల వ్యవహారం హద్దు మీరిన సమయంలోనూ (తెలంగాణ ఉద్యమ సమయంలో) హోం మంత్రిగా ఉన్న సబిత ఏమీ చేయలేక పోయారు. చాలా బదిలీలు కూడా ఆమెకు తెలియకుండానే జరిగిపోయేవి.
సేమ్ సీన్ ఇప్పుడు కూడా….
ఇక ఇప్పుడు ఏపీలో దళిత నాయకురాలు, వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలు మేకతోటి సుచరితకు జగన్ హోం మంత్రి బాధ్యతలు అప్పగించారు. ఎస్సీ + మహిళా కోటాలో ఆమెకు మంత్రి పదవి ఇవ్వడం సంచలనమే అయ్యింది. అయితే ఈ పదవి ఆనందం సుచరితకు మూన్నాళ్లు ముచ్చటే అయ్యింది. అయితే ఈమెకు కూడా గతంలో వైఎస్ మాదిరిగానేజగన్ శాంతి భద్రతలకు సంబంధించిన అధికారాలు ఇవ్వలేదని ఆదిలోనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాజధాని ప్రాంతంలో ఉద్యమం ప్రారంభమైనప్పుడు పోలీసులు ఉత్తిపుణ్యాన లాఠీచార్జీలు చేసినా ఆమె మౌనం పాటించాల్సి వచ్చింది. విషయం సీఎం వరకు వెళ్లే వరకు ప్రభుత్వం స్పందించలేక పోయింది. దీంతో జిల్లా మంత్రిగా ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
పోలీసుల బదిలీలు సయితం…
ఇక, ఇప్పుడు కరోనా నేపథ్యంలోనూ ప్రజలకు అవేర్ నెస్ కల్పించాల్సిన పోలీసులు లాఠీలతో కుళ్లబొడుస్తున్నారు. దీంతో వారిని హెచ్చరించేందుకుకానీ, లేదా మంత్రిగా సూచనలు చేసేందుకు కానీ సుచరిత ఆసక్తి చూపించడం లేదు. ఓ వైపు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అంతా రాష్ట్రంలో ప్రతి అంగుళాన్ని జల్లెడ పడుతున్నా సుచరిత మాత్రం ప్రెస్మీట్లు పెట్టి దీనిపై ప్రభుత్వం.. పార్టీ తరపున బలమైన వాయిస్ వినిపించడం కూడా చేయడం లేదు. చాలా జిల్లాల్లో కీలక పోలీస్ అధికారుల బదిలీలు ఆమెకు తెలియకుండా జరుగుతున్నాయట.
సొంత జిల్లాలోనూ….
చివరకు సొంత జిల్లాలోనూ మేకతోటి సుచరిత మాట చెల్లుబాట కావడం లేదని ఆఫ్ ద రికార్డుగా పార్టీ నేతలే చెపుతున్నారు. ఇదే విషయంపై హోంశాఖ వర్గాలతో మీడియా చిట్‌చాట్‌గా మాట్లాడినప్పుడు అంతా సీఎం చేతిలోనే ఉందని అనడం గమనార్హం. అంటే రాష్ట్రంలో హోం మంత్రిగా మేకతోటి సుచరిత ఉన్నప్పటికీ.. అత్యంత కీలకమైన శాంతి భద్రతల విషయం మాత్రం సీఎం జగన్ తన చేతిలోనే ఉంచుకున్నారని స్పష్టత వచ్చింది. ఈ కారణంగానే సుచరిత చేయడానికేం లేదు… కనీసం మాట్లాడేందుకు కూడా ఇష్టపడడం లేదట.