దూరం పెరుగుతుందా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కావస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లడంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. జగన్ ప్రధాన [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కావస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లడంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. జగన్ ప్రధాన [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కావస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లడంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. జగన్ ప్రధాన ప్రయారిటీ ప్రజలకు తాను ఇచ్చిన హామీలన్నింటినీ అందించడమే. అందుకోసం ఆయన ప్రతిరోజూ శాఖల వారీగా సమీక్షలు చేస్తున్నారు. జగన్ పూర్తిగా సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెడితే జిల్లాల్లో మాత్రం మంత్రులకు, ఎమ్మెల్యేలకు పొసగడం లేదు. మంత్రుల వద్దకు వెళ్లేందుకు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు ఇష్టపడటం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఒక్క చిత్తూరు జిల్లా మినహా దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉందనే చెప్పాలి. మంత్రి పదవి దక్కలేదని కొందరు, తామే సీనియర్లమని మరికొందరు మంత్రులను దూరం పెడుతున్నారు.
మంత్రిని పక్కన పెట్టి….
అనంతపురం జిల్లాను తీసుకుంటే అక్కడ మంత్రిగా ఉన్న మాలగుండ్ల శంకరనారాయణను ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. ప్రధానంగా సీనియర్ నేతలు ఆయనను లైట్ గా తీసుకుంటున్నారు. జిల్లా అభివృద్ధి, తమ నియోజకవర్గ సమస్యలను చర్చించాలన్నా నేరుగా జగన్ వద్దకో, విజయసాయిరెడ్డి వద్దకో వెళుతున్నారు. మంత్రి శంకరనారాయణ ఒక రకంగా చెప్పాలంటే జిల్లాలో ఏకాకిగా మిగిలిపోయారు. ఇక కర్నూలు జిల్లాను తీసుకుంటే అక్కడ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ఉన్నారు. ఆయన పట్ల కూడా సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు దూరంగా కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు ఉంటున్నారు.
సీనియర్ నేతలు…..
కడప జిల్లాలో ఉన్న మంత్రి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషాను ఎవరూ లెక్క చేయడం లేదు. ఈజిల్లాకుచెందిన జగన్ ముఖ్యమంత్రి గా ఉండటంతో ఆయనతోనే నేరుగా చర్చిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు వస్తే ఇక్కడ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు ఎమ్మెల్యేలు ఎవరూ సహకరించడం లేదు. నెల్లూరు జిల్లాలో సీనియర్ నేతలు ఉండటంతో మంత్రి జిల్లా పర్యటనకు వచ్చినా పెద్దగా పట్టించుకోవడం లేదు. సీనియర్ నేతలైన ఆనం రామనారాయణరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వరప్రసాద్ వంటి నేతలు మంత్రి కార్యక్రమాలకు కూడా పెద్దగా హాజరు కావడంలేదు. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేలతో టచ్ లో ఉంటారు.
వైవీ, విజయసాయిలతోనే…..
ఇక ప్రకాశం జిల్లాలో మాత్రం కొంత పరవాలేదనే చెప్పాలి. మంత్రి బాలినేనిశ్రీనివాసులరెడ్డి, ఆదిమూలపు సురేష్ లు కొంత ఎమ్మెల్యేలతో సమన్వయంతో వెళుతున్నారు. గుంటూరు జిల్లాలోనూ మేకతోటి సుచరిత హోంమంత్రి అయినప్పటికీ ఆమెను పట్టించుకునే వారే లేరు. ఇక కృష్ణా జిల్లాలో మంత్రి వెల్లంపల్లిని పలకరించే వారే లేరు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు మంత్రులున్నప్పటికీ ఇక్కడ ఎమ్మెల్యేలు ఎక్కువగా వైవీ సుబ్బారెడ్డితోనే టచ్ లో ఉంటారు. తూర్పు గోదావరిదీ అదే పరిస్థితి. విశాఖ కు వచ్చే సరికి బలమైన నాయకుడు అవంతి శ్రీనివాస్ ఉన్నప్పటికీ విజయసాయిరెడ్డి తోటే ఎమ్మెల్యేలు తమ సమస్యలను చెప్పుకుంటారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ బలమైన మంత్రులున్నప్పటికీ అక్కడి వైసీపీ నేతలు ఎక్కువగా భూమన కరుణాకరెడ్డితోనే తమ బాధలు చెప్పుకుంటున్నారు. ఇలా మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లేమి దాదాపు అన్ని జిల్లాల్లో కన్పిస్తుంది. ఈ ప్రభావం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పడే అవకాశముంది.