పేరుకే ఉందట…. అంతా బై చెప్పేశారుగా
ఎన్డీఏ అన్నది ఇక పేరుకే ఉంది. నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ లో ఉన్న పార్టీలన్నీ తప్పుకుంటుండటంతో ఇక బీజేపీ ఏకాకిగానే మిగలనుంది. ఎన్డీఏ దాదాపు రెండు దశాబ్దాల [more]
ఎన్డీఏ అన్నది ఇక పేరుకే ఉంది. నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ లో ఉన్న పార్టీలన్నీ తప్పుకుంటుండటంతో ఇక బీజేపీ ఏకాకిగానే మిగలనుంది. ఎన్డీఏ దాదాపు రెండు దశాబ్దాల [more]
ఎన్డీఏ అన్నది ఇక పేరుకే ఉంది. నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ లో ఉన్న పార్టీలన్నీ తప్పుకుంటుండటంతో ఇక బీజేపీ ఏకాకిగానే మిగలనుంది. ఎన్డీఏ దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఏర్పడింది. కాంగ్రెస్ ను వ్యతిరేకించే పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అయితే వాజ్ పేయి హయాం వరకూ ఎన్డీఏ సక్రమంగానే కొనసాగింది. ఆయన హయాంలో ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ఎన్డీఏలో చేరిన పార్టీల సంఖ్య పెరిగిందే తప్ప తరగలేదు.
వీళ్ల హయాంలోనే…..
కానీ మోదీ, షా హయాంలో ఒక్కొక్కటిగా ఎన్డీఏ నుంచి వెళ్లిపోతున్నాయి. అయితే దీనికి ప్రధాన కారణం బీజేపీకి మిత్రులతో అంత పెద్దగా అవసరం లేకపోవడమే. రాజ్యసభలో అవసరం ఉంది కాబట్టి మిత్రులను దగ్గరకు చేర్చుకుంటున్నారు తప్పించి ఆ అవసరమూ లేకపోతే ఎన్డీఏ బోర్డును మోదీ, షాలు ఎప్పుడో పీకేసేవారన్న వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిళ్లలో విన్పిస్తున్నాయి. ముఖ్యంగా రెండోసారి అధకారంలోకి వచ్చిన తర్వాత ఉన్న పార్టీలు ఒక్కొక్కటిగా వెళ్లిపోతున్నాయి.
వరసగా తలాక్ లు…..
2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏలో ప్రధాన భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం తలాక్ చెప్పేసింది. దీనికి రాజకీయ కారణాలున్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతోనే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం ఎన్డీఏకు రాం రాం చెప్పేసింది. ఇక మహారాష్ట్ర ఎన్నికల తర్వాత శివసేన సీఎం పదవి కోసం ప్రయత్నించి భంగపడి వేరుకుంపటి పెట్టుకుంది. శివసేన ఎన్డీఏ నుంచి యూపీఏకు ఫిఫ్ట్ అయింది.
ఇక మిగిలింది ఒకరిద్దరే…..
ఇక బీహార్ ఎన్నికల సందర్భంగా లోక్ జనశక్తి పార్టీ ఎన్డీఏ నుంచి తప్పుకుంది. ఇక వచ్చే ఏడాదిన్నరలో పంజాబ్ ఎన్నికలు జరగనున్నాయి. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలంగా ఎన్డీఏతో ఉన్న అకాలీదళ్ కూడా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఎన్నికలు జరిగే బీహార్ లో ఉన్న జేడీయూ మాత్రమే ఎన్డీఏతో ఉంది. కొన్ని చిన్నా చితకా పార్టీలు తప్ప ఎన్డీఏ అనేది ఏమీ లేదనే చెప్పాలి. అయితే బయటనుంచి అన్నాడీఎంకే, వైసీపీ, బిజూ జనతాదళ్ వంటి పార్టీలు అంశాల వారీగా ప్రభుత్వానికి మద్దతిస్తున్నాయి తప్పించి, ఎన్డీఏ లో ఇప్పుడు బీజేపీ మినహా ప్రధాన పార్టీ ఏమీ లేదనే చెప్పాలి.