నంద్యాలలో మళ్లీ ఫ్యాన్ జోరేనా..?
నవనందుల కోట నంద్యాల పార్లమెంటు నియోజకవర్గానిది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం. దేశానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రిగా పనిచేసిన నేతలు నంద్యాల నియోజకవర్గం నుంచి గెలుపొందిన చరిత్ర ఉంది. [more]
నవనందుల కోట నంద్యాల పార్లమెంటు నియోజకవర్గానిది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం. దేశానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రిగా పనిచేసిన నేతలు నంద్యాల నియోజకవర్గం నుంచి గెలుపొందిన చరిత్ర ఉంది. [more]
నవనందుల కోట నంద్యాల పార్లమెంటు నియోజకవర్గానిది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం. దేశానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రిగా పనిచేసిన నేతలు నంద్యాల నియోజకవర్గం నుంచి గెలుపొందిన చరిత్ర ఉంది. రాష్ట్రపతిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి 1977లో నంద్యాల నుంచి విజయం సాధించారు. తర్వాత ప్రధాని హోదాలో పీవీ నరసింహారావు నంద్యాల నుంచి ఉప ఎన్నికలో పోటీ చేసి ఘన విజయం సాధించారు. రాయలసీమలోని కీలక లోక్ సభ నియోజకవర్గాల్లో ఒకటైన నంద్యాలలో ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఇద్దరూ కొత్త అభ్యర్థులే రెండు పార్టీల నుంచి పోటీ చేశారు. ఇక, జనసేన పార్టీ నుంచి చివరి నిమిషంలో సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి పోటీ చేశారు. దీంతో త్రిముఖ పోటీ ఉన్నా ప్రధానంగా గెలుపోటములు మాత్రం టీడీపీ, వైసీపీ మధ్యే ఉండే అవకాశం ఉంది.
ఇద్దరు కొత్త అభ్యర్థుల మధ్యే పోటీ
నంద్యాల నియోజకవర్గంలో 2014కి ముందు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉండేవి. ఇక్కడ గత మూడు ఎన్నికల్లోనూ ఎస్పీవై రెడ్డి విజయం సాధించి హ్యాట్రిక్ సృష్టించారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ తరపున భూమా నాగిరెడ్డి సైతం వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఫరూక్ పై 1 లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన ఎస్పీవై రెడ్డి ప్రమాణస్వీకారం కూడా చేయకముందే తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో ఆయన టిక్కెట్ కోసం ప్రయత్నించారు. అయితే, చంద్రబాబు నాయుడు మాత్రం ఎస్పీవై రెడ్డిని పక్కనపెట్టి నందికొట్కూరు అసెంబ్లీ ఇంఛార్జిగా ఉన్న మాండ్ర శివానందరెడ్డికి టిక్కెట్ ఇచ్చారు. దీంతో ఎస్పీవై రెడ్డి జనసేన పార్టీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేశారు. వైసీపీ నుంచి పలువురు నేతలు పేర్లు వినిపించినా చివరకు ఎన్నికల ముందు పార్టీలో చేరిన వ్యాపారవేత్త పోచ బ్రహ్మానందరెడ్డికి టిక్కెట్ ఇచ్చారు.
బలంగా ఉన్న వైసీపీ
నంద్యాల లోక్ సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఆరింటిలో వైసీపీకి మెజారిటీ వచ్చింది. నంద్యాల పార్లమెంటు పరిధిలో వైసీపీ బలంగా ఉండటంతో ఎస్పీవై రెడ్డి సులువుగా విజయం సాధించారు. అయితే, ఆళ్లగడ్డ, నంద్యాల, శ్రీశైలం ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడంతో ఈసారి తమకు నంద్యాల లోక్ సభ పరిధిలో బలం పెరిగిందని టీడీపీ అంచనా వేస్తోంది. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన శిల్పా, గంగుల కుటుంబాలు, చల్లా రామకృష్ణారెడ్డి, బిజ్జం పార్థసారథి రెడ్డి వంటి నేతలు వైసీపీలో చేరడంతో తమ బలం తగ్గలేదని, మరింత పెరిగిందని వైసీపీ ధీమాగా ఉంది. ముస్లింలు, రెడ్లు, బీసీలు నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. రెడ్లు, ముస్లింలలో వైసీపీ వైపు మొగ్గు ఉంటుందని, బీసీల్లో టీడీపీకి ఆధిక్యత వచ్చే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఎస్సీల్లో వైసీపీకే మొగ్గు ఉంటుంది. అయితే, ఎస్పీవై రెడ్డి ఎవరి ఓట్లు చీల్చాడనే అంశం గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది. మొత్తంగా నంద్యాలలో మరోసారి వైసీపీకే విజయావకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది.