వైసీపీ బలం ఇంత పెరిగిందా...??
తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రస్థానం బయటకి కనిపించినంత సాఫీగా లేదు. కష్టాలకు ఎదురీదక తప్పదు. క్యాడర్ లో నైతిక స్థైర్యం తగ్గకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పైకి చాలా గంభీరమైన ప్రకటనలు చేస్తున్నారు. ఈసారి 120 పైచిలుకు స్థానాలు సాధిస్తామంటున్నారు. కానీ వాస్తవం చేదుగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వ్యక్తిగతంగా నేతలు నిర్వహించుకున్న సర్వేలు, పార్టీ నిర్వహించిన సర్వేల్లో వివిధ నియోజకవర్గాలలో టీడీపీకి 40 నుంచి 45 శాతం మేరకు మాత్రమే మద్దతు లభిస్తోంది. వైసీపీ, టీడీపీలను పోల్చి నిర్వహించిన తటస్థ సర్వేల్లో పోటాపోటీ వాతావరణం నెలకొంటోంది. వైసీపీ సమఉజ్జీగా నిలుస్తోంది. జనసేన,వామపక్షాలు, బీజేపీ, కాంగ్రెసుల ఓట్ల చీలికతో సంబంధం లేకుండా ఈ సర్వేలు నిర్వహిస్తున్నారు. మిగిలిన పార్టీలతో కలిపి సర్వేలు చేస్తే టీడీపీ ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రల్లో దెబ్బతినే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాయలసీమలో వైసీపీ మొగ్గు కొనసాగుతోంది. సంతృప్తస్థాయి 70 శాతం పైగానే ఉందని అధినేత చేస్తున్న ప్రకటనలకు , గ్రౌండ్ లెవెల్ రియాలిటీకి మధ్య చాలా గ్యాప్ ఉందంటున్నారు. కాంగ్రెసుతో కలవడానికి ఈ సమీకరణలన్నీకారణమేనని తేల్చిచెబుతున్నారు.
కాంగ్రెసు బలపడాలి...
సామాజిక వర్గాల వారీగా వైసీపీ వైపు కనిపిస్తున్న మొగ్గును తటస్థీకరించాలంటే కాంగ్రెసు బలపడాలని టీడీపీ అధినేత బలంగా భావిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీకి ఓటు బ్యాంకుగా మారిన వర్గాల్లో అయిదు శాతం ఓట్ల చీలిక వస్తే చాలు. వైసీపీ 30 నియోజకవర్గాలను కోల్పోతుందని టీడీపీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం 72 స్థానాల వరకూ వైసీపీకి మొగ్గు ఉన్నట్లు తాజా సర్వేల సారాంశం. ఎన్నికల నాటికి ప్రభుత్వ వ్యతిరేకత మరింత పెరిగే ప్రమాదం ఉంది. దాంతో సమీకరణలు మారిపోతాయి. ప్రస్తుతమున్న బలానికి తోడు రెండు శాతం అదనపు ఓట్లు ప్రతిపక్షం వైపు మళ్లితే 25 సీట్లను ఆ పార్టీ కైవసం చేసుకోగలుగుతుందని సెఫాలజిస్టుల అంచనా. అదే టీడీపీ ఓట్లలో అయిదుశాతం చీలిక వస్తే 42 స్థానాలు చేజారిపోతాయంటున్నారు. ఇదంతా విపక్షంలో ఉన్న జనసేన, బీజేపీ, వామపక్షాల ప్రచార సరళిపై ఆధారపడి ఉంటుంది. సర్కారీ వ్యతిరేక ఓటు వైసీపీ వైపు సంఘటితం కాకుండా చూడాలనే లక్ష్యంతో తెలుగుదేశం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెసు బలపడాలని కోరుకోవడమూ అందులో భాగమే. జనసేన బలపడితే టీడీపీ ఓట్లలో చీలిక పెరుగుతుంది. కాంగ్రెసు బలపడితే వైసీపీ ఓట్లకు చిల్లుపడుతుందనే సాధారణ సూత్రీకరణ సర్వేల ద్వారా వెల్లడవుతోంది. ఇప్పటివరకూ టీడీపీ నిర్వహించుకున్న సర్వేల్లో జనసేనకు ఏడుశాతం వరకూ ఓట్లు వస్తాయని తేలింది. కాంగ్రెసు ఓటింగు రెండుశాతానికే పరిమితమైంది. ఈ బలాబలాలు న్యూట్రల్ కావాలంటే కాంగ్రెసు బాగా పుంజుకోవాలి.
టీఆర్ఎస్ తో ట్రయల్...
తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో తన ప్రాబల్యాన్ని నిలుపుకోవడానికి టీఆర్ఎస్ తో పొత్తు కోసం తీవ్రంగా ప్రయత్నించింది. ఆంధ్రప్రదేశ్ తోపాటు తెలంగాణలోనూ లోక్ సభ స్థానాలు సాధించగలిగితే, ఏపీలో అధికారం కోల్పోయినా కేంద్రంలో పట్టు ఉంటుందని భావించింది. కానీ కేసీఆర్ దీనిని తోసిపుచ్చారు. బీజేపీతో టీడీపీకి దూరం పెరగడం ఇందుకు ఒక కారణం. మరోవైపు తెలుగుదేశం పార్టీ మళ్లీ తెలంగాణపై, టీఆర్ఎస్ పై పెత్తనం చేస్తుందేమోనన్న సందేహమూ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చి తెలంగాణలో తగినంత సంఖ్యలో సీట్లు సాధిస్తే టీడీపీ కొత్త డిమాండ్లు పెట్టవచ్చు. టీఆర్ఎస్ కు సొంతంగా మెజార్టీ రాకపోతే చంద్రబాబు చుక్కలు చూపించే అవకాశం ఉంది. కాంగ్రెసును బలపరిచినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ రకమైన ఆలోచనలన్నిటినీ మదింపు చేసుకున్న తర్వాతనే కేసీఆర్ టీడీపీతో పొత్తుకు నిరాకరించారు. టీడీపీ తనంతట తాను ముందుకు వచ్చినా టీఆర్ఎస్ తిరస్కరించడానికి చంద్రబాబు పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటారన్న భయమే కారణం. అనుకున్నట్లుగానే టీఆర్ఎస్ కాదనగానే కాంగ్రెసుకు చేరువై పోయారు చంద్రబాబు.
కూడితే..కూటమే...
తెలంగాణలో పొత్తు ఫలించి గణనీయమైన సంఖ్యలో అసెంబ్లీ స్థానాలు సాధించగలిగితే టీడీపీ భవిష్యత్తు వ్యూహం మొత్తం మారిపోతుంది. ఆంధ్రప్రదేశ్ లోనూ కలిసి నడిచేందుకు ఆటంకాలు తొలగిపోతాయి. కేంద్రంలో కాంగ్రెసు పార్టీ గెలవాల్సిన అవసరం ఉందంటూ ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ తెలంగాణలో గెలుపు సాధించకపోతే కాంగ్రెసు పొత్తు వ్యవహారం ముందుకు సాగదు. ఒకరిద్దరు మినహా ఏపీ కాంగ్రెసు నాయకులు టీడీపీతో చెలిమిని తప్పనిసరి అవసరంగానే చూస్తున్నారు. దీనివల్ల పీసీసీ అద్యక్షుడు రఘువీరా సహా పన్నెండు నియోజకవర్గాల్లో సీనియర్ కాంగ్రెసు నేతలు విజయం సాధించే అవకాశాలు ఏర్పడతాయంటున్నారు. పొత్తు లేదా పరోక్ష సహకారం లేకపోతే ఏ ఒక్క నియోజకవర్గంలోనూ కాంగ్రెసు గెలిచే సూచనలు లేవు. అందువల్ల పార్టీలో ఇంకా మిగిలిన ఏపీ కాంగ్రెసు నాయకులు టీడీపీ పొత్తును స్వాగతిస్తున్నారు. తెలంగాణలో విజయం సాధిస్తే ఏపీలో తమకు రాజకీయంగా పునర్జన్మ లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. కాంగ్రెసుకు పునరుజ్జీవం, తెలుగుదేశానికి పునరధికారం అనే రెండు లక్ష్యాలతో దీర్ఘదృష్టితోనే చంద్రబాబు,రాహుల్ కలిసి నడుస్తున్నారంటున్నారు.
-ఎడిటోరియల్ డెస్క్
- Tags
- andhra pradesh
- ap politics
- indian national congress
- janasena party
- k.chandrasekharrao
- nara chandrababu naidu
- pavan kalyan
- telangana rashtra samithi
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కె. చంద్రశేఖర్ రావు
- జనసేన పార్టీ
- తెలంగాణ రాష్ట్ర సమితి
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- భారత జాతీయ కాంగ్రెస్
- రాహుల్ గాంధీ
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
- ిrahul gandhi