చిక్కుల్లో చంద్రుడు...!!!
తనకు కష్టమొస్తే ప్రపంచానికి కష్టమొచ్చినట్లు. తన పార్టీ ఇబ్బందుల్లో ఉంటే దేశం, రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయినట్లు నమ్మించగలిగినవాడే నేత. ఆ విధంగా చెబుతూ ప్రజలను కూడా ఒప్పించాలి. అప్పుడే సర్వజనసమ్మతి సాధించగలం. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడిది ఈరకమైన వ్యూహరచనలో అందె వేసిన చేయి. భారతీయ జనతాపార్టీతో చేతులు కలిపినా, దానిని తిరస్కరించినా కారణాలు చెప్పి ప్రజలను అందుకు సన్నద్ధం చేయగలరు. ఇప్పటికి రెండు సార్లు బీజేపీతో చేతులు కలిపి మళ్లీ దూరమయ్యారు. ఇదంతా ప్రజలు, రాష్ట్రం కోసమే అని చెబుతున్నారు. రాష్ట్రంలో సీబీఐ ప్రవేశించకుండా నిరోధించారు. ఇదీ రాష్ట్రంపై కక్ష సాధింపును నిరోధించడానికే అని వివరణలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు అనువైన వాతావరణాన్ని ఆరునెలల ముందుగానే నెలకొల్పారు. పార్టీకి రాష్ట్రంలో సానుకూల పవనాలు వీచేలా పావులు కదుపుతున్నారు. అటు కాంగ్రెసుతో చేతులు కలిపి ఇదీ ఏపీ ప్రయోజనాల కోసమని మెజార్టీ సమ్మతిని పొందగలిగారు. తెలంగాణలో పార్టీని నిలబెట్టేందుకు పక్కా ప్లాన్ వేశారు. అంతా బాగానే ఉన్నప్పటికీ సన్నిహితులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విసురుతున్న పరిశోధనాస్త్రాలనుంచి మాత్రం తప్పించలేకపోతున్నారు. సీఎం రమేశ్, సుజనా చౌదరి వంటి వారిపై కేంద్రసంస్థల దాడులు టీడీపీని ఇరుకున పెడుతున్నాయి.
ఎన్నికల ముంగిట్లో...
తెలంగాణలో నిన్నామొన్నటివరకూ తెలుగుదేశం పార్టీ నిస్తేజంగా ఉంది. చంద్రబాబు నాయుడు అమరావతికి మకాం మార్చిన తర్వాత పార్టీని ప్రజల్లో ఉంచే బాధ్యతను కొంతకాలం పాటు రేవంత్ నిర్వర్తించారు. ఆయన కాంగ్రెసు కండువా కప్పుకున్న తర్వాత పట్టించుకునేవారు కరవు అయ్యారు. నాయకులున్నప్పటికీ జనాకర్షక శక్తి లోపించింది. ప్రజలను ఆకట్టుకుని అధికారపార్టీని టార్గెట్ చేసే నాయకులు లేకుండా పోయారు. ఎంతో కొంత నియోజకవర్గ స్థాయి గ్లామర్ ఉన్ననేతలను టీఆర్ఎస్ ఆకర్షించి తనలో కలిపేసుకుంది. ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు అధికారపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో తొలి నుంచి ఉంటూ ఇంకా అగ్రనాయకత్వానికి విధేయులుగా ఉన్న వారిని వేళ్లమీదనే లెక్కపెట్టవచ్చు. వారికి పార్టీలో సముచిత స్థానం ఉన్నప్పటికీ ప్రజల్లో పలుకుబడి లేదు. టీడీపీకి ప్రతినియోజకవర్గంలోనూ వేల సంఖ్యలో ఓటర్లున్నారు. కానీ గెలుపు సాధించి పెట్టగల సంఖ్య కాదు. కాంగ్రెసుతో అసెంబ్లీ ఎన్నికలకు పొత్తు కుదిరిన తర్వాత ఎన్నో కొన్ని సీట్లు గెలుచుకోగలమన్న నమ్మకం టీడీపీలో నెలకొంది. ఇప్పుడు కేంద్రమాజీ మంత్రి సుజనాచౌదరి పై దాడుల నేపథ్యంలో పార్టీ కి కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. సుజన కార్యకలాపాలకు ప్రధానకేంద్రం హైదరాబాద్ కావడమే ఇందుకు కారణం.
ఏపీలోనూ ఇక్కట్లు...
సీబీఐను నిలువరించాలి. కేంద్రాన్ని నిలదీయాలి. తమ సత్తా చాటాలి. రాజకీయంగా గరిష్టంగా లబ్ధి పొందాలి. ఇవే లక్ష్యాలతో కేంద్ర నేరపరిశోధక సంస్థకు ఏపీ ప్రభుత్వం గేట్లు మూసేసింది. కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపును నిరోధించడానికే ఈ చర్య అని ప్రకటించింది. ఇప్పడు సుజనా చౌదరిపై చర్య ను నిరోధించడం ఏపీ ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. 5700 కోట్ల రూపాయల అక్రమాలకు సంబంధించిన మూలాలన్నీ హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు లలో కేంద్రీక్రుతమై ఉన్నాయి. ఆయనపై ఆర్థిక నేరాల అభియోగాలున్నాయని తెలిసి కూడా చంద్రబాబు తమ పార్టీ తరఫున కేంద్రమంత్రిని చేశారు. రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా చేశారు. సుజనా చౌదరిని తన మంత్రివర్గంలో చేర్చుకోవడానికి నరేంద్రమోడీ కొంత విముఖత చూపినప్పటికీ బలవంతంగా అంటకట్టారు. ఇవన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయి. ఇప్పుడు తీవ్ర అభియోగాలతోపాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడంతో నిస్సహాయస్థితిలో పడిపోయింది తెలుగుదేశం. సుజనా చౌదరి తమ వాడు కాదని చెప్పలేదు. ఆధారాల సహా ఉన్న ఆర్థిక అక్రమాలను ఖండించలేదు. జగన్ పై నమోదైన కేసులు, ఆర్థిక వ్యవహారాలను టీడీపీ ఇంతవరకూ ప్రచారం సాగిస్తూ ఎన్నికలలో లబ్ధి పొందాలని చూస్తోంది. తాజా వ్యవహారంతో ఈవిషయంలో నోటికి తాళం వేసుకోకతప్పదు. సుజనా చౌదరిని, చంద్రబాబు నాయుడిని వైసీపీ ఒకే గాటన కట్టి తూర్పారబట్టే అవకాశం ఉంది. ఇక టీడీపీకి ఏపీలోనూ కష్టకాలమే.
ఆర్థికమూలాలకు చెక్...
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గానికి 25 కోట్లరూపాయల మేరకు వెచ్చించేందుకు తెలుగుదేశం సన్నద్ధమవుతోందని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. నిధుల సమీకరణ, తరలింపునకు సంబంధించి ఇప్పట్నుంచే ఏర్పాట్లు సాగుతున్నాయనే సమాచారమూ వ్యాపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ముందరికాళ్లకు బంధం వేయాలంటే ఆర్థిక మూలాలను దెబ్బతీయాలి. అందులో భాగంగానూ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణలను చూడాల్సి ఉంటుంది. 2009, 2014 ఎన్నికల్లో తెలుగుదేశానికి ఆర్థికంగా అండగా నిలిచిన వారిలో సుజనాచౌదరి, సీఎం రమేశ్ లు కీలక వ్యక్తులు. అందుకు ప్రతిగానే రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెట్టారు. ఇటీవలనే సీఎం రమేశ్ పై ఆదాయపన్నుశాఖ దాడులు చేసింది. తాజాగా సుజనాపై పాతకేసులన్నిటినీ తిరగదోడుతూ ఎన్ ఫోర్సు మెంటు ఉచ్చు బిగించింది. టీడీపీ పెద్ద కాతాలకు దీంతో చెక్ పెట్టినట్లయింది. తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో ఆర్థిక సాయం అందించాలనుకుంటున్న మిగిలిన కాంట్రాక్టు, వ్యాపార, రాజకీయవేత్తలు సైతం జాగ్రత్త పడిపోతారు. ఇకపై నిధుల ప్రవాహం అంత ఈజీ కాదు. రానున్న కాలంలో టీడీపీకి ఇది ఇబ్బందికర పరిణామమే.
-ఎడిటోరియల్ డెస్క్
- Tags
- andhra pradesh
- ap politics
- cm ramesh
- janasena party
- nara chandrababu naidu
- pavan kalyan
- sujana choudary
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
- సీఎం రమేష్
- సుజనా చౌదరి