క్యా కమాల్ కియా
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా సందర్శించడం ఇది ఆరోసారి. తొలి దఫా అయిదేళ్ల పాలనలో అయిదు సార్లు అగ్రరాజ్యాన్ని సందర్శించారు. అంటే సగటున ఏడాదికి ఒకసారి వాషింగ్టన్ [more]
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా సందర్శించడం ఇది ఆరోసారి. తొలి దఫా అయిదేళ్ల పాలనలో అయిదు సార్లు అగ్రరాజ్యాన్ని సందర్శించారు. అంటే సగటున ఏడాదికి ఒకసారి వాషింగ్టన్ [more]
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా సందర్శించడం ఇది ఆరోసారి. తొలి దఫా అయిదేళ్ల పాలనలో అయిదు సార్లు అగ్రరాజ్యాన్ని సందర్శించారు. అంటే సగటున ఏడాదికి ఒకసారి వాషింగ్టన్ వెళ్లారు. తాజాగా ఈ ఏడాది మే నెలలో రెండోసారి అధికారాన్ని చేప్టటిన తర్వాత నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించడం ఇది తొలిసారి. గత ప్రధానులతో పోలిస్తే నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు భిన్నంగా ఉంటాయి. ఇంతకు ముందు భారత అధినేతలు విదేశీ పర్యటనల్లో అధికారిక కార్యక్రమాలకే పరిమితమయ్యేవారు. చర్చలు, ఒప్పందాలు, సంయుక్త ప్రకటనలు, విలేకరుల సమావేశాలతోనే సరిపుచ్చే వారు. ఆ దేశ ప్రముఖలతో మాట్లాడటం, ఆయా దేశాల చట్టసభలను ఉద్దేశించి ప్రసంగించడం చేసేవారు. కానీ నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ఒకింత భిన్నంగా సాగుతుంది.
ఎప్పుడు పర్యటించినా…..
అధికారిక కార్యక్రమాలతో పాటు అనధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. స్థానికంగా నివసించే ప్రవాస భారతీయులను కలుసుకోవడానికి, వారితో మాట్లాడటానికి, వారిని ఉద్దేశించి ప్రసంగించడానికి ప్రాధాన్యమిచ్చేవారు. స్థానిక యువతతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపేవారు. ప్రోటోకాల్ ను పక్కన పెట్టి ప్రవాస భారతీయులతో మమేకమవుతారు. తాము ఉంటున్న దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని, అదే సమయంలో మాతృభూమి రుణం తీర్చుకోవాలని విజ్ఞప్తి చేస్తారు. ఈ సమావేశాలకు ప్రజల నుంచి పెద్దయెత్తున స్పందన లభించేది. 2014లో ప్రధాని పగ్గాలు చేప్టటిన తర్వాత సెప్టెంబరు నెలాఖరులో అమెరికాను నరేంద్ర మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా న్యూయార్క్ లోని మాడిసన్ స్క్వేర్ లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం ఉర్రూత లూగించింది. ఈ సమావేశానికి ప్రవాస భారతీయులు వేల సంఖ్యలో హాజరయ్యారు.
హౌడీ మోడీతో….
నరేంద్ర మోదీ తాజా అమెరికా పర్యటనకు ప్రాధాన్యముంది. 370, 35ఎ అధికరణ రద్దు తర్వాత ఆయన చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం. ఈ నెల 21న బయలుదేరిన ఆయన అగ్రరాజ్యంలో 27వ తేదీ వరకూ ఉంటారు. ఈ సందర్భంగా వివిధ దేశాధినేతలతో చర్చలు జరుపుతారు. ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రసంగిస్తారు. అన్నింటికన్నా “హౌడీ మోడీ” కార్యక్రమం అతి ముఖ్యమైంది. టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో 50 వేల మందికి పైగా ప్రవాసభారతీయులు పాల్గొన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సహా వివిధ రంగాల ప్రముఖులు దీనికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రవాస భారతీయులతో పాటు అమెరికన్ల నుంచి భారీ స్పందన లభించింది. ఇలాంటి కార్యక్రమాలకు ఆ దేశాధినేత ట్రంప్ హాజరవ్వడం ఇదే ప్రధమం. దానిని బట్టి నరేంద్ర మోదీ పర్యటనకు , భారత్ కు అగ్రరాజ్యాధినేత ఇస్తున్న ప్రాధాన్యం ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. భారత్ పొడగిట్టని చైనా, పాకిస్థాన్ లకు ఇది ఎంతమాత్రం మింగుడు పడని పరిణామం.
ఇరు దేశాలకూ అవసరమే…..
భారత్ లో చమురుకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇరాన్ పై అమెరికా ఆంక్షల తర్వాత ఆ దేశం నుంచి భారత్ కు చమురు దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో అమెరికా వైపు భారత్ దృష్టి సారించింది. అమెరికా పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు. వాణిజ్య యుద్ధం కారణాలు అమెరికా నుంచి చమురు కొనుగోలును చైనా ఆపివేసింది. దీంతో చమురుకు సంబంధించి భారత్ -అమెరికాలకు ఒకరి అవసరం మరొకరికి ఏర్పడింది. అమెరికాలో చమురును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో టెక్సాస్ ఒకటి. ప్రపంచ చమురు రాజధానుల్లో ఒకటిగా టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరానికి పేరుంది. ఈ సందర్భంగా దాదాపు16 చమురు కంపెనీల అధినేతలతో నరేంద్ర మోదీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్సినెమోబిల్, బీపీ, షెల్ వంటి ప్రముఖ చమురు కంపెనీల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. చమురు సహజ వాయువు రంగాల్లో భారత్ ప్రధాన మార్కెట్ అని వారికి నరేంద్ర మోదీ వివరించారు. సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడుల తర్వాత భారత్ చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇంతకు ముందు అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ నుంచి చమురు దిగుమతి ఆగిపోయింది. ఈ నేపథ్యంలో భారత్ కు అమెరికా అవసరం ఎంతగానో ఉంది. గత ఏడాది 400 కోట్ల డాలర్ల విలువైన చమురు, గ్యాస్ ను అమెరికా నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. ఈ ఏడాది దీనిని మరింత పెంచాలన్నది లక్ష్యం. అమెరికా నుంచి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ను భారత్ కొనుగోలు చేస్తోంది. ఇది అమెరికా ఎగుమతుల్లో 4.7 శాతం.
ట్రంప్ హాజరు వెనక…..
కేవలం చమురు, గ్యాస్ మాత్రమే కాకుండా అంతకు మించిన బంధాన్ని ఆశించి నరేంద్ర మోదీ హ్యూస్టన్ వెళ్లారు. ఈ నగరంతో భారత్ కు అవినాభావ సంబంధం ఉంది. హ్యూస్టన్ కేంద్రంగా పనిచేస్తున్న దాదాపు 28 కంపెనీలు భారత్ లో 69 అనుబంధ కంపెనీలను నిర్వహిస్తున్నాయి. రెండు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యంలో హ్యూస్టన్ నగరం నాలుగో అతి పెద్ద గేట్ వే. ఇది భారత్ కు పదో అతిపెద్ద భాగస్వామ్య నగరం. ఈ వ్యాపారం విలువ సుమారు 430 కోట్ల డాలర్లు. ఈ నగరంలో నివసిస్తున్న లక్షల మంది భారతీయులు అమెరికా ఆర్థికవ్యవస్థ పురోగమనంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. హౌడీ మోడీ కార్యక్రమానికి అధ్యక్షుడు ట్రంప్ రాకకు ప్రత్యేక కారణముంది. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష్య ఎన్నికల్లో ప్రవాస భారతీయుల మద్దతు ఆయనకు ఎంతో కీలకం. సహజంగా ప్రవాస భారతీయులు డెమొక్రాట్ల వైపు మొగ్గు చూపుతారు. ఈసారి వారిని ఎలాగైనా తమ వైపు తిప్పుకోవాలన్నది ట్రంప్ ఆలోచన. నరేంద్ర మోదీ హ్యూస్టన్ కార్యక్రమానికి హౌడీ మోడీ అని పేరు పెట్టడం వెనక ఆసక్తికర నేపథ్యం ఉంది. అమెరికా నైరుతి ప్రాంతాల్లో ప్రతి ఒక్కరినీ స్నేహపూర్వకంగా హౌ డూ యూ డూ అని పలకరిస్తారు. సంక్షిప్తంగా దానిని హౌడీ అని పిలుస్తారు. దీంతో ప్రాస కుదిరేలా నరేంద్ర మోదీ హ్యూస్టన్ సభకు హౌడీ మోడీ అని పేరు పెట్టారు.
-ఎడిటోరియల్ డెస్క్