హ..హ..హ.. అదే నాబలం
ప్రధాని నరేంద్రమోడీ కుండబద్దలు కొట్టేశారు. మళ్లీ తానే ప్రధాని నంటూ తాజా ఇంటర్వ్యూలో తేల్చి పారేశారు. కావాలంటే చూసుకోండి మీ వెనక ఉన్న గురివిందలు. మీరా బీజేపీని ఓడించేదంటూ ప్రతిపక్షాలను ఎగతాళి చేశారు. పైకి అహంభావ పూరితం అనిపించవచ్చు. కానీ ఆయన చెప్పిన మాటల్లోని నిజాలు తోసిపుచ్చలేనివి. మహాకూటమి కట్టగల సామర్ధ్యం మీకు లేదంటూ విపక్షాలను ఆట పట్టించారు. ఏ సంకీర్ణ కూటమికి అయినా కేంద్రబిందువు ఉండాలి. మీ పార్టీల సంకీర్ణాన్ని పట్టి ఉంచే బోల్టు ఏది? ఇరుసు ఎక్కడ? ఎక్కే గడప దిగే గడప అన్నట్లుగా అస్తిత్వం కోసం పాకులాడుతున్న కాంగ్రెసు పార్టీ పెద్ద దిక్కు కాగలదా? తమకు తామే ప్రధాని అభ్యర్థులుగా భావించుకునే ప్రాంతీయనేతలకు పగ్గాలు చేపట్టేంత పస ఉందా? అసలు ప్రతిపక్షాల ఐక్యత అనేదే అతిశయోక్తి. తనపై ద్వేషం, అధికారం పై ఆశ మాత్రమే వారిని కూటమి కట్టమని ప్రేరేపిస్తున్నాయంటూ మోడీ కడిగిపారేశారు. ఆయన చేసిన విమర్శలు, ఆరోపణల్లో కొన్ని పాక్షిక సత్యాలున్నప్పటికీ మొత్తానికి మొత్తంగా కొట్టిపారేయలేని చేదు నిజాలను దేశం ముందు ఆవిష్కరించారు. వారి బలహీనతే తన బలమంటూ చాటిచెప్పారు.
ఎందుకీ ద్వేషం...?
ప్రధాని నరేంద్రమోడీపై వ్యక్తిగత ద్వేషం వివిధ పార్టీలను వెన్నాడుతోంది. కాంగ్రెసు అధినేత రాహుల్ సహా, ప్రాంతీయపార్టీల నాయకులు మోడీని తమ ప్రత్యర్థిగా కాకుండా శత్రువుగా చూస్తున్నారు. అత్యంత ప్రజాదరణతో 30 సంవత్సరాల తర్వాత ఏకపార్టీకి మెజార్టీ సాధించిపెట్టిన వ్యక్తిగా మోడీ రికార్డులకెక్కారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రధాని పీఠం అధిష్టించారు. రాజకీయంగా , విధానపరంగా విభేదించవచ్చు. కానీ కాంగ్రెసు మొదలు అన్నిపార్టీలు ఆయన పదవి స్వీకరించింది మొదలు దేశానికేదో ఉపద్రవం ముంచుకొస్తోందన్నట్లుగా దుష్ప్రచారానికి తెర తీశాయి. కొందరు సోకాల్డ్ లౌకికవాదులు జాతీయ అవార్డులను తిరిగి ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టారు. దానికి రాజకీయ పార్టీలు వత్తాసు ఇచ్చాయి. ఈ చర్యలన్నీ మోడీ మరింతగా బలపడటానికి, దేశంలో మెజార్టీఇజం నెలకొనడానికి, హిందూ..ఇతర వర్గాల విభజనకు దోహదం చేశాయి. తగినంత కాలవ్యవధి ఇవ్వకుండా ప్రధానిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన చిల్లర వ్యవహారాల కారణంగా టాలెస్టు పర్సన్ గా లార్జెర్ దేన్ లైఫ్ సైజుకి ఎదిగిపోయాడు మోడీ. 2019 ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాల్లో గెలుస్తుందో లేదో ఎవరూ గ్యారంటీగా చెప్పలేకపోతున్నారు. కానీ అన్ని సర్వేల్లోనూ దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకునిగా ఈనాటికీ మోడీనే ఫస్టు ర్యాంకు సాధిస్తున్నాడు.
ఎవరు ప్రధాని..?
ముఖ్యంగా విపక్షాలు కూటమి కట్టాలనుకున్నప్పుడు దానికి నాయకత్వం వహించేవారు ఎవరు? దీనిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. యువకుడైన రాహుల్ సారథ్యంలో పనిచేసేందుకు ముఖ్యమైన ప్రాంతీయ పార్టీల నాయకులు సిద్దంగా లేరు. టీఎంసీ, బీఎస్పీ, ఎస్పీ, ఎన్సీపీ వంటి పార్టీలు రాహుల్ నాయకత్వాన్ని తిరస్కరిస్తున్నాయి. మమత, ములాయం, శరద్ పవార్ వంటివారు ప్రధాని పీఠాన్ని ఆశిస్తున్నారు. దళిత కోటాలో తాను పోటీకి సై అంటున్నారు మాయావతి. ఉత్తరప్రదేశ్ లో ఎస్పీతో పొత్తు కుదుర్చుకుంటే సీఎం సీటును అఖిలేష్ కు వదిలేసేందుకు తనను ప్రధాని అభ్యర్థిగా బలపరచాలనే డిమాండును ముందుకు తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రాహుల్ గాంధీ ఇప్పటికే తాను ప్రధాని రేసులో ఉన్నానని చెప్పుకోవాల్సి వచ్చింది. అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెసు చుట్టూ అన్ని పార్టీలు చేరాల్సి ఉంది. కానీ ఇప్పుడు వాటి దయాదాక్షిణ్యాలకోసం దేబిరించాల్సిన పరిస్థితిలో పడింది కాంగ్రెసు పార్టీ. ఈ బలహీనతను ఎత్తిచూపుతూ ప్రధాని తిరిగి తమదే అధికారం అని ప్రకటించేశారు. ఐక్య కూటమి కట్టాలంటే ప్రధాని అభ్యర్థి ఎవరు? అసలు కూటమికి నాయకత్వం వహించే పార్టీ ఏదో ముందు తేల్చుకోండి అంటూ సవాల్ విసిరారు.
కొంప ముంచే కర్నాటకం..
కర్ణాటకలో కాంగ్రెసు, జేడీఎస్ ప్రయోగాన్ని బీజేపీ చాలా తెలివిగా వాడుకోబోతోంది. ప్రధాని మాటల్లోని ఆంతర్యమిదే. దినదినగండం , కలహాల కాపురం సాగిస్తున్న కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వాన్ని దేశ ప్రజల ముందు దోషిగా నిలపబోతోంది బీజేపీ. ఇప్పటికిప్పుడు కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చేసే ఆలోచన కమలనాథులకు లేదు . ఆ ప్రభుత్వం ఎంతగా భ్రష్టు పట్టిపోతే 2019 ఎన్నికల్లో తమకు అంత లాభమనే యోచనలో ఉన్నారు. విఫలప్రయోగంగా దీనిని దేశం మొత్తానికి చూపించాలనే వ్యూహంతో ఉన్నారు మోడీ, అమిత్ షాలు. విపక్షాల పాలనకు కర్ణాటక ఓ సూచిక అంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యల్లోని ఆంతర్యమిదే. విపక్షాలను ఎన్నుకుంటే రాజకీయ అస్థిరతతో దేశ భద్రతకే ప్రమాదం కలిగిస్తారనే దిశలో ప్రచారం సాగించేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. కర్ణాటక కుమ్ములాటలు, పదవీ పంపకాలు, అలకలు, పైరవీలు అన్నీ 2019లో బీజేపీకి బ్రహ్మాస్త్రాలు కాబోతున్నాయి. మోడీ మాటల్లోని మర్మాన్ని గ్రహించి విపక్షాలు ఇప్పటికైనా మేలుకోకపోతే పుట్టి మునగడం ఖాయం.
ఎడిటోరియల్ డెస్క్