నెహ్రూ లాగే…పాకులాడి..?
పర్సనాలిటీ కల్ట్.. వ్యక్తి ఆరాధన. నాయకుల కొంప ముంచేస్తుంది. తాము దైవాంశ సంభూతులమని నాయకులు భావించుకుంటూ ఉంటారు. చుట్టు చేరిన భజన బృందాలు నాయకుడిని ఆ తరహా [more]
పర్సనాలిటీ కల్ట్.. వ్యక్తి ఆరాధన. నాయకుల కొంప ముంచేస్తుంది. తాము దైవాంశ సంభూతులమని నాయకులు భావించుకుంటూ ఉంటారు. చుట్టు చేరిన భజన బృందాలు నాయకుడిని ఆ తరహా [more]
పర్సనాలిటీ కల్ట్.. వ్యక్తి ఆరాధన. నాయకుల కొంప ముంచేస్తుంది. తాము దైవాంశ సంభూతులమని నాయకులు భావించుకుంటూ ఉంటారు. చుట్టు చేరిన భజన బృందాలు నాయకుడిని ఆ తరహా భ్రాంతికి లోను చేస్తుంటాయి. ప్రధాని నరేంద్రమోడీ ఆ కోవలో ఎప్పుడో చేరిపోయారు. పార్టీలో మోడీ కంటే సీనియర్ నేత , మన తెలుగు నాయకుడు ప్రస్తుత ఉప రాస్ట్రపతి వెంకయ్య నాయుడే నరేంద్రమోడీని దైవం పంపిన దూతగా అభివర్ణించేశారు. ఇక చిన్నాచితక నాయకులు పొగడటంలో పెద్ద వింతేమీ లేదు. ఈ పర్సనాలిటీ కల్ట్ లో పడి తమకున్న సుగుణాలను మరిచి పోతుంటారు. దేశానికి మించి తామే గొప్పవారమనే బావనకు లోనవుతుంటారు. తొలి భారత ప్రధాని నెహ్రూ ఇలాగే దెబ్బతిన్నారు. తనను తాను విశ్వ మానవునిగా భావించుకునేవారు. వ్యక్తిగతంగా తనకు అంతర్జాతీయ నాయకత్వ ముద్ర కోసం పాకులాడే వారు. ఆ క్రమంలోనే దేశ ప్రయోజనాలకూ నీళ్లొదిలేసిన సందర్బాలున్నాయి. తాజాగా నరేంద్రమోడీ సైతం అక్కడే దెబ్బతిన్నారు. దేశంలో ప్రస్తుతం తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు.
పరువు పాయె…
దేశానికి స్వాతంత్ర్యం లభించిన తొలి నాళ్లలో దేశ నాయకత్వానికి పెద్ద సవాళ్లు లేవు. పేదరికం, అవిద్య, మౌలిక వసతుల లేమి వంటివి ఉన్నప్పటికీ రాజకీయ నాయకత్వానికి ప్రమాదం లేదు. రాజకీయ స్థిరత్వం ఉండేది. ప్రపంచ శాంతి దూతగా తన బ్రాండ్ ఇమేజ్ కోసం నెహ్రూ దేశానికి సంబంధించి పట్టు పట్టాల్సిన అంశాల్లో రాజీ పడటం ప్రారంభించారు. పక్కలో బల్లెంలా ఉండే చైనాతో హిందీ చీనీ భాయి బాయి నినాదానికి తెర తీశారు. తల బొప్పి కట్టించుకున్నారు. మన సైన్యాలు విజృంభించి జమ్ము కశ్మీర్ ను పూర్తిగా బారత్ అధీనంలోకి తెస్తుంటే యుద్ధవిరమణ చేసి కశ్మీర్ లో కుంపటికి కారణమయ్యారు. అమెరికాకు చేరువయ్యే ప్రయత్నాలతో రష్యాతో అనుమానానికి గురయ్యారు. తాజాగా ప్రధాని నరేంద్రమోడీ ప్రపంచ దేశాల అగ్రనేతలతో సంబంధాలు, చైనాతో చెలిమి , మన దేశానికి ఇబ్బందులున్నా కరోనా వాక్సిన్లు విదేశాలకు ఎగుమతులు వంటి చర్యలతో అచ్చం నెహ్రూనే తలపించారు. అవన్నీ ఒకటొకటిగా వికటిస్తున్న ధోరణులు కనిపిస్తున్నాయి. మోడీ ఒంటరిగా మిగిలిపోతున్నారు. నిన్నామొన్నటి వరకూ నరేంద్రమోడీ భజన చేసిన సొంత పార్టీ కూడా తలెత్తుకోలేకపోతోంది. తన ఆర్థిక అవసరాలకు అనుగుణంగా నగదు విలువను తగ్గిస్తున్న కరెన్సీ మానిపులేటర్ గా భారత్ పై అమెరికా ఆరోపణలు గుప్పిస్తోంది. భారత్ కు నష్టం కలిగించే విధంగా వ్యాపార లావాదేవీలలో మార్పులకు సిద్ధమవుతోంది. ఇటీవలే చైనా భారత్ భూభాగాలపై దాడి చేసి మన సైనికుల మరణాలకూ కారణమైంది. ఒకవైపు విదేశాలకు భారత్ వాక్సిన్లు సరఫరా చేస్తుంటే , మరోవైపు దేశంలో వాక్సిన్లు లేని పరిస్థితి ఏర్పడింది. ఇదంతా మోడీ తనను తాను విశ్వనాయకుడిగా నిరూపించుకునే క్రమంలో జరిగిన ఉద్దేశపూర్వక నిర్ణయాల ఫలితాలే.
మొహం మొత్తింది…
భారతీయ జనతాపార్టీగా జనసంఘ్ పూర్వ రూపానికి సైద్దాంతిక భూమిక నిచ్చింది అటల్ బిహారీ వాజపేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషిలు. వారెవరూ తామే పార్టీ అని క్లెయిం చేసుకోలేదు. పార్టీని వ్యవస్థగానే చూశారు. తన వ్యక్తిత్వ విశేషంతో అనేక పార్టీలను ఒకే గూటికి తెచ్చి ఆరేళ్లపాటు పరిపాలన అందించారు వాజపేయి, దేశానికి సేవ చేసేందుకు తనకు ప్రజలిచ్చిన వరంగా బావించారు. రథయాత్రతో బీజేపీ వ్యాప్తికి పునాదులు వేసిన అద్వానీ ఏనాడూ పార్టీకి తాను ఏకచ్చత్రాధిపతిని కావాలని కోరుకోలేదు. వాజపేయి వెంట లక్ష్మణునిలా ఒదిగిపోయారు. కానీ నరేంద్రమోడీ దేశానికి లభించిన వరంగా భుజకీర్తులు తగిలించాయి, బీజేపీ స్కంధావారాలు. ప్రదాని ఏ నిర్ణయం తీసుకున్నా శభాసో అంటూ ప్రశంసించాయి. ఫిబ్రవరి నెలలోనే కరోనాను మోడీ తరిమి కొట్టేశారంటూ పార్టీయే తీర్మానం చేసేసింది. ఈ అత్యుత్సాహం కారణంగానే ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన రాజీనామాకు దేశవ్యాప్తంగా సోషల్ మీడియా హోరెత్తి పోతోంది. విదేశాల్లోని భారతీయులూ నినదిస్తున్నారు.
ఇందిర మోడీ కాదు..
నిజానికి నరేంద్రమోడీని ఇందిరాగాందీతో పోలుస్తుంటారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ ప్రతిష్ఠ కోసం పాకులాడలేదు. దేశ ప్రయోజనాలే అంతిమ లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. అగ్రదేశాలు బెదిరించినా లెక్క చేయకుండా అణుపరీక్షలు నిర్వహించారు. దేశ రక్షణ సత్తా చాటిచెప్పారు. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ను విడదీసి కాళ్లు కీళ్లు విరిచేశారు. అమెరికా, చైనా మన దేశం వైపు కన్నెత్తి చూడకుండా రష్యా మైత్రిని పొందారు. అధికార క్రీడలో ఎమర్జన్సీ విధించి తనకు చెడ్డ పేరు తెచ్చుకున్నప్పటికీ పేదరిక నిర్మూలన , సామ్యవాద రాజ్య స్థాపనకు ఇందిర విశేషమైన కృషి చేశారు. బ్యాంకులను జాతీయీకరించి నిధులను అందరికీ అందుబాటులోకి తెచ్చారు. అది ఇందిరాగాంధీ మార్కు పరిపాలన. మోడీ హయాంలో కార్పొరేట్, పెట్టుబడిదారీ వ్యవస్థలు బలపడుతున్నాయి. దేశంలో ధనిక, పేద మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. మొత్తం వ్యవస్థలన్నీ ప్రయివేటు బాట పడుతున్నాయి. అందువల్ల వ్యక్తి ఆరాధనలోనూ ఇందిరతో మోడీని పోల్చడం సరికాదు. వారసత్వం లేదన్న ఒకే ఒక్క సాకుతో ఒంటరి పెత్తనం మొదలు పెడితే దేశ మౌలిక స్వభావమే దెబ్బతింటుంది. వ్యక్తి ఆరాదననే నమ్ముకుంటే భవిష్యత్తులో భారతీయ జనతాపార్టీ తీవ్రమైన ఇబ్బందులను చవి చూడాల్సి వస్తుంది.
-ఎడిటోరియల్ డెస్క్