మోడీని మారిస్తే ఆయనే ప్రధాని అభ్యర్థా?
ఏడాది క్రితం రావాల్సిన కేంద్ర మంత్రి గడ్కరీ కి పోలవరం హఠాత్తుగా గుర్తుకు రావడంలో రాజకీయ కోణాలు చర్చనీయమవుతున్నాయి. తెలుగుదేశంతో పూర్తిగా సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యం. ఆరోపణలు, ప్రత్యారోపణలతో టీడీపీ, బీజేపీ ప్రధాన శత్రువులుగా ప్రవర్తిస్తున్న వైనం. కేంద్రంలో మూడో కూటమి దిశలో ఊపందుకున్న ప్రయత్నాలు. మోడీ, అమిత్ షా ల దూకుడుపై బీజేపీలోనే నిరసన స్వరాలు. 2019 తర్వాత ప్రధాని అభ్యర్థిని మార్చాల్సి వస్తుందేమోనని ఆర్ఎస్ఎస్ లోనే అనుమానాలు. వీటన్నిటి పూర్వరంగంలో గడ్కరీ వంటి గడుసు పిండం ఆంధ్రప్రదేశ్ లో పర్యటించడం ఆసక్తి గొలుపుతోంది. లౌక్యం, రాజకీయ నైపుణ్యం, ప్రగతిపూర్వక విధానాల మేలు కలయికగా గడ్కరీకి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ మంచి పేరుంది. ఆయనను వివాదరహితమైన వ్యక్తిగానే ఇతర పార్టీలు సంభావిస్తుంటాయి. ఇన్ని లక్షణాలు కలగలసిన గడ్కరీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పై దృష్టి సారించడం కీలకం పరిణామంగా రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.
క్రెడిట్ లో వాటా...
పోలవరం జాతీయ ప్రాజెక్టు. ఈ నిర్మాణానికి అయ్యే ఖర్చులో ప్రతిపైసా కేంద్రం చెల్లిస్తోంది. కానీ క్రెడిట్ రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యేలా బాబు చక్రం తిప్పుతున్నారు. సోమవారం పోలవారం పేరిట హడావిడి. వర్చువల్ తనిఖీల పేరిట చేసే సందడి. వెరసి సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది అన్నట్లుగా మారిపోయింది తంతు. బీజేపీ,టీడీపీ కలిసి ఉన్నప్పుడు ఏదోరకంగా కమలం పార్టీ నాయకులు సర్దుకుపోయారు. ఇప్పటికీ అదే తంతు కొనసాగుతుండటాన్ని సహించ లేకపోతున్నారు. దీనికి విరుగుడుగా కేంద్ర ప్రాజెక్టు అన్న విషయాన్ని చాటిచెప్పాలనుకుంటున్నారు. అదే సమయంలో పర్యవేక్షక బాధ్యత చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టాలని బీజేపీ నాయకులు కేంద్రాన్ని కొంతకాలంగా కోరుతున్నారు. దీనికి స్పందించిన గడ్కరీ రాజకీయ,సాంకేతిక కోణాల్లో ఆలోచించుకున్న తర్వాతనే పోలవరం పర్యటనను ఓకే చేశారు. నిర్మాణానికి సంబందం ఉన్న కేంద్రమంత్రి రావడంతో ఫైళ్లు పట్టుకుని మాకు నిధులివ్వండి అంటూ చంద్రబాబు అభ్యర్థించాల్సి వచ్చింది. ఇది ఒక రకంగా బీజేపీ నాయకులకు సంత్రుప్తినిచ్చిందనే చెప్పాలి.
బాబుతో మాట...
చంద్రబాబు నాయుడికి బీజేపీ అగ్రనేతలైన వాజపేయి, అద్వానీలతో సత్సంబంధాలు ఉండేవి. వెంకయ్యనాయుడు ఆత్మీయ మిత్రుడు. ఆ తర్వాత ఆ స్థాయి చనువు, చొరవ కలిగిన వారు బీజేపీలో లేకుండా పోయారు. గడ్కరీతో వర్కింగు రిలేషన్షిప్ బాగుందనేది అధికారవర్గాల సమాచారం. గతంలో నాగ్ పూర్ వెళ్లి మరీ చంద్రబాబు నాయుడు గడ్కరీని కలిశారు. ఆ తర్వాత చాలా సానుకూల ఫలితాలు లభించాయి. కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఇప్పుడు రాజకీయ కారణాలతో బాబు బీజేపీకి దూరమయ్యారు. కానీ కేంద్ర ప్రభుత్వంతో లైజనింగ్ చేయడం ఆయనకు అవసరం. కేంద్రానికీ ఆంధ్రప్రదేశ్ కీలక రాష్ట్రం. ఏపీలో నెలకొన్న పరిస్థితుల్లో టీడీపీకి రానున్న ఎన్నికల్లో ఏదో ఒక ఎమోషనల్ ఇష్యూ అవసరం. అందువల్లనే ఆయన బీజేపీని పక్కనపెట్టక తప్పని రాజకీయ అనివార్యత ఏర్పడింది. దీనిని సరిగానే అసెస్ చేస్తున్నారు కొందరు బీజేపీ నాయకులు. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రంపై టీడీపీ సర్కారు ఆధారపడక తప్పదు. దానిని ఆధారం చేసుకుంటూ కొంతమేరకు బాబుతో అధికారిక సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు మొదలయ్యాయి. కేంద్ర బీజేపీ నాయకులు గడ్కరీ పర్యటనను ఇందులో భాగంగానే చూస్తున్నారు.
ఆర్ఎస్ఎస్ తూటా...
ఆర్ఎస్ఎస్ కేంద్రస్థానమైన నాగపూర్ లో పుట్టి పెరిగారు గడ్కరీ. ఆ భావజాలంతో మమైకమైన వ్యక్తి. 2009 చివరినుంచి 2013 ప్రారంభం వరకూ బీజేపీ జాతీయ అధ్యక్షునిగా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ చొరవతోనే పార్టీ అధ్యక్షుడయ్యారు. మోడీ, అమిత్ షాల మొండి వైఖరి 2019లో పార్టీ అవకాశాలను దెబ్బతీయవచ్చని సంఘ్ శక్తులు భావిస్తున్నాయి. మిత్రులు దూరమయ్యారు. ప్రజల్లోనూ పలుకుబడి పలచనైపోయింది. కొన్ని పాజిటివ్ పాయింట్లు కూడా వారి ఖాతాలో జమ అయ్యాయి. బీజేపీ దేశవ్యాప్తంగా విస్తరించగలిగింది. కానీ దానిని నిలబెట్టుకోవాలి. కొత్తగా సమకూరిన శక్తిని సంఘటిత పరచుకోవాలి. అందుకుగాను ఆర్ఎస్ఎస్ కోర్ ఐడియాలజీతోపాటు సంయమన వ్యక్తిత్వం కలిగిన గడ్కరీ వంటి వారి అవసరం చాలా ఉంటుందనేది అంచనా. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏమాత్రం తేడా కొట్టినా అందర్నీ కలుపుకుపోగల వారి అవసరం పెరుగుతుంది. గడ్కరీ ఆ పాత్రకు అతికినట్లు సరిపోతాడనేది ఆర్ఎస్ఎస్ భావన. ఉపరితలరవాణా, జలవనరులు, మౌలిక వసతుల వంటి కీలక బాధ్యతలు చూస్తున్న గడ్కరీని ఉత్తరాధికార యోగ్యతలో భాగంగా దేశవ్యాప్తంగా పరిచయం చేసే కార్యక్రమాన్ని చేపడుతోంది బీజేపీ. కీలక రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రముఖ నేతలను ఆయన అధికారిక హోదాలో కలవబోతున్నారు. ఇది 2019 ఎన్నికల తర్వాత ఏర్పడబోయే పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముందస్తు వ్యూహం.
-ఎడిటోరియల్ డెస్క్
- Tags
- amith shah
- andhra pradesh
- ap politics
- bharathiya janatha party
- india
- indian national congress
- nara chandrababu naidu
- narendra modi
- nithin gadkari
- rashtriya swayam sevak polavaram
- telugudesam party
- y.s jaganmohanreddy
- ysr congress party
- అమిత్ షా
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- తెలుగుదేశం పార్టీ
- నరేంద్ర మోదీ
- నారా చంద్రబాబునాయుడు
- నితిన్ గడ్కరీ
- పోలవరం
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతదేశము
- భారతీయ జనతా పార్టీ
- రాష్ట్రీయ స్వయం సేవక్
- వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ