మళ్లీ రిపీట్ అయినట్లుంది
స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించగానే సరిగ్గా తొమ్మిది నెలల క్రితం పరిణామాలు గుర్తుకు వచ్చాయి. పాలక [more]
స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించగానే సరిగ్గా తొమ్మిది నెలల క్రితం పరిణామాలు గుర్తుకు వచ్చాయి. పాలక [more]
స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించగానే సరిగ్గా తొమ్మిది నెలల క్రితం పరిణామాలు గుర్తుకు వచ్చాయి. పాలక పక్షాల చెప్పు చేతల్లో ఉండటం వల్ల అవమానకర పరిస్థితుల మధ్య తమ స్థానాల నుంచి ఉన్నతాధికారులు ఎలా నిష్క్రమించాల్సి వచ్చిందో గుర్తుకు వచ్చింది.గత ఏడాది దాదాపు ఇదే సమయంలో ఎన్నికల సంఘం పరిధిలోకి ఎవరెవరు వస్తారు> అనే విషయం మీద వివాదం తలెత్తింది. వైసీపీ ఫిర్యాదు మీద ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడంపై అప్పటి ప్రభుత్వం హై కోర్టును ఆశ్రయించింది.
సాధారణ ఎన్నికల సమయంలోనూ….
ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదంలో అప్పటి ప్రతిపక్ష వైసీపీ కూడా ఇంప్లీడ్ అయ్యింది. ఎన్నికల సంఘం పరిధిలోకి వచ్చే అధికారుల జాబితా నుంచి నిఘా విభాగం అధిపతి ఏబీ వెంకటేశ్వర రావును మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేట పేరిట ఉత్తర్వులు జారీ చేయడం., ఆయన మెడకు చుట్టుకుంది. గత ఏడాది రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలయ్యాక అధికార, ప్రతిపక్షాలు నిత్యం కాలికి బలపం కట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర సీఈఓ కార్యాలయానికి తిరిగే వారు. రాష్ట్రంలో శ్రీకాకుళం, కడప, ప్రకాశం జిల్లాల్లో ఎస్పీలతో పాటు, ఇంటెలిజెన్స్ డీజీ మీద వైసీపీ నేతలు పలు మార్లు ఫిర్యాదులు చేయడంతో వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ జీవో 716 విడుదల అయ్యింది. ఆ తర్వాత నిఘా విభాగ అధిపతి ఏబీ వెంకటేశ్వర రావుని మినహాయిస్తూ జీవో 720 విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక ఎన్నికల సంఘ పరిధిలోకి వచ్చే అధికారుల జాబితా నుంచి నిఘా అధిపతిని మినహాయిస్తూ సీఎస్ పేరిట జీవో 721 విడుదల జారీ అయ్యింది. ఎన్నికల సంఘం తరపున వాదించిన న్యాయవాది ప్రకాష్ రెడ్డి., నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల సంఘం పరిధిలో ఉన్న డీజీ ఇంటెలిజెన్స్., సార్వత్రిక ఎన్నికల సమయానికి ఎలా రాకుండా పోతారని ప్రశ్నించడంతో అప్పటి అడ్వకేట్ జనరల్ న్యాయ స్థానానికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. సుదీర్ఘ వాదనల తర్వాత జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ సత్యనారాయణ ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. దీంతో ఏబీ వెంకటేశ్వర రావుని బదిలీ చేస్తూ జీవో 750 విడుదల అయ్యింది. అప్పటికే కడప, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలపై ఈసి బదిలీ వేటు వేసింది.
పాపం అనిల్ చంద్ర పునేట….
సార్వత్రిక ఎన్నికల వేళ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేట అవమానకర పరిస్థితుల్లో పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఆయనపై వేటు పడింది. నిజానికి ఆ రోజు జరిగిన పరిణామాలు ఈ రోజుకి బయటకు రాలేదు. కోర్టులో వాదనలు ముగిసిన సాయంత్రం ఇద్దరు, ముగ్గురు జర్నలిస్టులతో ఆయన ఏకాంతంగా మాట్లాడారు. కోర్టులో జరిగిన వాదనలు వింటున్న ఆయన., జీవో 721 గురించి విని ఉలిక్కి పడ్డారు. జీవో 721 నేను ఆపేసాను కదా… బయటకు ఎలా వస్తుంది అని ఆయన ఎదురు ప్రశ్నించారు. ఎన్నికల సంఘం న్యాయవాది ప్రకాష్ రెడ్డి, కోర్టులో జీవో సమర్పించారు అనగానే, సీఎస్ ముఖంలో నెత్తుటి చుక్క కనిపించలేదు. తన పీఎస్ ని లోపలికి పిలిచి జీవో 721 మనం జారీ చేశామా అంటే.., అతను అవునని బదులిచ్చారు. ఈసీ ఉత్తర్వులకి వ్యతిరేకంగా జీవో వద్దని చెప్పాను కదా అంటే పీఎస్ ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు.వె ళ్లి ఆ ఫైల్ తీసుకురా అని చెప్పడంతో, పీఎస్ బయటకు వెళ్లి ఆ ఫైల్ తీసుకు వచ్చాడు. కాసేపు ఫైల్ మొత్తం చూసిన పునేట., దీని మీద నేను ఏమి రాశాను అని అతడిని ప్రశ్నించాడు. అవతల నుంచి ఏమి సమాధానం రాలేదు. టేబుల్ మీద ఉన్న ఫైల్ విసిరికొట్టి., గెట్ ఔట్…. అని అరిచారు….. పీఎస్ బయటకు వెళ్లిన తర్వాత ఎర్రబారిన ముఖంతో “అంతా అయిపోయింది…30ఏళ్ల కెరీర్ నాశనం అయిపోయింది. నేను ఇవ్వని జీవో నా పేరుతో వచ్చేసింది. డిజిటల్ కీతో జీవో ఇచ్చేశారు. ఈసీ ఊరుకోదు…. నా మెడ మీదకి కత్తి వచ్చేసింది అన్నారు. నా కెరీర్ కి ఫుల్ స్టాప్ పడిపోయింది అని కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటే చెప్పారు. ఆ మర్నాడు ఆయన్ని తప్పించి కేంద్ర ఎన్నికల సంఘం ఎల్వి సుబ్రహ్మణ్యంకి సీఎస్ గా బాధ్యతలు అప్పగించింది.
వద్దని హెచ్చరించినా వినకుండా….
అదే రోజు ఆయన చాలా విషయాలు మాతో చెప్పారు. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయొద్దని నేను బ్రతిమాలాను. ఉదయం 9కి నన్ను పిలిచి లంచ్ మోషన్ వేయాలని చెప్పారు. నేను వద్దని వారించాను.వాళ్ళు వినలేదు…… ముఖ్యమైన వ్యక్తి కోర్టులో సవాలు చేయాల్సిందే అని ఆదేశించారు, ఆ తర్వాత నేను సెక్రటేరియట్ వచ్చే లోపు నాకు వరుసగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. సీఎం బంధువుల నుంచి నాకు ఫోన్లు వచ్చాయి. నేను వారికి వివరించి వారించే ప్రయత్నం కూడా చేశాను. నేను సెక్రటేరియట్ వచ్చి లీగల్ ఒపీనియన్ తీసుకునే అవకాశం కూడా ఏజీ నాకు ఇవ్వలేదు. నా వెనకే వచ్చిన ఏజీ కనీసం పత్రాలు చూడకుండానే సంతకాలు చేయించారు. ఇప్పుడు జీవో 721 కూడా నా ప్రమేయం లేకుండానే వచ్చిందని చెప్పినా నమ్మరు అన్నారు. ఆ తర్వాత అనిల్ చంద్ర పునేట నిష్క్రమణ ఏ హడావుడి లేకుండా ముగిసిపోయింది.
అధికారంలో ఉంటే అంతేనా….?
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గత వారం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయగానే ఏం జరగబోతుందో ఇట్టే అర్థం అయ్యింది. ఎన్నికలను ఏకగ్రీవం చేసే క్రమంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై అన్ని రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను హై కోర్ట్ రిజిస్ట్రీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్లాలని హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశించడం, రాష్ట్ర ఎన్నికల సంఘం క్రియాశీలకంగా లేకపోవడాన్ని న్యాయ స్థానం తప్పు పట్టడం, కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకునే పరిస్థితులు రావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అప్రమత్తం అయ్యింది. అదే సమయంలో రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరించడం, వైరస్ బాధితులు పెరుగుతుండటంతో ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేసింది. అదే సమయంలో ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు ఎస్పీలపై బదిలీ వేటు పడింది. హింసాత్మక ఘటనల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు పోలీస్ అధికారులపై వేటు పడింది. మొత్తం మీద అధికారంలో ఉన్న వారు ఎన్నికల వేళ ఎంత అప్రమత్తంగా ఉండాలో., అధికారిక విధులు నిర్వర్తించే వారు ఎంత బాధ్యతగా వ్యవహరించాలో., న్యాయస్థానాలు క్రియాశీలకంగా వ్యవహరిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వారు గుర్తెరిగి వ్యవహరించాల్సి ఉంటుంది.