అమరావతి అడుగులెటు….?
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై నీలి మేఘాలు. అనుమానపు నీడలు. సందేహాల ఛాయలు. కొత్త ప్రభుత్వం ఆలోచన ఏమిటనే దానిపై రకరకాల వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. అమరావతి కేపిటల్ సిటీగా [more]
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై నీలి మేఘాలు. అనుమానపు నీడలు. సందేహాల ఛాయలు. కొత్త ప్రభుత్వం ఆలోచన ఏమిటనే దానిపై రకరకాల వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. అమరావతి కేపిటల్ సిటీగా [more]
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై నీలి మేఘాలు. అనుమానపు నీడలు. సందేహాల ఛాయలు. కొత్త ప్రభుత్వం ఆలోచన ఏమిటనే దానిపై రకరకాల వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. అమరావతి కేపిటల్ సిటీగా కొనసాగుతుందంటూ ఎన్నికలకు ముందు పలు సందర్భాల్లో, ఇంటర్వ్యూల్లో జగన్ స్పష్టం చేస్తూ వచ్చారు. ఆ ప్రాంతంలో తన సొంత ఇంటి నిర్మాణాన్నే అందుకు సాక్ష్యంగానూ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక నిర్దిష్టమైన ప్రకటన చేయలేదు. ప్రతిపక్ష తెలుగుదేశం ఈ విషయంలో అనేక ఆరోపణలు గుప్పిస్తూ వస్తోంది. అమరావతిపై తాము వెనకడుగు వేసేది లేదని మంత్రుల స్థాయిలో చెబుతున్నప్పటికీ చోటు చేసుకుంటున్న పరిణామాలు మూడడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కి అన్నట్లుగా కనిపిస్తున్నాయి. రాజధాని ప్రాంతం ఎంపిక దగ్గర్నుంచే టీడీపీకి, వైసీపీకి మధ్య విభేదాలున్నాయి. శివరామకృష్ణ కమిటీ సూచించిన విధంగా రాజధానిని ఎంపిక చేయలేదని వైసీపీ గతంలో అభ్యంతరం చెప్పింది. అయితే కాలక్రమంలో సర్దుకుపోయే ధోరణినే అనుసరిస్తూ వచ్చింది. నిర్మాణానికి సంబంధించి ప్రాథమిక తంతు పూర్తయింది. అందువల్ల సర్కారు వెనకడుగు వేయడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. అయితే ఏ స్థాయిలో నిర్మాణం జరుగుతుంది? ఆర్థిక వనరుల సమీకరణ ఏవిధంగా చేస్తారనే విషయంలో భిన్నమైన వాదనలున్నాయి.
ఆది నుంచి కష్టాలే…
జలవనరులు సమృద్ధిగా ఉండి పచ్చని పంటపొలాలతో అలరారే 34 వేల ఎకరాలను రాజధానికి సమీకరించడంపై ప్రతిపక్షంతోపాటు పర్యావరణ వేత్తల సహా తొలినాళ్లలోనే వ్యతిరేకత పొడచూపింది. కేవలం వాస్తు లెక్కలను పరిగణనలోకి తీసుకుంటూ చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారనే వాదన ఉంది. కృష్ణాజిల్లా నూజివీడు పరిసరాలు, ప్రకాశం జిల్లా దొనకొండలో వేలాది ఎకరాలు ప్రభుత్వభూములు, అటవీ భూములు ఉన్నాయి. కొన్నింటికి కేంద్రప్రభుత్వ అటవీ పరిరక్షణ చట్టాలనుంచి అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ వెసులుబాటును వినియోగించుకోకుండా భూసమీకరణ పేరిట చంద్రబాబు నూతన విధానాన్ని ఎంచుకున్నారు. రియల్ ఎస్టేట్ ధరలను దృష్టిలో పెట్టుకుని మెజార్టీ రైతులు సైతం సహకరించారు. నదీపరివాహక ప్రాంతం, పర్యావరణ ఇబ్బందుల వంటివాటిని పక్కనపెట్టేశారు. దాంతో పర్యావరణ వేత్తలు, స్వచ్ఛందసంస్థలు, ఈ ప్రాంతంలోని కొందరు రైతులు, రిటైర్డ్ అధికారులు రాజధాని నిర్మాణంపై అనేక వేదికల నుంచి పోరాటం చేస్తున్నారు. న్యాయస్థానాలు, గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించి ఎప్పటికప్పుడు చికాకు పెడుతున్నారు. ఆదిలోనే హంసపాదులా అభ్యంతరాలు, సమస్యల మధ్యనే అమరావతి నగర నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పటికీ అప్పుడప్పుడు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి.
అద్భుతంపై ఆశలు…
ఆకాశ హర్మ్యాలు, నవ నగరాలు,ఆర్థిక, వాణిజ్య కేంద్రం, ప్రపంచంలోని ఉత్తమ రాజధానుల్లో ఒకటి వంటి కలలెన్నిటినో వండి వార్చింది గత ప్రభుత్వం. అత్యుత్తమ డిజైన్లతో , గ్రాఫిక్ మహేంద్రజాలంతో మైమరపింపచేసింది. కళ్లెదుట వాస్తవానికి, కలల ప్రపంచానికి మధ్య అడ్డుతెరలు తొలగించివేసింది. హైదరాబాద్ వంటి నగరాన్ని కోల్పోయిన ఆంధ్రప్రజలు అద్భుతం ఏదో జరుగుతుందనే ఆశలు పెంచుకున్నారు. కానీ ఇప్పుడు రాజధాని అమరావతి రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయనే కొత్త సంశయం మొదలైంది. మన అవసరాలకు తగినంతమేరకు రాజధాని ఉంటుందంటూ మంత్రులు ప్రకటిస్తున్నారు. మరి 34 వేల ఎకరాల భూసమీకరణ సంగతేమిటి? అత్యంత విలువైన ఆ భూమిని సద్వినియోగం చేయాలంటే సేవారంగానికి కేటాయించాలి. సర్వీసు సెక్టారుతో ఆర్థికంగా పరిపుష్టం చేయాలి. అప్పుడే రాజధాని విస్తరిస్తుంది. ఫైనాన్షియల్ హబ్ గా మారుతుంది. లేకపోతే పరిమితమైన పాలన కేంద్రంగానే ఉంటుంది. అయితే విస్తారంగా సేకరించిన భూములు, వాటి వినియోగానికి సంబంధించిన ప్రణాళిక ప్రభుత్వం వద్ద సిద్దంగా ఉంది. ప్రాజెక్టులో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి ప్రస్తుత ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. మొత్తం ప్రణాళికనే పక్కనపెట్టడం జరిగితే రైతాంగం నష్టపోతుంది. కోట్ల రూపాయలకు చేరిన భూమిలో సాగు మొదలు పెడితే గిట్టుబాటు కాదు. పైపెచ్చు నిర్మాణం పేరిట అక్కడక్కడ పనులు మొదలయ్యాయి. దాంతో తిరిగి రైతులకు భూములను వెనక్కి ఇవ్వడం అన్నది అంత సులభసాధ్యం కాదు. వారు కూడా అంగీకరించకపోవచ్చు.
తరతరాల దిక్సూచి…
రాజధాని నిర్మాణం, మౌలిక వసతుల కల్పన నుంచి ప్రపంచబ్యాంకు వైదొలిగిందనే వార్త ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురి చేసేదే. ప్రజలకూ ఆందోళన కలిగించేదే. ఏడువేల కోట్ల రూపాయల మేరకు ఆర్థికసాయం ఆశిస్తూ రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పిస్తే 2200 కోట్ల రూపాయలకు సూత్రప్రాయ ఆమోదం తొలుత లభించింది. రైతు సంఘాలు, పర్యావరణ వేత్తలు, మాజీ అధికారుల ఫిర్యాదు మేరకు ప్రపంచబ్యాంకు తనిఖీల బ్రుందం స్వయంగా ఈ ప్రాంతంలో పర్యటించింది. అటు సర్కారు వాదనలు, ఇటు ఫిర్యాదీ దారుల వాదనను తెలుసుకుంది. ప్రాజెక్టుపై మరింత స్పష్టత కోసం రాష్ట్రప్రభుత్వాన్ని వివరణ కోరింది. లోతుగా తనిఖీలు చేసేందుకు అనుమతులూ అడిగింది. ఈలోపు సర్కారు మారింది. ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు మరింత సమయం కావాలని వైసీపీ సర్కారు ప్రపంచబ్యాంకును అభ్యర్థించింది. ప్రపంచబ్యాంకు అనూహ్యంగా అమరావతి ప్రాజెక్టు రుణ మంజూరును విరమించుకుంది. దాంతో రాజకీయాలు రంగప్రవేశం చేశాయి. ఈ ప్రాజెక్టు రాకపోవడానికి అధికార వైసీపీ యే కారణమంటూ తెలుగుదేశం, పాత సర్కారు సమర్పించిన ప్రాజెక్టులో లోపాలుండబట్టే ప్రపంచబ్యాంకు ముందుకు రాలేదని వైసీపీ ఒకరినొకరు తిట్టిపోసుకుంటున్నారు. నిజానికి ప్రపంచబ్యాంకు రుణమంజూరుకు కొన్ని ప్రమాణాలు పెట్టుకుంటుంది. వాటిని సంతృప్తి పరచలేకపోవడంతోనే రుణం ఇవ్వాలన్న ఆలోచనను విరమించుకుంది. దీర్ఘకాలం పాటు చెల్లించే ప్రాతిపదికన అతి తక్కువ వడ్డీతో లభించే రుణమిది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏమంత సాఫీగా లేదు. సొంత నిధులతో అమరావతి నగర నిర్మాణం చేపట్టే సామర్థ్యం లేదు. అందువల్ల ప్రపంచబ్యాంకు వంటి ఆర్థిక సంస్థల సేవలను వినియోగించుకోవడం తప్పనిసరి. అధికారప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి అమరావతి పై అడుగు ముందుకెలా వేయాలనే అంశంపై శాసనసభా వేదికపైనే చర్చించడం సముచితం. రుణదాతలు ముందుకు రావడం లేదనే ప్రచారం రాష్ట్రప్రగతికి ప్రతిబంధకంగా మారుతుంది. పెట్టుబడి దారులకూ చెడు సంకేతాలు వెళతాయి. సత్వర దిద్దుబాటు చర్యలు ఎంతైనా అవసరం. వివిధ రాజకీయపక్షాలకు చెందిన ప్రభుత్వాలు వస్తుంటాయి. పోతుంటాయి. అవేవీ శాశ్వతం కాదు. రాజధాని ఏదో ఒకపార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు. కోట్లాది ప్రజల గుండె చప్పుడు. నవ్యాంధ్రకు దిక్సూచి. పరిపాలనకు ఆయువుపట్టు. పాలకప్రతిపక్షాలు ఈవిషయంలో ప్రాప్తకాలజ్ణతను ప్రదర్శిస్తేనే భావితరాలు పదికాలాలపాటు ఆయా నేతల సేవలను గుర్తు పెట్టుకుంటాయి.
-ఎడిటోరియల్ డెస్క్