వక్రమార్గం లో వ్యవస్థలు…?
ఒకవైపు వరస లాక్ డౌన్ లు , కఠిన కర్ఫ్యూలకు దేశం సిద్దమవుతోంది. ఇప్పటికే మహారాష్ట్ర, డిల్లీ, కర్ణాటక లాక్ డౌన్ లు పాటిస్తున్నాయి. దాదాపు ఏడెనిమిది [more]
ఒకవైపు వరస లాక్ డౌన్ లు , కఠిన కర్ఫ్యూలకు దేశం సిద్దమవుతోంది. ఇప్పటికే మహారాష్ట్ర, డిల్లీ, కర్ణాటక లాక్ డౌన్ లు పాటిస్తున్నాయి. దాదాపు ఏడెనిమిది [more]
ఒకవైపు వరస లాక్ డౌన్ లు , కఠిన కర్ఫ్యూలకు దేశం సిద్దమవుతోంది. ఇప్పటికే మహారాష్ట్ర, డిల్లీ, కర్ణాటక లాక్ డౌన్ లు పాటిస్తున్నాయి. దాదాపు ఏడెనిమిది రాష్ట్రాల్లో రాత్రుళ్లు కర్ఫ్యూ అమలు అవుతోంది. మరోవైపు సమాఖ్య వ్యవస్థగా ఉన్న భారత్ లో తంపులు పెట్టేందుకు రాజకీయ పార్టీలు తెగిస్తున్నట్లుగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజన్ ఆపేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి కోరడం విడ్డూరం. దాయాదుల తరహాలో అసూయ, స్వార్థంతో రగులుతున్నాయి రాష్ట్రాలు. తమ వైఫల్యాలను వేరే కోణంలోకి మళ్లించేందుకు నాయకత్వాలు తెలివైన ఎత్తుగడలు వేస్తున్నాయి. ఇదొక ప్రమాదకరమైన సంకేతం. తమ కష్టాలకు ఇరుగుపొరుగు రాష్ట్రాలే కారణమని నిందించేందుకు సిద్దమవుతున్నాయి. ఆయా రాష్ట్రాల కారణంగానే తమ ప్రాంతాల్లో వ్యాధి ప్రబలిందనే సాకులు వెదుకుతున్నాయి. ప్రతి పనిలోనూ క్రెడిట్ తన ఖాతాలోనే పడాలని కోరుకునే ప్రధానమంత్రి, ఆయనపై వ్యక్తిగతంగా కక్ష కట్టిన ప్రతిపక్షాలు కలిసి దేశంలో అసలు సమస్యను మరుగున పెడుతున్నాయి. వాక్సిన్లు, అత్యవసర ఉపకరణాలు రాజకీయ ప్రాధాన్యతలతో పంపిణీ అవుతున్నాయంటూ కేంద్రంపై రాష్ట్రాలు ధ్వజమెత్తుతున్నాయి. ఇది చాలా బాధాకరమైన అంశం. ఏ ప్రాతిపదికన వైద్య సరఫరాలలో వ్యత్యాసం పాటిస్తున్నారో చెప్పేందుకు కేంద్రం ఇంతవరకూ ప్రయత్నించలేదు. దీనివల్ల ప్రజల్లో అపోహలు తలెత్తుతాయి. దాని ప్రభావం దీర్ఘకాలం ఉంటుంది. నిజంగానే తాము అధికారంలో లేని రాష్ట్రాల పట్ల వివక్ష పాటిస్తుంటే అంతకంటే దేశద్రోహం మరొకటి ఉండదు. పారదర్శకంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటనలు చేయాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వాల పలాయనం…
ఇంతటి తీవ్ర విపత్తును గతంలో ఎదుర్కొన్న అనుభవం లేకపోవడం కారణంగా ప్రభుత్వాలు పలాయనం పఠిస్తున్నాయి. తప్పనిసరి చర్యలను తీసుకుంటున్నారు. ఇవి తాత్కాలికమే తప్ప పూర్తి స్థాయి అదుపుకు సరిపోవని వైద్యరంగం ఘోషిస్తోంది. గడచిన రెండు దశాబ్డాలుగా ప్రభుత్వాలు ప్రయివేటు వైద్యాన్ని ప్రోత్సహిస్తూ తమ బాధ్యత తప్పించుకుంటూ వచ్చాయి. ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. తీవ్ర అంటురోగాలు ప్రబలినప్పుడు ప్రయివేటు ఆసుపత్రులు యథేచ్ఛగా దోపిడీకి తెరతీస్తాయన్న వాస్తవం కళ్లముందు నిలిచింది. ఆరోగ్యశ్రీలు ఇతర సేవల పేరిట ప్రయివేటు ఆసుపత్రులకే నిధులు చెల్లించడం దశాబ్దకాలంగా తెలుగు రాష్ట్రాల్లో అమలవుతోంది. పైకి చూస్తే ఇది పేదలకు కార్పొరేట్ వైద్యం అందించినట్లు కనిపించినా ప్రభుత్వ ఆసుపత్రుల సేవలు కుచించుకుపోవడానికి కారణమైంది. ప్రయివేటు వైద్య రంగంపై సర్కారీ నియంత్రణ అసాధ్యమైన స్థితికి చేరుకుంది. ప్రభుత్వాల పెద్దలే తమకు తెలిసిన వారి కోసం కార్పొరేట్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. రికమెండేషన్లు చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యం అంటే అగ్రనాయకులకు, నాయకులకు నమ్మకం లేకుండా పోయింది. గతంలో నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ఆదర్శంగా నిలిచారు. అటువంటి ఉదాహరణలిప్పుడు కావాలి.
రాజకీయ ప్రమేయం…
వైద్య రంగంలో రాజకీయ ప్రమేయం సాధ్యమైనంత వరకూ తగ్గాలి. ఈ రంగంలో లబ్ధ ప్రతిష్టులైన వారితో కమిటీలను ఏర్పాటు చేసి , వారిచ్చే సూచనల మేరకే నిర్ణయాలు తీసుకోవాలి. దానిని బహిరంగ పరచాలి . కానీ ఏం చేసినా తమకే లబ్ధి చేకూరాలనే తాపత్రయంతో నాయకులు నిపుణుల సలహాలు, సూచనలను ప్రాచుర్యంలోకి తేవడం లేదు. కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో వైద్య నిపుణుల బృందాలే కరోనా కట్టడికి చర్యల ప్రణాళిక రూపొందించాలి. దానిని వారే ప్రకటించాలి. అప్పుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న అపోహలు, అనుమానాలు తొలగి పోతాయి. రాష్ట్రాల మధ్య విభేదాలు తగ్గుతాయి. వాక్సిన్లు పంపిణీ వంటి వాటిని సాధికారికంగా, పారదర్శకంగా చేయడానికి వీలవుతుంది. ప్రధాని, ముఖ్యమంత్రులు తమ రాజకీయ పాత్రను పక్కనపెట్టి ఇటువంటి సంక్షోభ సమయంలో ఫెసిలిటేటర్ పాత్రను పోషించాలి. వైద్య రంగానికి అవసరమైన నిధులు, ఉపకరణాలు సమకూర్చడానికే పరిమితమవ్వాలి. నిర్ణయాలు, అమలు నిపుణులకే అప్పగించాలి. అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో ఈ విషయంలో కొంత మెరుగైన పద్ధతులు అమలు చేస్తున్నారు. భారత్ లో ఆ చొరవ కొరవడింది. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు, వాక్సిన్లు ఉత్పత్తి అన్నిటికీ రాజకీయ నిర్ణయం తప్పనిసరి అన్నట్లు రెడ్ టేపిజం అమలు చేస్తున్నారు.
నిజాయతీ పరులే లేరా..?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాల్లో నిజాయతీ పరులే లేరా ? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రతి రాష్ట్రంలోనూ పది మంది ఐ ఎ ఎస్, ఐపీఎస్ లతో కూడిన పర్యవేక్షణ బృందాలను , వైద్య నిపుణులతో కూడిన కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేసి నిత్యం నిఘా పెట్టి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే పరిస్థితులు మెరుగు పడతాయి. ఆయా బృందాలకు అవసరమైన అధికారాలు కల్పించాలి. కేంద్రం వద్ద సైతం ఆయా రాష్ట్రాల లో పనిచేసే బృందాలకు మార్గదర్శకత్వం వహించే సీనియర్ అధికారుల బృందం పనిచేసేలా చూడాలి. ఇటువంటి విపత్కర పరిస్తితుల్లో రాజకీయ నాయకుల హడావిడి తగ్గితే మంచిది. అయితే మన వ్యవస్థలో ఉన్న లోపం నాయకుల ప్రచార పటాటోపం. అధికారులకు మంచి పేరు రావడాన్ని నాయకులు సహించలేరు. తమను మించి అధికారం చెలాయించడాన్ని ఒప్పుకోరు. ప్రజలకు, అధికారులకు మధ్య తాము కచ్చితంగా అనుసంధానంగా ఉండాల్సిందేననుకుంటారు. అందుకే అధికారులు సైతం పూర్తి స్థాయి చిత్తశుద్ధి కనబరచరు. మే నెల అత్యంత కీలకమని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య, కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య అనుమానాలు తలెత్తుతున్నాయి. స్పర్థలు పెరుగుతున్నాయి. ఇవి విషమించకముందే యుద్ధప్రాతిపదికన పనిచేసే తటస్థ యంత్రాంగాన్ని సిద్ధం చేసి రాజకీయ నాయకత్వాలు తమ పాత్రను కుదించుకుంటే మేలు.
-ఎడిటోరియల్ డెస్క్