బాబుకు బిగ్ షాక్… టీడీపీకి మాజీ మంత్రి గుడ్ బై ?
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు, మునిసిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మంది టీడీపీ కీలక నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు సైతం వైసీపీలోకి లేదా బీజేపీలోకి [more]
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు, మునిసిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మంది టీడీపీ కీలక నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు సైతం వైసీపీలోకి లేదా బీజేపీలోకి [more]
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు, మునిసిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మంది టీడీపీ కీలక నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు సైతం వైసీపీలోకి లేదా బీజేపీలోకి వెళ్లిపోతారన్న ప్రచారం ముందు నుంచే ఉంది. పంచాయతీ, మునిసిపల్, నగర పాలక సంస్థల ఫలితాలు వచ్చేశాయి. వైసీపీ సునామీ సృష్టించింది. చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఫలితాలు నమోదు చేసింది. అన్ని కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పాలక సంస్థలు స్వీప్ చేసేసింది. ఒక్క తాడిపత్రిలో మాత్రమే టీడీపీ చచ్చీ చెడీ గెలిచింది. ఈ ఫలితాలు చూసిన టీడీపీ నేతల్లో చాలా మంది పార్టీలో ఉండాలా ? బయటకు రావాలా ? అన్న డైలమాలో ఉన్నారన్నది వాస్తవం.
ఆయన పేరు ప్రముఖంగా….
ఇప్పటికే గత సాధారణ ఎన్నికల తర్వాత చాలా మంది నేతలు టీడీపీని వదిలి వెళ్లిపోయారు. ఇక మరోసారి జంపింగ్‌లు మొదలవుతున్నట్టు చర్చ నడుస్తోంది. ఈ లిస్టులో చాలా మంది నేతల పేర్లు ఉన్నా మాజీ మంత్రి, మాజీ విప్ పల్లె రఘునాథ్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అనంతపురం జిల్లాలో సీనియర్ రాజకీయ నేత అయిన ఆయన గత రెండు దశాబ్దాలకు పైగా టీడీపీలో క్రియాశీలకంగా ఉంటున్నారు. గతంలో నల్లమడ, ఆ తర్వాత పుట్టపర్తి నుంచి పల్లె రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో నల్లమడ నుంచి గెలిచిన ఆయన, 2009, 2014 ఎన్నికల్లో పుట్టపర్తి నుంచి వరుసగా విజయం సాధించి చంద్రబాబు కేబినెట్లో మంత్రి కూడా అయ్యారు. ఆ తర్వాత విప్ పదవి కూడా చేపట్టారు.
మంత్రి పదవి తప్పించిన నాటి నుంచి…..
విద్యాసంస్థల అధినేతగా ఉన్న పల్లె రఘునాథ్ రెడ్డిని చంద్రబాబు మంత్రి పదవి నుంచి తప్పించినప్పటి నుంచే అధిష్టానంకు ఆయనకు గ్యాప్ పెరిగింది. ఒకానొక దశలో గత ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేసేందుకు ఇష్టపడలేదు. భార్య వియోగం కావొచ్చు… పార్టీలో సహకారం లేకపోవడం, తన నియోజకవర్గంలో ఇతర పార్టీ నేతలు వేలు పెడుతున్నా అధిష్టానం పట్టించుకోకపోవడంతో పల్లె రఘునాధ రెడ్డి డిజప్పాయింట్ అయ్యారు. తర్వాత చంద్రబాబు సర్దిచెప్పడంతో గత ఎన్నికల్లో ఆయన అయిష్టంగానే పోటీ చేసి శ్రీథర్ రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన పార్టీలో ఉన్నా నియోజకవర్గంలో యాక్టివ్‌గా ఉండడం లేదు.
త్వరలోనే క్లారిటీ…..
ఇటు వయోః భారంతో పాటు అనారోగ్య కారణాలతో వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయరన్న ప్రచారమూ ఉంది. మరో వైపు పుట్టపర్తిపై నిమ్మల కిష్టప్ప ఫ్యామిలీ ఎప్పటి నుంచే కన్నేసి అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పుట్టపర్తికి దూరంగానే పల్లె రఘునాథ్ రెడ్డి ఎక్కువుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు బీజేపీ నుంచి ఆహ్వానాలు అందుతోన్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పల్లె రఘునాథ్ రెడ్డి తో చర్చలు జరిపినట్టు జిల్లాలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే అదే జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి లాంటి వాళ్లు టీడీపీని వీడి బీజేపీలో చేరారు. ఇప్పుడు రెడ్డి వర్గంలో సౌమ్యుడిగా పేరున్న పల్లె రఘునాథ్ రెడ్డిని బీజేపీ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. అటు వ్యాపారాలు, ఇటు విద్యాసంస్థలు కూడా ఉండడంతో ఆయన పార్టీ మారే ఆలోచనలోనే ఎక్కువుగా ఉన్నారని కూడా జిల్లాలో చర్చ జరుగుతోంది. మరి పల్లె టీడీపీలో ఉంటారా? వెళతారా? అన్నదానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.