పరకాల సినిమా హిట్టా..? ఫట్టా?
డాక్టర్ పరకాల ప్రభాకర్ ఇటీవల తీసిన “రాజధాని విషాదం” (అమరావతి ట్యాగ్ లైన్ తో) సినిమా ఆయన ఆహ్వానంపై ఈరోజు ఎం బి భవన్ లో చూశా. [more]
డాక్టర్ పరకాల ప్రభాకర్ ఇటీవల తీసిన “రాజధాని విషాదం” (అమరావతి ట్యాగ్ లైన్ తో) సినిమా ఆయన ఆహ్వానంపై ఈరోజు ఎం బి భవన్ లో చూశా. [more]
డాక్టర్ పరకాల ప్రభాకర్ ఇటీవల తీసిన “రాజధాని విషాదం” (అమరావతి ట్యాగ్ లైన్ తో) సినిమా ఆయన ఆహ్వానంపై ఈరోజు ఎం బి భవన్ లో చూశా. ఈ సినిమా గురించి సమీక్ష రాయాలా? వద్దా? అని చాలా సేపు అలోచించి “రాయాల్సిందే” అనే నిర్ణయానికి వచ్చి ఇది రాస్తున్నా. ముందుగా అమరావతిలో రెండు నెలల క్రితం నేను తిరిగినప్పుడు, అక్కడ అనేక మంది ప్రజలను కలిసినప్పుడు, రాజకీయ వ్యాఖ్యలు తీసి పక్కన పెడితే, ఎక్కువగా వినిపించిన స్టేట్ మెంట్ “ఆయనొచ్చి పంటభూములు లాక్కున్నాడు. ఈయనొచ్చి పనులు ఆపేసి ఎడారి చేశాడు.” చాలా మందిలో ఈ భావన ఉంది. ఈ భావనతో పాటు జరగబోయేది ఏంటి అనే అంతుచిక్కని ప్రశ్న కూడా ఉంది.
ఇక పరకాల సినిమా గురించి…..
“అల వైకుంఠపురములో” అంటే ఆ సినిమా కథ ఏంటో, కథనం ఎలా ఉంటుందో ఊహించడం కొంచెం కష్టం. కానీ “ఇద్దరమ్మాయిలతో” అనగానే కథ సంగతి ఎలా ఉన్నా కథనం ఏంటో ఉహించి చెప్పొచ్చు. ఈ సినిమా కూడా అంతే. ఈ “రాజధాని విషాదం” (ట్యాగ్ లైన్ అమరావతి) అనే టైటిల్ చూడగానే కథ, కథనంపై ముందుగానే ఓ అభిప్రాయం ఏర్పడుతుంది. కథలో ఏం చెప్పబోతున్నారో అనేది ఊహకందని విషయం మాత్రం కాదు. అయితే, చెన్నపట్నం (మద్రాస్), కర్నూల్, హైదరాబాద్, అమరావతి ప్రయాణం గురించి ప్రస్తావించి దర్శకుడు, కథకుడు, వ్యాఖ్యాత అయిన పరకాల ప్రభాకర్ కొంత తటస్థంగా ఉండే ప్రయత్నం చేశారు. అవును మన ఆంధ్రులకు మొదటినుండి రాజధాని ఒక విషాదమే. అందులో అనుమానం లేదు. ఈ విషయంలో పరకాలతో ఏకీభవించొచ్చు.
తటస్థ ప్రయోగం…..
తన తటస్థ ప్రయోగం ఇంకొంచెం పొడిగించి అమరావతిలో రాజధానికి భూసమీకరణ సమయంలో విమర్శకుల వ్యాఖ్యలు కూడా సినిమాలో జోడించి వీక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అలాగే “ఓటుకు నోటు” వివాదానికి సంబంధించిన రెండు కీలక వీడియో క్లిప్పులు చూపించి ఇది మొత్తం ఒక తటస్థ ఆలోచనే అని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈ దృశ్యాల తర్వాత సాగిన కథనంలో ఈ సినిమా లక్ష్యం ఏంటో ఆయన దాయలేకపోయారు.
దాచుకోలేకపోయి….
అధికార పార్టీ నుండి ఒకరు మాత్రమే వాదన వినిపిస్తుంటే ఒక్కొక్కరుగా ఇతర పార్టీల నేతలు విమర్శల వర్షం కురిపిస్తుంటే, మధ్యమధ్యలో కథకుడిగా, వ్యాఖ్యాతగా పరకాల నడిపించిన కథనం సినిమా లక్ష్యాన్ని స్పష్టం చేసింది. రాజ్యం ఎప్పుడూ విధేయతనే కోరుకుంటుంది. అవిధేయులైన ప్రజలపై లాఠీల వర్షం కురిపిస్తూనే ఉంటుంది. అధికారంలో ఎవరు ఉన్నా జరిగేది అదే. అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ సమయంలో ఆ గ్రామాల ప్రజలపై పోలీసులు ఎలా ప్రవర్తించారో, ఇప్పుడు అమరావతి ఉద్యమకారులపైనా అలాగే ప్రవర్తిస్తున్నారు. అయితే ల్యాండ్ పూలింగ్ సమయంలో పోలీసు దమనకాండ మచ్చుకు కూడా కనిపించనివ్వకుండా ఇప్పుడు అమరావతి ఉద్యమకారులపై దమనకాండ మాత్రమే చూపించడం ద్వారా పరకాల ఈ సినిమా లక్ష్యం ఏమిటో చెప్పేశారు.అలాగే మూడు రాజధానులకు దక్షిణాఫ్రికా మోడల్ అనగానే తన లక్ష్యానికి అనుగుణంగా దక్షిణాఫ్రికా నుండి కొన్ని గొంతులు వినిపించే ప్రయత్నం చేశారు. అలా కాకుండా మూడు రాజధానులు అనగానే ఆంధ్ర ప్రదేశ్ లోని మూడు ప్రాంతాల్లో సందర్శించి అక్కడి ప్రజల గొంతు కూడా వినిపించితే “తటస్థ ఆలోచన” కొంత అర్ధవంతంగా ఉండేది. విశాఖ, కర్నూల్ లోని స్టేక్ హోల్డర్స్ ని మర్చిపోయి కేవలం అమరావతిలోని ఉద్యమ శిబిరానికే పరిమితం అయ్యారు.
రెండు ప్రధాన పార్టీలపై….
ఇక అమరావతి నిర్ణయంలో, మూడు రాజధానుల నిర్ణయంలో రెండు ప్రధాన పార్టీలపై చిన్నగా, సుతిమెత్తగా రెండుమూడు చురకలు వేసినా, కేంద్రంలోని పార్టీపై చురకలు పడకుండా జాగ్రత్త పడ్డారు. నడుస్తున్న చరిత్రలో సినిమాటిక్ డ్రమటైజేషన్ లేకుండా సినిమా తీయాలంటే వేరే మార్గం లేదనుకోండి. అమరావతిలో రైతులు చాలామంది తమ భూముల్లో కొంత భాగం మంచి ధరకు అమ్ముకున్నారు. అది వారికి మంచే చేసింది. అయితే అప్పుడు కానీ, ఇప్పుడు కానీ నష్టపోయింది కౌలు రైతులు, రైతు కూలీలు, చేతివృత్తి కార్మికులు. వీరందరికీ జీవనోపాధి పోయింది. వాళ్ళిప్పుడు దుగ్గిరాల, తెనాలి, రేపల్లె వైపు వలస పోతున్నారు. వీరి జీవితాల్లో నాడు అమరావతి నిర్ణయం కానీ, నేడు మూడు రాజధానుల నిర్ణయం కానీ ఎలాంటి ప్రభావం చూపింది అనే విషయం పరకాల విస్మరించారు. విజయంలో కానీ విషాధంలో కానీ ఈ వర్గాల ప్రజలకు చోటు కల్పించడంలో చరిత్రకారులు ఎప్పుడు వివక్ష చూపిస్తూనే ఉంటారు. పరకాల అందుకు భిన్నంగా కనిపించలేదు.
మనం ఆశించిన స్థాయిలోనే….
ఇప్పుడు ‘రాజధాని విషాదం’ అంటున్న పరకాల అయినా, అప్పుడెప్పుడో ‘అమరావతి జాతీయ విషాదం’ అన్న శేఖర్ గుప్తా అయినా శిఖరం పైనుండి కిందికి చూస్తే కంటికి కనిపించని దృశ్యాలు చాలా మిస్సవుతారు. ఇది మరోసారి నిరూపితమైంది. సినిమా కథ, కథనం పరకాల ఆశించిన స్థాయిలోనే ఉంది. పరకాల నుండి మనం ఆశించే స్థాయిలోనే ఉంది. ఎడిటింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. స్వతహాగా మంచి రచయిత, వ్యాఖ్యాత అయిన కారణంగా పరకాలకు అక్షరాల కూర్పు, చిత్రాల ఎంపిక బాగా కలిసివచ్చింది. తెరపై కనిపించే దృశ్యాలు, తెరవెనుకనుండి వినిపించే వ్యాఖ్యానాలకు తగ్గట్టుగానే నేపద్య సంగీతం సమకూర్చుకున్నారు. మరో వారం, పది రోజుల్లో అమరావతి “రైతుల ఉద్యమం” యేడాది పూర్తిచేసుకోబోతోంది. ఈ వారం పది రోజుల్లో చాల సినిమాలు, డాక్యుమెంటరీలు, ప్రత్యేక కథనాలు రావచ్చు. జాతీయ మీడియా కూడా ఈ విషయంపై ప్రత్యేక కథనాలు చూపించే అవకాశం ఉంది. వీటన్నిటికీ ముందే కూసిన తొలికోడి ఈ సినిమా.
కొసమెరుపు…..
సినిమా ప్రదర్శనకు విజయవాడలోని ఎం బి భవన్ ఆడిటోరియంను వేదికగా ఎంచుకున్నారు. విచిత్రం ఏమంటే ఇదే వేదికపై “ఎవరి రాజధాని అమరావతి?” అనే పుస్తక ఆవిష్కరణ సభ రెండేళ్ళ క్రితం జరిగింది. ఆ సభలో అమరావతిని తప్పుబట్టిన నేతలు, తీవ్రంగా విమర్శించిన “మేథోపీఠాధిపతులు” కొందరు ఈ ఆడిటోరియంలో కనిపించారు. ఈ సినిమా తెరపై కూడా కనిపించారు.రెండేళ్ళ క్రితం “ఎవరి రాజధాని అమరావతి” అని గొంతు చించుకుని ప్రశ్నించిన వారిలో కొందరు “అమరావతి మాదే” అంటూ సినిమాలో విషాద గీతం ఆలపించడం కొసమెరుపు.
-గోపి దారా, సీనియర్ జర్నలిస్ట్