హమ్మయ్య.. అయితే ఆమె టీడీపీలోనే ఉన్నారన్నమాట
అనంతపురం జిల్లాకు చెందిన కీలక నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత వ్యవహారం నిన్న మొన్నటి వరకు తీవ్ర వివాదంగా మారిన విషయం తెలిసిందే. గత ఏడాది [more]
అనంతపురం జిల్లాకు చెందిన కీలక నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత వ్యవహారం నిన్న మొన్నటి వరకు తీవ్ర వివాదంగా మారిన విషయం తెలిసిందే. గత ఏడాది [more]
అనంతపురం జిల్లాకు చెందిన కీలక నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత వ్యవహారం నిన్న మొన్నటి వరకు తీవ్ర వివాదంగా మారిన విషయం తెలిసిందే. గత ఏడాది ఎన్నికల్లో తన కుమారుడు పరిటాల శ్రీరాంకు టీడీపీ టికెట్ ఇప్పించుకున్న ఆమె భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే, వైసీపీ హవాతో ఆయన దూకుడుకు బ్రేకులు పడ్డాయి. తన ఫ్యామిలీకి ఉన్న క్రేజ్‌తో శ్రీరాం ఘనవిజయం సాధిస్తాడనుకుంటే వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చేతిలో చిత్తుగా ఓడిపోయారు. 27 వేల ఓట్ల మైనస్‌తో శ్రీరాం ఓడిపోవడం అక్కడ ఆ ఫ్యామిలీ కంచుకోట ఎలా బీటలు వారిందో చెప్పకనే చెపుతోంది. దీంతో అప్పటి నుంచి తల్లీ కొడుకులు మౌనం పాటించారు. పార్టీ తరఫున పిలుపు ఇచ్చినా కూడా వారిద్దరూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.
రెండు నియోజకవర్గాలకూ……
ఆ తర్వాత ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బీజేపీలోకి జంప్ చేసేశారు. దీంతో అక్కడ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు చంద్రబాబు అక్కడ పర్యటించినప్పుడు ధర్మవరం, రాఫ్తాడు రెండు నియోజకవర్గాలు పరిటాల కుటుంబానికే ఇస్తున్నానని.. ఎవరు ఎక్కడ బాధ్యతలు తీసుకుంటారో ? వారే నిర్ణయించుకోవాలని చెప్పారు. ఎన్నికలకు ముందు వరకు తమ కుటుంబానికి రెండు సీట్లు కావాలని ఎంతో పట్టుబట్టిన పరిటాల ఫ్యామిలీ ఎన్నికల తర్వాత చంద్రబాబు ఇంత బంపర్ ఆఫర్ ఇచ్చినా పట్టించుకోలేదు. అసలు ధర్మవరం సంగతి దేవుడు ఎరుగు… రాఫ్తాడులోనే పార్టీని పట్టించుకోలేదు.
రాజధాని భూముల కొనుగోలు విషయంలో….
ఒకే ఒక్క అంశంలో నిన్న మొన్నటి వరకు స్పందించారు సునీత. అదే.. రాజధానిలో భూముల కొనుగోలు అంశంపై అధికార పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో పరిటాల శ్రీరాం పేరుతోను, సునీత తన అల్లుడి పేరుతోను ఇక్కడ భూములు కొన్నారని అధికార పార్టీ అసెంబ్లీలోనే విమర్శించింది. ఆ సమయంలో ఒకే ఒక్కసారి మీడియా ముందుకు వచ్చిన సునీత.. ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. తర్వాత మళ్లీ సైలెంట్ అయిపోయారు. దీనికితోడు ఆమె పార్టీ మారాలని చూస్తున్నారని, బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని కూడా స్థానిక మీడియా పెద్ద ఎత్తున కథనాలు వెలువరించింది.
తాజాగా సున్నా వడ్డీ రుణాల విషయంలో….
నిత్యం ఏదో ఒక అంశంతో మీడియాతో ఉండే పరిటాల శ్రీరాం కూడా సైలెంట్ కావడంతో ఇక, ఈ తల్లీ కుమారులు.. పార్టీ మారిపోవడం ఖాయమని అనుకున్నారు. ఈ విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు కూడా వ్యూహాత్మక మౌనం పాటించారు. ఏం జరిగితే అదే జరుగుతుందని అనుకున్నారు. ఇంతలోనే పరిటాల సునీత అనూహ్యంగా స్పందించారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు 1400 కోట్లు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడంపై పరిటాల సునీత విమర్శలు గుప్పించారు. జగన్ 22 వేల కోట్లు తొలి విడతలోనే ఇస్తానని హామీ ఇచ్చారని, కానీ, ఆయన మాట తప్పారని ఆమె చెప్పుకొచ్చారు. విమర్శల మాట ఎలా ఉన్నా.. పరిటాల సునీత టీడీపీలోనే ఉన్నారనేందుకు ఇది ఉదాహరణగా నిలవడంతో పార్టీలో సంతోషం వ్యక్తమవుతోంది. హమ్మయ్యా సునీత నోరు విప్పారు.. ఆమె పార్టీలోనే ఉంటారనేందుకు క్లారిటీ వచ్చిందని స్థానిక టీడీపీ కేడర్ కాస్త ఆత్మస్థైర్యం నింపుకుంటోంది.