నాలుగు సార్లు ఎమ్మెల్యే… అయినా నిలువ నీడ లేదు
కమ్యూనిస్టు నేతల్లో అత్యంత సేవాతత్పరుడిగా.. నమ్మిన సిద్ధాంతాల కోసం.. ముఖ్యంగా కమ్యూనిస్టు భావజాలాన్ని అణువణువునా పుణికి పుచ్చుకున్న నాయకుడిగా ప్రజల నేతగా గుర్తింపు తెచ్చుకున్న పాటూరి రామయ్యను [more]
కమ్యూనిస్టు నేతల్లో అత్యంత సేవాతత్పరుడిగా.. నమ్మిన సిద్ధాంతాల కోసం.. ముఖ్యంగా కమ్యూనిస్టు భావజాలాన్ని అణువణువునా పుణికి పుచ్చుకున్న నాయకుడిగా ప్రజల నేతగా గుర్తింపు తెచ్చుకున్న పాటూరి రామయ్యను [more]
కమ్యూనిస్టు నేతల్లో అత్యంత సేవాతత్పరుడిగా.. నమ్మిన సిద్ధాంతాల కోసం.. ముఖ్యంగా కమ్యూనిస్టు భావజాలాన్ని అణువణువునా పుణికి పుచ్చుకున్న నాయకుడిగా ప్రజల నేతగా గుర్తింపు తెచ్చుకున్న పాటూరి రామయ్యను ప్రస్తుత కమ్యూనిస్టు నాయకులు పూర్తిగా మరిచిపోయినట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన అత్యంత దయనీయ పరిస్థితిలో కృష్ణా జిల్లా ఉయ్యూరులోని ఓ వృద్ధా శ్రమంలో తలదాచుకుంటున్నారు. కానీ, ఆయన సేవలు, సమాజంలో ఆయన వేసిన ముద్ర మాత్రం చెరిపినా చెరిగిపోనివనడంలో సందేహం లేదు.
ప్రజాసేవకు అడ్డొస్తారని….
నెల్లూరు జిల్లాలోని జలదంకి మండలం, జమ్మలపాలెంలో దళిత కుటుంబంలో జన్మించిన పాటూరు రామయ్య తొలినాళ్లలో బతుకుదెరువు కోసం కూలిపనులకు వెళ్లేవారు. దాతల సహకారంతో చదువుసాగించారు. విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ, పుచ్చలపల్లి సుందరయ్య శిష్యుడిగా పేరుపొందారు. 1965లో మహాలక్ష్మిని వివాహం చేసుకున్నారు. తన ప్రజా సేవకు అడ్డొస్తారనే ఉద్దేశంతో భార్య అనుమతితో బిడ్డలనే వద్దనుకుని కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకున్నారు. తర్వాత కాలంలో కృష్ణా జిల్లా నిడుమోలు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు సీపీఎం తరుఫున రామయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
నాలుగుసార్లు గెలిచి…..
1985, 1989, 1994, 2004లో నిడుమోలు నుంచి పాటూరి రామయ్య ఎమ్మెల్యేగా గెలిచారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే తన నియోజకవర్గంలో కొన్ని వేల మందికి ఇంటి స్థలాలు కల్పించి నీడ కల్పించారు. శాసనసభలో రామయ్య చేసిన ప్రసంగాలు ఎంతగానో ఆకట్టుకునేవి. ఆయన హయాంలోనే లక్ష్మీపురం షుగర్ ఫ్యాక్టరీ మిగులు భూమిని 7,500 మంది పేదలకు ఒక్కొక్కరికి 20 సెంట్ల నుంచి 25 సెంట్లు చొప్పున ఆయా గ్రామాల్లో పంపిణీ చేశారు. కానీ, తనకంటూ ఒక్క సెంటు స్థలాన్నీ, నివసించేందుకు కనీసం ఒక పూరింటిని కూడా సంపాదించుకోలేదు.
ధన ప్రవాహం పెరగడంతో…
ఎన్నికల్లో ధన ప్రవాహం పెరగడం, వయసు మీదపడటంతో ప్రస్తుతం పాటూరి రామయ్య రాజకీయాలకు దూరమయ్యారు. 2009లో నిడుమోలు నియోజకవర్గం రద్దయ్యి పామర్రు నియోజకవర్గం ఏర్పడింది. దీంతో ఆయన ఆ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ ఇస్తామన్నా పోటీ చేయలేదు. తన ఆస్తులను పార్టీకి రాసిచ్చేసిన ఆయన 80 ఏళ్ల వయసులో సొంత ఆస్తులు లేక ఉండడానికి ఇల్లు లేక ఆయన ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఉయ్యూరులోని ఓ వృద్ధాశ్రమంలో భార్యతో కలిసి కాలం గడుపుతున్నారు. కనీసం ఇప్పుడైనా.. కమ్యూనిస్టులు ఆయన కోసం ఏమైనా చేస్తారా? ప్రభుత్వమైనా.. ఆయనకు సరైన జీవితం కల్పించేందుకు ప్రయత్నిస్తుందా? చిరమాంకంలో శేష జీవితాన్ని హుందాగా గడిచిపోయేలా చేస్తుందా ? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం ఇవ్వాలి.