బోసూ.. ఇదేంది బాసూ…?
ఒక ఒరలో రెండు కత్తులే ఇమడలేవు! అయితే, ఇప్పుడు మూడు కత్తులు కలసి ఒకే ఒరలో ఇమడాల్సిన పరిస్థితి వచ్చింది!! మరి ఈ నేపథ్యంలో అసలు ఏం [more]
ఒక ఒరలో రెండు కత్తులే ఇమడలేవు! అయితే, ఇప్పుడు మూడు కత్తులు కలసి ఒకే ఒరలో ఇమడాల్సిన పరిస్థితి వచ్చింది!! మరి ఈ నేపథ్యంలో అసలు ఏం [more]
ఒక ఒరలో రెండు కత్తులే ఇమడలేవు! అయితే, ఇప్పుడు మూడు కత్తులు కలసి ఒకే ఒరలో ఇమడాల్సిన పరిస్థితి వచ్చింది!! మరి ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది ? ఇది సాధ్యమేనా ? అనే సందేహాలు అనేకం తెరమీదికి వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. ముగ్గురు కీలక నేతలు. నిన్న మొన్నటి వరకు వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఉరఫ్ రామచంద్రాపురాన్ని తమ ఆధిపత్యంలోకి తెచ్చుకునేందుకు వివిధ మార్గాల్లో ప్రయత్నాలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు కత్తులు నూరుకున్నారు. రాజకీయంగా తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఒకే నియోజకవర్గంలో శత్రువులుగా పోరాటాలకు దిగారు.
మూడు దశాబ్దాలుగా….
అలాంటి ముగ్గురూ.. ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు..! చిత్రంగా అనిపించినా .. నిజం. నిన్న మొన్నటి వరకు తిట్టుకున్న నాయకులు, ఒకరు ఓడి పోవాలని మరొకరు కోరుకున్న నాయకులు ఇప్పుడు ఒకే పార్టీ గొడుగు కిందకు చేరారు. వారే.. సీనియర్ దిగ్గజం .. మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మరొకరు తోట త్రిమూర్తులు, ఇంకొకరు.. ఈ నియోజకవర్గంలో ఇటీవ ల ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయం సాధించిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. బోసు, త్రిమూర్తులు.. ఇదే నియోజకవర్గంలో వేర్వేరు పార్టీల తరఫున పోరాటం చేసుకుని ఒకరి తర్వాత ఒకరు గెలుపు గుర్రం ఎక్కిన వారే. వీరిద్దరి ఆధిపత్య పోరుతో రామచంద్రాపురం రాజకీయాలు మూడు దశాబ్దాలుగా వేడెక్కుతూనే ఉన్నాయి.
కీలకపోస్టులో పిల్లి…..
అలాంటిది ఇక్కడ తొలిసారిగా వీరిద్దరిని కాదని చెల్లుబోయిన వేణు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, ఇప్పుడు వీరు ముగ్గురూ కూడా వైసీపీలో ఉండడంతో వీరి ఫ్యూచర్ ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. పిల్లి సుభాష్ చంద్రబోసు విషయాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ తర్వాత .. ఆయన వైసీపీకే జై కొట్టారు. వైఎస్ హయాంలోనూ మంత్రి గా ఉన్న ఆయనకు జగన్ దగ్గర మంచి మార్కులే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయనను ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే ఎమ్మెల్సీగా పంపారు జగన్. ఇక, పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెవెన్యూ మంత్రిగా కీలక పోస్టు ఇచ్చారు. ఇదిలావుంటే, ఎన్నికలకు ముందు చెల్లుబోయినకు టికెట్ హామీ ఇచ్చిన జగన్ ఆ ప్రకారం ఆయనకు టికెట్ ఇచ్చారు. బోసును వేరే నియోజకవర్గం పంపారు. బోసు మండపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా జగన్ ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంతో పాటు డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చారు.
ఎన్నికల ముందు వరకూ….
దీంతో పిల్లి సుభాష్ చంద్రబోసు మూడు దశాబ్దాలు చక్రం తిప్పిన ఈ నియోజకవర్గంలో వేణు గోపాలకృష్ణ.. తోట త్రిమూర్తులుపై పోటీ చేసి విజయం సాధించారు. ఎన్నికలకు ముందు వరకు గురుశిష్యులుగా ఉన్న బోస్, వేణు ఎన్నికల టైంలో శత్రువులు అయ్యారు. ఇక, ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన తోట.. ఆ వెంటనే టీడీపీ కి దూరంగా ఉంటూ వస్తున్నారు. వాస్తవానికి ఆయన ఎన్నికలకు ముందుగానే వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని అందరూ అనుకున్నా.. అది జరగలేదు. ఇక, ఇప్పుడు ఈ ముగ్గురూ ఒకే పార్టీలో ఉండడంతో పాత వైరాన్ని మరిచిపోయి.. పార్టీ కోసం పనిచేస్తారా? లేక.. కయ్యాలు కొనసాగిస్తూ..నే ఉంటారా? అనేది ఆసక్తిగా మారింది.
కంట్రోల్ అవుతుందా?
ఇక, ఇటీవల జరిగిన పరిణామాలను గమనిస్తే.. తోట త్రిమూర్తులు వైసీపీలో చేరిన సందర్భంగా గతంలో ఆయన బాధితులుగా ఉన్న కొందరు దళితులు.. మంత్రి బోసు కాన్వాయ్‌కు అడ్డుపడ్డారు. తమకు అన్యాయం చేసిన తోటపై చర్యలు తీసుకుంటారా? లేదా? అని నిలదీశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బోసు.. తోట తనకు గతంలో శత్రువని, ఇప్పుడు కూడా శత్రువేనని, ఇకపై కూడా శత్రువుగానే చూస్తానని అన్నారు. మరి దీనిని బట్టి వీరి మధ్య వైరాలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే తమ కంచుకోటలో మరో వ్యక్తి పాగా వేయడాన్ని జీర్ణించుకోలేని బోస్, తోట ఇప్పుడు ఒక్కటవుతున్నట్టు కూడా మరో టాక్ ఉంది. ఇది ఎంత వరకు నిజమో కాలమే ఆన్సర్ ఇవ్వాలి. ఏదేమైనా ఈ ముగ్గురి వార్‌ను జగన్ ఎలా కంట్రోల్ చేస్తారో ? ఎలాంటి వ్యూహంతో వీరిని అదుపు చేస్తారో చూడాలి.