కోనసీమ ముఖద్వారంలో హోరాహోరీ

నాయకులు మారినా.. పార్టీలు మారినా.. వర్గ పోరు మాత్రం కొనసాగుతూనే ఉంది. ఎన్నో ఏళ్ల పాటు కొనసాగుతున్న వర్గ పోరులో పైచేయి ఎవరిది? కోనసీమ ముఖద్వారంలో ఈసారి గెలుపు ఎవరిని వరిస్తుంది? టీడీపీ, వైసీపీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? జనసేనలో ఎవరెవరు అధికార, ప్రతిపక్ష నాయకులకు సవాలు విసురుతున్నారు? తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం పేరు చెబితే ముందుగా గుర్తొస్తున్న సందేహాలివి! గత ఏడాది ఎన్నికల్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ వేవ్ బలంగా వీచినా.. దానిని తట్టుకుని వైసీపీ గెలిచిన అతి తక్కువ నియోజకవర్గాల్లో కొత్తపేట ఒకటి! ఇక్కడ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉన్న విషయం తెలిసిందే! అయితే ఈసారి వైసీపీలో మార్పులతో పాటు, జనసేన కూడా రంగంలోకి దిగడంతో.. చల్లని కోనసీమలో వాతావరణం హీటెక్కుతోంది!
భిన్నమైన రాజకీయ పరిస్థితులు
నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా కళా వెంకట్రావు ఎన్నికయ్యారు. ఆయన హయాంలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య జరిగిన పోటీ.. 1962 నుంచి వర్గపోరుగా మారింది. అప్పటినుంచి ఎంఏ సుబ్బరాజు, ముత్యాల సుబ్బారాయుడు మధ్య ఏర్పడిన పోరు ఇప్పటికీ కొనసాగుతోంది. సుబ్బారాయుడు అనంతరం ఆయన వర్గానికి చిర్ల సోమసుందరరెడ్డి, సుబ్బరాజు వర్గానికి బండారు సత్యానందరావు నాయకత్వం వహిస్తూ వస్తున్నారు. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు రెండూ ఈ వర్గాలకు సంబంధించిన నేతలకే అభ్యర్థిత్వాలు కట్టబెడుతున్నాయి. కొత్తపేట నియోజకవర్గంలోని కొత్తపేట, ఆలమూరు మండలాల్లో కులాల ప్రాబల్యం అధికంగా ఉండగా రావులపాలెం, ఆత్రేయపురం మండలాల్లో స్వాతంత్య్రం ముందు నుంచి ఉన్న పెత్తందారీ వర్గాలే ప్రభావం చూపుతున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిని మారుస్తుందా..?
2009 మినహా 1989 నుంచి 2014 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బండారు సత్యానందరావు పోటీ చేశారు. ఈసారి కూడా ఆయనకే టికెట్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. 2009లో పోటీచేసిన రెడ్డి సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీగా, శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నారు. 2009లో బండారు ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ మూడో ప్లేస్‌తో సరిపెట్టుకుంది. ఇక ప్రస్తుతం రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రత్యక్ష ఎన్నికలపై ఆసక్తి కనబర్చకపోవడం, బండారును గెలిపించాలని కోరుతుండడంతో పార్టీలో వర్గపోరు లేనట్టే ఉంది. ఇక వైసీపీ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన చిర్ల జగ్గిరెడ్డి.. పార్టీని అంటిపెట్టుకుని ఉండడం, బలమైన అనుచరవర్గం కలిగి ఉండడంతో మరోసారి ఆయనకే అభ్యర్థిత్వం దక్కుతుందని భావిస్తున్నారు. ఇటీవల కొత్తపేట నియోజకవర్గ పర్యటనలో వైసీపీ అధినేత జగన్ జగ్గిరెడ్డి అభ్యర్థిత్వాన్ని బహిరంగంగా ప్రకటించకపోవడంతో ఆయన వర్గీయులు ఒకింత అసహనానికి గురయ్యారు.
జనసేన రాకతో మారిన రాజకీయం
అమలాపురం పార్లమెంటు పరిధిలో కాపు కులస్తుల్లో ఒకరికి వైసీపీ టిక్కెట్ ఇవ్వాలని భావిస్తుండడంతో జిల్లాకు చెందిన ప్రముఖ కాపు నేత దృష్టి కొత్తపేటపై పడినట్టు చెబుతున్నారు. జిల్లాలో ప్రజారాజ్యం పార్టీ గెలిచిన సీట్లలో కొత్తపేట కూడా ఉంది. దీంతో జనసేన ఈ స్థానంపై గురిపెట్టింది. ఈ పార్టీ తరపున గతంలో గెలిచిన బండారు సత్యానందరావు సోదరుడు శ్రీనివాసరావు చేరిపోయారు. మరో బలమైన సామాజికవర్గానికి చెందిన బండి రాధమ్మను కూడా తీసుకున్నారు. వీరు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. కాపు యువకులపైనే జనసేన ఎక్కువగా గురిపెట్టింది. కాంగ్రెస్ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆకుల రామకృష్ణ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. బీజేపీ నుంచి తమనంపూడి రామకృష్ణారెడ్డి, పాలూరి సత్యానందం పోటీపడుతున్నారు.
త్రిముఖ పోటీ ఖాయమే
ఏదేమైనా కోనసీమకు ముఖద్వారంగా ఉన్న కొత్తపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఈ సారి టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య ట్రయాంగిల్ ఫైట్ అయితే తప్పదు. ఈ ముక్కోణపు పోటీలో టీడీపీ, జనసేన పార్టీలు కాపులకే సీటు ఇవ్వడం పక్కా. మరి వైసీపీ రెడ్డి వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికే సీటు ఇస్తుందా ? లేదా ? క్యాండెట్‌ను మారుస్తుందా ? అన్నది చూడాలి. ఓవరాల్‌గా అయితే కొత్తపేటలో ఈ సారి ట్రయాంగిల్ ఫైట్ అదిరిపోవడం పక్కా.