జనమా..? మనమా..?
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు డ్రామాను తలపిస్తున్నాయి. ప్రముఖ నేతలందరూ ఆటను రక్తి కట్టిస్తున్నారు. అందరూ ఆర్టిస్టులే. ప్రజలే ప్రేక్షకులు. రాష్ట్రాన్ని శాసిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, [more]
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు డ్రామాను తలపిస్తున్నాయి. ప్రముఖ నేతలందరూ ఆటను రక్తి కట్టిస్తున్నారు. అందరూ ఆర్టిస్టులే. ప్రజలే ప్రేక్షకులు. రాష్ట్రాన్ని శాసిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, [more]
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు డ్రామాను తలపిస్తున్నాయి. ప్రముఖ నేతలందరూ ఆటను రక్తి కట్టిస్తున్నారు. అందరూ ఆర్టిస్టులే. ప్రజలే ప్రేక్షకులు. రాష్ట్రాన్ని శాసిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్షంలో పగబట్టి కనిపిస్తున్న చంద్రబాబు నాయుడు, పడిలేస్తూ ఆపసోపాలు పడుతున్న పవన్ కల్యాణ్ ఈ ముగ్గురు నాయకులూ రాష్ట్రానికి సంబంధించి చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన తరుణం వచ్చేసింది. జనమా? మనమా? అన్నది తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకా రాజకీయ విన్యాసాలతోనే కాలం వెళ్లబుచ్చితే చరిత్ర క్షమించదు. ఓటు వేసేందుకు నోట్ల కోసం చేయి చాస్తూ ప్రజలు కరప్ట్ అయిపోయారు . అందువల్ల ప్రశ్నించే అధికారం వారి చేతిలోంచి ఎప్పుడో జారిపోయింది. అగ్రనాయకులు భవిష్యత్ తరాల ముందు మాత్రం దోషులుగా నిలవాల్సి ఉంటుంది . నాటి గొప్ప నాయకులను నేటికీ తలచుకోవడానికి ప్రధాన కారణం వారు చేసిన మంచి పనులు. ప్రజాసంక్షేమం, అభివృద్ధి పట్ల వారు కనబరిచిన చిత్తశుద్ధి. ఇప్పుడున్న నాయకుల్లో అంతటి ఔదార్యం ఆశించలేం. కానీ కనీసం ప్రజల ముందు చెప్పుకోవడానికైనా ఒకటో రెండో పనులుండాలి. మంచి చేయకపోయినా చెడు జరగడానికి కారణమయ్యారనే ముద్ర పడకుండా చూసుకోవాలి. ఏకాభిప్రాయం ఉన్న విషయాలపై నేతలు కలిసి నడిచి పార్టీలకు అతీతంగా ఉన్నామన్న సంఘీభావం చాటుకున్నా నేటితరం ముచ్చట పడుతుంది. ప్రత్యేక హోదా ఎలాగూ అటకెక్కేసింది. దాని గురించి చర్చ అనవసరం. రాష్ట్రం తక్షణం ఎదుర్కొంటున్న రెండు సమస్యలు. పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు. ఈ రెంటిపై ఆచరణాత్మకమైన అజెండాను సిద్ధం చేసుకుని నాయకులు ఢిల్లీ మెడలు వంచే ప్రయత్నాలు చేయాలి.
పవన్ మార్కు….
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి బీజేపీ తొలి దశలో చాలా ఆశించింది. చంద్రబాబు నాయుడు అవసరాలకు అనుగుణంగా ప్లేటు ఫిరాయిస్తాడని బీజేపీకి తెలుసు. అందుకే పవన్ కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు మోడీ, షాలు. అయితే చంద్రబాబు చేతిలో ఉపకరణంగా మారిపోయిన పవన్ తొందరపడ్డారు. ఇతర రాష్ట్రాలకు లేని ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వడం సాధ్యం కాదు . పార్లమెంటులో హామీ ఇచ్చినా అది అమలు కాదు. సాధ్యం కాని అంశంపై బీజేపీపై ధ్వజమెత్తి మోడీ, షాలకు దూరమై పోయారు. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికలకు ఏడాది ముందు ప్రత్యేక హోదాను ఇష్యూగా మార్చింది. కానీ పవన్ ఎటువంటి ప్రయోజనం లేకుండానే పాచిపోయిన లడ్డూ అంటూ గడబిడ చేశారు. మళ్లీ ఎన్నికల తర్వాత వాస్తవం తెలిసొచ్చి బీజేపీతో జట్టు కట్టారు. ప్రధాని వద్ద పలుకుబడి తగ్గిపోయింది. సామాజిక వర్గ పరమైన మద్దతు కోసం పవన్ ను చేరదీశారే తప్ప పవన్ మాటకు మోడీ, షాలు పెద్దగా విలువ ఇవ్వడం లేదు. పోలవరం నిధులు- నిర్మాణంపై స్పష్టత లోపించినా , విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై కచ్చితంగా ముందుకే వెళతామని కేంద్రం చెబుతున్నా పవన్ మాట్టాడలేకపోతున్నారు. బీజేపీని వదిలి చంద్రబాబు, జగన్ లతో జట్టు కట్టే సాహసమూ చేయలేకపోతున్నారు.
మార్పు సాధ్యమేనా..?
వ్యక్తిగత, పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రం బలి అయిపోయినా చూస్తూ ఊరుకుండే వాతావరణమే ఆంధ్రప్రదేశ్ లో ఉంది. వైసీపీ, టీడీపీ, జనసేన అగ్రనేతలు ఒకే వేదిక మీదకు రారు. ప్రజా ఉద్యమాలకు కంటితుడుపు మద్దతు ప్రకటిస్తూ ఉంటారు. ఇంకా ప్రజలను మభ్యపెట్టాలనే చూస్తుంటారు. తన ఎంపీలతో ఢిల్లీలో ప్రకంపనలు పుట్టించగల శక్తి ఉండీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తూతూ మంత్రం లేఖలు రాస్తుంటారు. దానివల్ల ఒరిగేదేమీ లేదు. రాజీనామాలు చేయండి అంటూ టీడీపీ డిమాండ్ చేయడమూ రాజకీయమే. తనకు మరో అవకాశం వస్తుందేమోనని గొంతెమ్మకోరికతో సవాళ్లు విసురుతుంది. లోక్ సభ, రాజ్యసభల్లో ఉన్న వైసీపీ, టీడీపీ ఎంపీలంతా కలిసి సభలను స్తంభింప చేయడం, ప్రధాని కార్యాలయాన్ని ముట్టడించడం వంటి చర్యలకు పూనుకుంటే ఇప్పటికే కదలిక వచ్చి ఉండేది. ప్రతిపక్షాలన్నీ మద్దతు పలికి ఉండేవి. టీడీపీ, వైసీపీలు అందుకు పూనుకోవు. రాష్ట్రంలో ప్రజలను మభ్యపెడుతుంటాయి. జగన్ కు, చంద్రబాబుకు ఉన్న రాజకీయ అవసరాల కారణంగా కేంద్రంపై ఒత్తిడి పెంచే స్థితిలో లేరు. పవన్ కల్యాణ్ కు కేంద్రంతో తక్షణ అవసరాలు లేకపోయినా భవిష్యత్తును చెడగొట్టుకోకూడదని సన్నాయి నొక్కులకే పరిమితమవుతున్నారు. ఈ స్థితిలో రాష్ట్ర రాజకీయ చిత్రంలో మార్పు సాధ్యం కాదనే చెప్పాలి.
ప్రత్యామ్నాయమే పరిష్కారం…
ఆంద్రప్రదేశ్ నుంచి ఇప్పటికిప్పుడు బీజేపీ రాజకీయ ప్రయోజనాలు ఆశించడం లేదు. రాష్ట్రం నుంచి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లేరు. వైసీపీ, టీడీపీల్లో ఏదో ఒక పార్టీ తీవ్రంగా బలహీనపడితే తప్ప రాష్ట్రంలో తిష్ట వేయడం సాధ్యం కాదు. అంతవరకూ పవన్ లాంటి వారిని పెట్టుకుని అస్తిత్వం కాపాడుకోవడమే. రాష్ట్రం చేస్తున్న డిమాండ్ల కోసం తన విధానపరమైన నిర్ణయాలను మార్చుకునేందుకు కేంద్రం సిద్ధం గా లేదు. ఈ పరిస్థితుల్లో వాస్తవిక ద్రుక్పథంతో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాలి. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన అంశాలపై పార్టీలు దృష్టి పెట్టలేదు. ప్లేయింగ్ టు ద గ్యాలరీ అన్నట్లుగా సమైక్యాంధ్ర డిమాండ్ తో ప్రజలను రెచ్చగొ్ట్టి రాష్ట్రాన్ని ముంచేశారు. అనేక రకాల ప్రయోజనాలకు చట్టపరమైన హామీ పొందాల్సిన తరుణంలో వృధా సెంటిమెంట్లతో కాలయాపన చేశారు. వట్టి చేతులతో రాష్ట్రం విడిపోవడానికి రాజకీయ పార్టీలు, నేతలే కారణమయ్యారు. ఇప్పుడు కూడా విశాఖ ఉక్కు పై ఇదే తీరుతో ప్రవర్తిస్తే కేంద్రం తన పని తాను చేసుకుపోతుంది. ప్రత్యామ్నాయ ప్రణాళిక ప్రతిపాదించి ఒత్తిడి చేయడం ఉత్తమం. ఫ్యాక్టరీ ని నడపాలా? వద్ద్దా అన్నది యజమానిగా కేంద్రం ఇష్టం. వరస నష్టాలు వస్తుంటే ప్రజాధనాన్ని వెచ్చించలేమని కేంద్రం చెబుతోంది. దానిని ఎవరూ తోసిపుచ్చలేరు.
భూములకు రక్షణ ….
ప్రయివేటు వ్యక్తుల పరమైతే ఉద్దేశపూర్వకంగా కంపెనీని మూసివేసి లక్షల కోట్ల విలువైన భూములను విక్రయించే అవకాశం ఉంది. ఫ్యాక్టరీకి ఉన్న భూములపై హక్కులను సర్కారు తనవద్దనే పెట్టుకోవాలి. ప్రయివేటు కంపెనీలకు ధారాదత్తం చేయకుండా చట్టపరమైన రక్షణ ఉండేలా ప్రత్యామ్నాయ ప్రతిపాదనతో ముందుకు కదిలితే మంచిది. అప్పుడు నిజంగా నిర్వహణ సామర్ధ్యం ఉన్న పారిశ్రామిక వేత్తలే ముందుకు వస్తారు. విలువైన భూములను కాపాడుకుంటే భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు స్థాపించేందుకు అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ పరం కాకుండా చూసుకోవడం పై రాజకీయ పార్టీలు శ్రద్ద పెట్టాలి. ముఖ్యమంత్రి సూచించినట్లు ఏడెనిమిదివేల ఎకరాలను విక్రయించేస్తే కష్టాలు తీరిపోవు. మళ్లీ వరస నష్టాలు వస్తే నాలుగైదేళ్లలో మళ్లీ ఫ్యాక్టరీని విక్రయించాల్సి వస్తుంది. ప్రభుత్వ నిర్వహణలోని అలసత్వం పోవాలంటే పారిశ్రామిక రంగంలో అనుభవం ఉన్నవారికి దఖలయ్యేలా చూడాలి. లేకపోతే గత ఏడాదికాలంలో మూతపడిన పదివేల కంపెనీల్లో విశాఖ ఉక్కు కూడా త్వరలో చేరిపోతుంది. తీవ్రమైన రాజకీయ ఒత్తిడి ఎదురైతే ప్రయివేటీకరణ మానేసి అసలు కంపెనీనే మూసివేసే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ఫ్యాక్టరీ మూతపడకూడదు. అదే సమయంలో విలువైన భూములు ప్రయివేటు పరం కాకూడదు. ఆ దిశలో అజెండాను పునర్నిర్వచించుకోవాలి. కేంద్రం ముందరి కాళ్లకు బంధం వేయాలి.
-ఎడిటోరియల్ డెెస్క్