అసమాన(తా) భారత్
ప్రపంచంలో బారత దేశంలోనే ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. దేశం సంపన్నమైనది. అక్కడి ప్రజలే పేదవాళ్లు అనే నానుడి బ్రిటిష్ కాలం నుంచే ఉంది. వేళ్ల మీద [more]
ప్రపంచంలో బారత దేశంలోనే ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. దేశం సంపన్నమైనది. అక్కడి ప్రజలే పేదవాళ్లు అనే నానుడి బ్రిటిష్ కాలం నుంచే ఉంది. వేళ్ల మీద [more]
ప్రపంచంలో బారత దేశంలోనే ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. దేశం సంపన్నమైనది. అక్కడి ప్రజలే పేదవాళ్లు అనే నానుడి బ్రిటిష్ కాలం నుంచే ఉంది. వేళ్ల మీద లెక్కపెట్టగలిగిన ట్రిలియనీర్లు కాదు, నోటికి అయిదువేళ్లు వెళ్లడం కష్టమైన పేదలే భారత్ ను పోషిస్తున్నారు. కరోనా తో ప్రపంచం కల్లోలమైపోయింది. కానీ అతి తొందరగా నిలదొక్కుకోవడంలో అసమాన భారత్ గా తన శక్తిని ప్రదర్శిస్తోంది. ఆర్థిక వ్యవస్థ రికవరీ అయిపోతోంది. ఎవరూ ఊహించనంతటి వేగంగా ఎకానమీ పుంజుకుంటోంది. కనీసం మరో అయిదేళ్ల వరకూ దేశానికి పైసల కష్టాలు తప్పవు. ఆర్థిక చిక్కుల నుంచి గట్టెక్కలేం అని అంతా భావించారు. కానీ అనూహ్య ఫలితాలతో దేశం దూసుకుపోతోంది. ఇంతటి శుభపరిణామంలోనూ విషాదం వెన్నాడుతూనే ఉంది. ఎకనమిక్ సర్వే సాక్షిగా పేద, ధనిక భారత్ మధ్య వ్యత్యాసం నానాటికీ పెరుగుతూనే ఉంది.
పేదల అండతో పెద్దోళ్లు…
ఇటీవలి కాలంలో అందర్నీ ఆకర్షించిన వార్త ముఖేష్ అంబానీ ఆదాయం. ఆయన ఒక్క సెకను కాలవ్యవధిలో సంపాదించే ఆదాయం. సగటు వ్యక్తి మూడేళ్ల పాటు కష్టపడితే వచ్చే మొత్తానికి సమానం. అంబానీ ప్రపంచ కుబేరుల్లో ఒకరు. ఇటీవల భారత్ నుంచి అంతర్జాతీయ ట్రిలియనీర్లు పెరుగుతున్నారు. ఇది సంతోషించాల్సిన అంశమా? విషాదకరమా? అంటే ఎవరూ చెప్పలేరు. దేశంలో కరోనాతో మొత్తం కల్లోలం ఆవరిస్తే కార్పొరేట్ వ్యవస్థల ఆదాయం మాత్రం మెరుగుపడింది. ఎక్కడో తేడా కొడుతోంది. ఏదో దోపిడీ జరుగుతోంది అనేందుకు ఇదొక నిదర్శనం. లేదంటే ఆయా కంపెనీలు, ప్రముఖులు సామాజిక బాధ్యతలో పాలుపంచుకోవడం లేదని అయినా భావించాలి. సర్వీసు సెక్టారులో ఉన్న అంబానీలు, అదానీలు లక్షల కోట్లు పోగేస్తున్నారు. కరోనా సమయంలో కూడా జియోలు, రిలయన్స్ లు, పెట్రోలియం ఉత్పత్తుల రంగాల్లో లక్షల కోట్ల వ్యాపారం యథాతథంగా సాగింది. ఆన్ లైన్ లో పాఠాలు నేర్చుకునే కోట్ల మంది చిన్నారి విద్యార్థుల నుంచి సైతం వారికి లాభాల సిరులు కురిశాయి. దేశం ఇబ్బందుల్లో ఈ ధనికులు ఎంతమేరకు భాగస్వామ్యం వహించారో తెలియదు. కానీ కష్టాల్లో కూడా వారి లాభాల వేటకు పేదలు కాంట్రిబ్యూషన్ చెల్లించారు. దేశంలో విండ్ ఫాల్ ప్రాఫిట్ పై తగినంత చర్యలు లేకపోవడమే ఈ దురవస్థకు కారణం. అత్యంత సంక్లిష్ట సమయంలోనూ రాయితీల వంటివి అందించకుండా దోపిడీ యథేచ్ఛగా సాగుతోందనేందుకు భారత్ కోటీశ్వరుల ఉదంతాలే ఉదాహరణలు.
విద్య,వైద్యం నెరవేరని కల…
బడ్జెట్ సందర్భంగా విడుదల చేసిన ఎకనమిక్ సర్వే మరో చేదు నిజాన్ని ప్రజల ముందుంచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాథమిక బాధ్యతను విస్మరిస్తున్నాయి. అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో ప్రాథమిక విద్య, వైద్యం పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉంటోంది. ప్రభుత్వమే వారికి ఉచిత వైద్యం అందిస్తోంది. లేదంటే ఇన్సూరెన్స్ సదుపాయంతో వైద్యాన్ని సమకూర్చుకుంటున్నారు. మనదేశంలో వైద్య బీమా ఇంకా విస్త్రుతం కాలేదు. పైపెచ్చు ఆర్థిక స్తోమత, ప్రభుత్వ సహకారం ఉండే గవర్నమెంట్ ఉద్యోగులే ఎక్కువగా వీటి ప్రయోజనాలు పొందగలుగుతున్నారు. ప్రభుత్వ వైద్య రంగాన్ని పటిష్టం చేయకుండా కార్పొరేట్ ఆసుపత్రులకు దోచిపెట్టే విధంగానే ప్రభుత్వాలు ఆరోగ్య పథకాలను కూడా ప్రవేశపెడుతున్నాయి. తద్వారా ఇంకా దేశంలో 70 శాతం ప్రజలకు పూర్తిగా వైద్యం అందుబాటులోకి రాలేదు. వైద్యం పై ప్రభుత్వం జీడీపీలో 3 శాతం ఖర్చు పెట్టాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అప్పుడు ప్రజలు తమ చేతి నుంచి పెట్టే ఖర్చు 60శాతం తగ్గుతుందనేది అంచనా. ఇక విద్యారంగాన్ని పూర్తిగా దోపిడీ వర్గాలకే అప్పగించేశారు. పోటీ తత్వం పేరిట స్వేచ్ఛామార్కెట్ కి తలుపులు బార్లా తెరిచారు.
ఉచితానుచితాలు…
ఏది ఉచితంగా ఇవ్వాలి? దేనిని అందించడం అనుచితం అన్న విషయంలో ప్రభుత్వాలు విచక్షణ కోల్పోయాయి. కిలో రూపాయి బియ్యం వంటి పథకాలు , అన్నిచోట్ల దుర్వినియోగం అవుతున్నాయి. ప్రజల ఆదాయం పెరిగింది. ఆహారపు అలవాట్లు మారాయి. అందువల్ల నాసిరకం ఉచిత బియాన్ని ప్రజలు తినడం లేదు. అవసరమైతే మళ్లీ మార్కెట్ లో విక్రయించి తమకు కావాల్సిన వాటిని కొనుక్కొంటున్నారు. అయినా నూటికి 90 శాతం మందికి బియ్యం సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతుంటాయి. రూపాయికి సింగిల్ బిస్కట్ రాని కాలంలో ఇంకా ఈ స్కీమ్ కు అర్థం లేదంటే ప్రభుత్వాలు ఒప్పుకోవు. ఇందుకు వెచ్చించే వేల కోట్ల రూపాయల దుర్వినియోగాన్ని అరికట్టి విద్య, వైద్యం, విద్యుత్తు, రక్షిత మంచినీరు, పారిశుద్ధం మెరుగుదల, స్థానిక సంస్థలకు నిధుల పెంపుదలకు కేటాయిస్తే ఉత్తమం. ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అయినా ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగుకోవడం ప్రభుత్వాలకు అలవాటు. ప్రజలకు కనిపించని పరోక్ష పన్నులతో జేబులు చిల్లులు పడుతున్నాయి. సామాన్యుడు ఇరవై రూపాయల సబ్బు కొంటే అందులో తొమ్మిది రూపాయలు వివిధ రకాల పరోక్ష పన్నుల రూపంలో ప్రభుత్వాలు కొట్టేస్తున్నాయి. అయితే తనకు ప్రభుత్వమిచ్చే కిలో రూపాయి బియ్యం గురించే చూస్తున్నాడు తప్పితే పెరిగిన ధరల్లో తాను చెల్లిస్తున్న పన్ను వాటా సగటు మనిషికి అంతుపట్టడం లేదు. ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు ఎంత దోపిడీ చేసినాపాపం సగటు మనిషి తట్టుకుంటున్నాడు. తాజాగా ఎకానమీ రికవరీ బాట పట్టడంలో సామాన్యుడి అసామాన్య కొనుగోలు శక్తే కారణం. 130 కోట్ల మంది ప్రజలు తమ దైనందిన అవసరాలను తీర్చుకోవడానికి కొనుగోళ్లు పెంచారు. ఫలితంగా వ్యవస్థ గాడిన పడుతోంది. దీనిని సాకుగా చేసుకుని మరిన్ని పన్నులు పెంచకుండా ఉంటే అంతే చాలు.
-ఎడిటోరియల్ డెస్క్