ఆ మాజీ ఎమ్మెల్యేకి ఇంటిపోరు.. ఓటమి తర్వాత కలిసిరాని పాలిటిక్స్
రాజకీయాల్లో నాయకులు ఒకటి తలిస్తే.. అక్కడి పరిస్థితులు మరొకటి తలుస్తాయి. వీటిని తట్టుకుని ముందుకు సాగిన నాయకులు గెలుపు గుర్రం ఎక్కుతారు.. తట్టుకోలేని వారు చతికిల పడతారు. [more]
రాజకీయాల్లో నాయకులు ఒకటి తలిస్తే.. అక్కడి పరిస్థితులు మరొకటి తలుస్తాయి. వీటిని తట్టుకుని ముందుకు సాగిన నాయకులు గెలుపు గుర్రం ఎక్కుతారు.. తట్టుకోలేని వారు చతికిల పడతారు. [more]
రాజకీయాల్లో నాయకులు ఒకటి తలిస్తే.. అక్కడి పరిస్థితులు మరొకటి తలుస్తాయి. వీటిని తట్టుకుని ముందుకు సాగిన నాయకులు గెలుపు గుర్రం ఎక్కుతారు.. తట్టుకోలేని వారు చతికిల పడతారు. అయితే, కొందరు వ్యూహాత్మంగా వ్యతిరేక పరిస్థితులను తట్టుకుని నిలబడతారు. ఇలా రెండూ కాకుండా.. ఎటు పరిస్థితి అనుకూలిస్తే.. అటు అడుగులు వేస్తే.. ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే అనంతపురం జిల్లా అర్బన్ మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వీ ప్రభాకర్ చౌదరి ఎదుర్కొంటున్నారని అంటున్నారు పరిశీలకులు.
వర్గాలుగా విడిపోయి…
గత ఏడాదికి ముందు అంటే 2014లో టీడీపీ తరఫున అనంత అర్బన్ నుంచి పోటీ చేసిన ప్రభాకర్ చౌదరి విజయం సాధించారు. అంతకు ముందు నుంచే టీడీపీలో కొనసాగుతోన్న ఆయన అనంతపురం మునిసిపల్ చైర్మన్‌గా పనిచేయడంతో పాటు అవే స్వచ్చంద సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే, ఈ ఐదేళ్లలోనూ ఆయన సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. పరిస్థితులతో ఎదురీదాల్సి వచ్చింది. సొంత పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో నువ్వా-నేనా అనే రేంజ్లో ఆయన దూకుడు ప్రదర్శించారు. రహదారి విస్తరణ నుంచి అభివృద్ధి, సంక్షేమం, ఆఖరుకు పింఛన్ల వరకు జేసీ వర్సెస్ ప్రభాకర్ చౌదరి వర్గాలు రోడ్డెక్కి వీరంగం వేశాయి.
బెదిరింపులు పెరగడంతో….
ఈ క్రమంలో ప్రభాకర్ చౌదరి దీక్షలకు కూడా దిగాల్సిన పరిస్థితి వచ్చింది. గత ఏడాది ఎన్నికల సమయానికి అసలు ప్రభాకర్ చౌదరికి టికెట్ కూడా ఇవ్వొద్దంటూ.. జేసీ పట్టుబట్టినట్టు ఇక్కడ కొందరు చెప్పుకొంటారు. మొత్తానికి చంద్రబాబు నుంచి టికెట్ తెచ్చుకున్నా.. జేసీ వర్గం వ్యతిరేక పిలుపు, లోపాయికారీ.. యాంటీ ప్రచారంతో ప్రభాకర్ చౌదరి ఓడిపోయారనేది ఇక్కడి ప్రజలమాట. అయితే, ఓటమి తర్వాత కూడా ప్రభాకర్ చౌదరి పార్టీలో పుంజుకున్నది కనిపించడం లేదు. అనంతపురం అర్బన్‌లో జేసీ వర్గం పట్టు పెంచుకోవడం, ప్రభాకర్ చౌదరి వర్గానికి బెదిరింపులు కూడా పెరిగాయని టాక్. ఈ నేపథ్యంలో ప్రభాకర్ చౌదరి పార్టీలో ఏ కార్యక్రమం నిర్వహించినా.. పట్టుమని పదిమంది కూడా ఉండడం లేదు. ఇటీవల మహానాడుకు జేసీ వర్గం దూరంగా ఉంది.
మున్సిపల్ ఎన్నికల్లో…..
కానీ, ప్రభాకర్ చౌదరి మాత్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే. పట్టుమని పది మంది కూడా హాజరుకాలేదు. దీంతో అసలు పార్టీల ప్రభాకర్ చౌదరిని గుర్తించేందుకు అధిష్టానం కూడా ఇష్టపడడం లేదా? అనే చర్చ జోరుగా సాగుతోంది. అదే సమయంలో ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల్లో జేసీ వర్గం జిల్లా కేంద్రంతో తమ అనుచరులకు కొన్ని కార్పొరేటర్ టిక్కెట్లు ఇవ్వమని అడిగినా కూడా ప్రభాకర్ చౌదరి పట్టించుకోలేదు. దీంతో జేసీ తనయుడు పవన్‌కుమార్ రెడ్డితోనూ ప్రభాకర్‌కు పొసగని పరిస్థితి ఉంది.
పార్టీ పుంజుకునేందుకు….
జిల్లా కేంద్రమైన అనంతపురంలో పట్టుకోసం పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు ఎత్తులు, పై ఎత్తులు వేసుకోవడంతో పార్టీ పుంజుకునే పరిస్థితి లేదు. ఇక ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ప్రభాకర్ చౌదరితో కలిసి రావడం లేదు. ప్రభాకర్ కూడా వ్యూహాత్మకంగా ముందుకు సాగడంలేదని, ఎత్తులకు పైఎత్తులు వేయడంలోనూ ఆయన విఫలమవుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇలా అయితే.. పుంజుకోవడం కష్టమేనని.. ఇది పార్టీ భవిష్యత్తుకు మంచిది కాదని అంటున్నారు. మరి ఈ సమస్యను చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారో ? చూడాలి.