స్విరిచ్యువల్ మోడల్ పీకే ప్లాన్ …?
సంక్షేమ పథకాల్లో దేశంలోనే రికార్డు సృష్టిస్తోంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. అప్పు చేసి పప్పు కూడు తరహాలో అవసరానికి మించి సంతృప్త స్థాయిని చేరుకుంది. ప్రభుత్వ [more]
సంక్షేమ పథకాల్లో దేశంలోనే రికార్డు సృష్టిస్తోంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. అప్పు చేసి పప్పు కూడు తరహాలో అవసరానికి మించి సంతృప్త స్థాయిని చేరుకుంది. ప్రభుత్వ [more]
సంక్షేమ పథకాల్లో దేశంలోనే రికార్డు సృష్టిస్తోంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. అప్పు చేసి పప్పు కూడు తరహాలో అవసరానికి మించి సంతృప్త స్థాయిని చేరుకుంది. ప్రభుత్వ పథకాలు, నిధులతో ఓట్ల వర్షం కురిపించే ప్రదాన మార్గంగా సంక్షేమ పథకాలను వైసీపీ ఎంచుకుంది. సంక్షేమం ఒక దశ దాటిన తర్వాత పెద్దగా పని చేయదు. అవసరం లో ఉన్నవారికి ఆసరా ఇచ్చినప్పుడు వారు కనబరిచే కృతజ్ణత వేరు. అవసరంతో సంబంధం లేకుండా అయాచితంగా, ఉచితంగా సొమ్ములు ఇచ్చినప్పుడు ప్రజలు కనబరిచే ధోరణి వేరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వ్యక్తమవుతున్న భావన ఇదే. ప్రభుత్వం ఏటా 50 వేల కోట్ల రూపాయల అప్పులతో సంక్షేమ వితరణ చేస్తోంది. అయితే ఈ డబ్బులు తమ సొమ్మేగా అన్న ఉదాసీన వైఖరి లబ్ధిదారుల్లో చాలామందిలో కనిపిస్తోంది. రూపాయి బియ్యం పథకం వంటి స్కీములను పెద్దగా వినియోగించుకోవడం లేదు. అవి పక్కదారి పడుతున్నాయి. ఖజానాకు గండి పడుతున్నా ఇంతగా సర్కారు ఔదార్యం కనబరుస్తుంటే రావాల్సిన మైలేజీ రావడం లేదు. ఈ అంశంపై తాజాగా ప్రశాంత కిశోర్ టీమ్ తో శాంపిల్ సర్వే చేయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. సంక్షేమం సంగతి పక్కన ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న వివాదాలు ముఖ్యమంత్రి ఇమేజ్ కు ఇబ్బందికరంగా మారినట్లు పీకే టీమ్ గుర్తించింది. బీజేపీ, టీడీపీ మత పరమైన అజెండాను అమలు చేసేందుకు పూనుకోవడంతో సంక్షేమంపై చర్చ సమర్థంగా సాగడం లేదు. ఈ నేపథ్యంలో పీకే టీమ్ కొన్ని ప్రత్యేక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
ఇమేజ్ మేకోవర్…
జగన్ మోహన్ రెడ్డి ఇమేజ్ ను మేకోవర్ చేయాలనేది ఇందులో ప్రధాన సూచన. క్రిస్టియన్ మతావలంబీకుడే అయినప్పటికీ ముఖ్యమంత్రి హిందూ మత సంప్రదాయాలను గౌరవిస్తారు. సీఎం హోదాలో గత ముఖ్యమంత్రులు నెలకొల్పిన సంప్రదాయాలను అనుసరిస్తున్నారు. తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ, యజ్ణయాగాదుల్లో పాల్గొనడం వంటివి చేస్తున్నారు. మెజారిటీ ఓటు బ్యాంకు అయిన హిందువులు బీజేపీ వైపు ఆకర్షితులు కాకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. అయితే ఇటీవల ఆలయాల్లో విగ్రహ ద్వంసాల ఘట్టం తర్వాత మతపరమైన అంశాలు రాష్ట్రంలో చర్చనీయమయ్యాయి. ఈ దాడిని తట్టుకోవాలంటే హిందూ మత భావనలను సైతం ముఖ్యమంత్రి సొంతం చేసుకున్నట్లుగా కనిపించాలనేది పీకే టీమ్ ఇచ్చిన సలహాగా చెబుతున్నారు. ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని ప్రజల్లోకి వెళ్లాలనేది ప్రశాంత్ కిశోర్ నిర్దేశం. దీనివల్ల మతపరంగా తన, పర భేదాలను చెరిపేస్తూ ప్రజలపై ముద్ర వేయవచ్చనేది యోచన.
ఆధ్యాత్మిక వాదిగా…
జిల్లా పర్యటనలు, అభివృద్ధి సమీక్షలు అన్ని సందర్బాల్లోనూ కీలకమైన క్షేత్రాల సందర్శన, ఆలయాల పూజల్లో పాల్గొనడం నిరంతరం సాగించాలని పీకే టీమ్ గైడ్ లైన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వారానికి ఒక సారైనా ముఖ్యమంత్రి ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో నిమగ్నం కావాలి. మీడియా ద్వారా తగిన ప్రచారమూ కల్పించాలి. ఇటీవల కొందరు మఠాధిపతులు ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు. ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే పీఠాధిపతులకు కూడా అవసరమైన సందర్భాల్లో పెద్ద పీట వేయాలనేది మరో సూచన. యజ్ణయాగాదులు , క్రతువులకు ప్రభుత్వ సహకారమే కాకుండా స్వయంగా భాగస్వాములవ్వడం ద్వారా ముఖ్యమంత్రి ఆధ్యాత్మిక వాదిగా ముద్ర వేయించుకోవచ్చుననే భావన బలపడుతోంది. ఇది ప్రశాంత్ కిశోర్ ఆలోచనలనుంచి పుట్టిన ఐడియాగానే పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవలి ఘట్టాల్లో బీజేపీ, టీడీపీ కార్యకర్తల పాత్రను పెద్దది చేస్తూ కేసులు పెట్టడం వల్ల ప్రభుత్వానికి కలిసొచ్చిందేమీ లేదు. కక్ష సాధింపు చర్యగానే ప్రజలలో సానుభూతి ఏర్పడింది. అందువల్ల జరిగిన నష్టం పూడ్చటం, ఆలయాల పునరుద్దరణ, ప్రముఖ దేవాలయాల్లో దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న అభివ్రుద్ధి కార్యక్రమాల సంపూర్తి వంటి ప్రణాళికను అమలు చేయాలని భావిస్తున్నారు. ప్రతి సందర్బంలోనూ ముఖ్యమంత్రి చొరవతోనే ఆయా కార్యక్రమాలు సాగుతున్నట్లుగా ప్రత్యక్షంగా ప్రజల్లో ముద్ర పడేలా చూడాలని యోచిస్తున్నారు.
పని చేస్తున్నట్లేనా…
ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రశాంత్ కిషోర్ టీమ్ సలహాలను ఆచరిస్తున్నట్లు, అమలు చేస్తున్నట్లు చెప్పుకోవచ్చు. తిరుపతి గో సేవలో పాల్గొనడం, రాజశ్యామల యాగం వంటి వాటిలో నిమగ్నం కావడం, వస్త్రధారణ మొదలు పూర్తి హైందవ సంప్రదాయాలను అనుసరించడం ఇందులో భాగమే. ప్రకంపనలు సృష్టించిన అంతర్వేది రథ పునర్నిర్మాణమే కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి రథాన్ని లాగడం కూడా రాష్ట్రంలో నూతన ఒరవడికి నిదర్శనం. తన వ్యక్తిగత విశ్వాసాలను ప్రత్యర్థులు అలుసుగా తీసుకోకుండా తనకు అన్ని మతాలు సమానమే అని చాటి చెప్పాలనేది ముఖ్యమంత్రి భావనగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదేమైనా బీజేపీ, టీడీపీ మతాన్ని పొలిటికల్ అడ్వాంటేజ్ గా తీసుకోకుండా ముఖ్యమంత్రి జగన్ జాగ్రత్త పడుతున్నారు. ప్రశాంత్ కిషోర్ టీమ్ ఈ విషయంలో మరింత ఇన్ డెప్త్ సలహాలు, సమాచారము కూడా అందించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ముఖ్యమంత్రి కార్యప్రణాళికలో అవన్నీ వెల్లడి కావచ్చు.
-ఎడిటోరియల్ డెస్క్