కొంప ముంచిన కేంద్రీకరణ…?
ప్రజారోగ్యం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉంది. కరోనా వంటి జాతీయ రుగ్మతల విషయంలో కేంద్రమే అధిక చర్యలు తీసుకుంటోంది. సమాఖ్య వ్యవస్థలో ఇది మంచిదా? చెడ్డదా? [more]
ప్రజారోగ్యం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉంది. కరోనా వంటి జాతీయ రుగ్మతల విషయంలో కేంద్రమే అధిక చర్యలు తీసుకుంటోంది. సమాఖ్య వ్యవస్థలో ఇది మంచిదా? చెడ్డదా? [more]
ప్రజారోగ్యం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉంది. కరోనా వంటి జాతీయ రుగ్మతల విషయంలో కేంద్రమే అధిక చర్యలు తీసుకుంటోంది. సమాఖ్య వ్యవస్థలో ఇది మంచిదా? చెడ్డదా? అని చర్చించుకునే తరుణం కాదు. కానీ సమన్వయం లోపించింది. తొలి విడత కరోనా విజృంభించినప్పుడు బాగా సహకరించిన రాష్ట్రాలు ఇప్పుడు పెదవి విరుస్తున్నాయి. కేంద్రం పాత్రను వేలెత్తి చూపిస్తున్నాయి. ప్రతిపక్షాల వాయిస్ పెరిగింది. చప్పట్లు కొట్టండి. దీపాలు వెలిగించండి. పూలు జల్లండి అంటూ సింబాలిక్ మాటలు, చేతలతో గతంలో మంత్రం వేసిన కేంద్రానికి ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి. ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. సమర్థ నిరోధక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం ఉందని క్రమేపీ ప్రజల్లో అసంతృప్తి రగులుతోంది. గత ఏడాది జనవరి చివరలోనే కరోనా పోకడలు పెరిగినా అంతర్జాతీయ విమానాలను అదుపు చేయకుండా నిర్లక్ష్యం వహించింది. ఫలితంగా దేశంలో కరోనా విజృంభించింది. ఈ ఏడాది కూడా మార్చి నెలలోనే కరోనా రెండో వేవ్ మొదలైంది. అయినా పట్టించుకోకుండా ఎన్నికలు, జాతరలు, ఉత్సవాలకు సిద్దమై ఉపద్రవం పెరగడానికి హేతువైంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం చర్యలేమిటి? ఎందుకిలా ప్రవర్తిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆరోగ్యానికి ఆసరా…
కరోనా వ్యాప్తి దేశంలో ఆరోగ్య వ్యవస్థ డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. నిజానికి దేశంలో కాయకష్టం చేసే ప్రజల ఆహారపు అలవాట్లు, వంటదినుసుల్లోనే రోగనిరోధక అంశాలు ఇమిడి ఉండటం భారత్ చేసుకున్న అదృష్టం. అందువల్లనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యంపై పెడుతున్న నిధులు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ పెద్దగా లోపాలు తెలియడం లేదు. కానీ కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత ఈ మహమ్మారి దెబ్బ దేశంలో పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థ లేదన్న నిజాన్ని చాటి చెప్పింది. వ్యాపార, లాభాపేక్షకు పట్టం గట్టే ప్రయివేటు, కార్పొరేట్ ఆసుపత్రులు చేతులెత్తేశాయి. ప్రభుత్వాల భరోసాతో తప్పనిసరి పరిస్థితుల్లో తదుపరి దశలో రంగంలోకి దిగాయి. దోపిడీకి తెర తీశాయి. ఇదంతా ప్రభుత్వాలకు తెలిసినా నిస్సహాయంగా ఉండిపోయాయి. ఇక్కడే ప్రభుత్వ పెద్దలు తెలివిగా వ్యవహరించారు. ప్రజలకు సురక్షితమైన వైద్యం అందించలేని తమ వైఫల్యాన్ని ప్రయివేటు ఆసుపత్రుల దోపిడీ కప్పి పుచ్చేసింది. మీడియా, ప్రజలు ఆయా ఆసుపత్రులను తిట్టుకున్నారు. ప్రభుత్వాలు తమ బాధ్యత నుంచి తప్పించుకున్నాయి. ప్రయివేటు ఆసుపత్రుల దోపిడీకి తమకు సంబందం లేదన్నట్లుగా నాయకులు ప్రకటనలు చేశారు. అప్పుడప్పుడు హుంకరింపులు వినిపించారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు.
మాటల కోటలు..
ఏడాది కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా మాట్టాడిన అంశాలు, సమీక్ష చేసిన విషయాలు కరోనాకు సంబంధించినవే. అత్యధికంగా నిధులు కేటాయించినట్లు, మౌలిక వసతులు మెరుగుపరిచినట్లు ప్రభుత్వాల పెద్దలు పదే పదే జబ్బలు చరుచుకున్నారు. కానీ ఏడాది కాలంలో ఏ ఒక్కటీ మెరుగుపడలేదు. పడకల సంఖ్య వెయ్యి మంది ప్రజలకు ఎనిమిది చొప్పునే కొనసాగుతున్నాయి. వైద్యుల సంఖ్య కూడా వెయ్యి మందికి ఎనిమిది దగ్గరే నిలిచిపోయింది. ఏడాదిలో ప్రజావసరాలకు అనుగుణంగా నియామకాలు సాగలేదు. ఇక ఆక్సిజన్ తయారీ యూనిట్లకు 102కి అనుమతులు ఇచ్చినట్లు కేంద్రం చెబుతోంది. అందులో నాలుగోవంతు కూడా ప్రారంభం కాలేదు. దేశంలో ఆక్సిజన్ దొరకక ఆసుపత్రుల్లో గందరగోళం తలెత్తుతోంది. అంటే మాటల్లోనే తప్ప వాస్తవిక కార్యాచరణలో ప్రభుత్వాలు ముందడుగు వేయలేదని స్పష్టమవుతోంది. బడ్జెట్ లో రెండు లక్షల కోట్ల రూపాయల వరకూ చూపించిన ఆరోగ్య పద్దు ఏమయ్యిందో ఎవరికీ అంతుచిక్కదు. ఏదైనా జరిగితే ప్రజలే తట్టుకుంటారులే అన్న ఉదాసీన ధోరణి ఇందుకు నిదర్శనం. అసలు గడచిన ఏడాదికాలంగా ఆసుపత్రుల్లో మెరుగుపరిచిన సౌకర్యాలపై ప్రభుత్వాలు వాస్తవిక ప్రకటన చేయలేకపోతున్నాయి. కొత్తగా వైద్యులను తీసుకున్నామని కూడా చెప్పలేకపోతున్నాయి
పరస్పరం నిందలు…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం ప్రత్యక్షంగా, పరోక్షంగా నిందించుకుంటున్నాయి. ఈ విపత్తునకు రెండు సర్కారులు కూడా బాధ్యత వహించాలి. ప్రజలకు సన్నిహితంగా ఉండే స్థానిక సంస్థల అధీనంలో విద్య,వైద్యాన్ని తెచ్చి ఉంటే ఇంతటి తీవ్రత ఉండేదే కాదు. అన్నిటినీ కేంద్రీకరించడం వల్ల స్థానికంగా ఉన్న తమ ఆసుపత్రుల్లో ఎవరు పనిచేస్తున్నారో, సక్రమంగా వస్తున్నారో లేదో కూడా నగరపాలక సంస్థలు, మునిసిపాలిటీలు, పంచాయతీలు ప్రజాప్రతినిధులకు, కమిషనర్లకు తెలియదు. అక్కడ మౌలిక వసతులపైనా వారికి అజమాయిషీ, నిఘా లేదు. నిధులు మంజూరు చేసే అధికారమూ లేదు. స్థానిక సంస్థలకు వైద్యం, విద్య అప్పగించినప్పుడే పర్యవేక్షణ సక్రమంగా ఉంటుంది. తమ ప్రజలకు అవసరమైన ఇన్ ప్రాస్ట్రక్చర్ ను వారు బాధ్యతతో సమకూర్చగలుగుతారు. నిధులు దుర్వినియోగం కాకుండా కొనుగోళ్లకు కలెక్టర్ ఆద్వర్యంలో కమిటీని వేసినా సరిపోతుంది. వైద్య సిబ్బందిపై స్థానిక పర్యవేక్షణ ఉంటే సక్రమంగా విధులు నిర్వర్తిస్తారు. ప్రస్తుతం వైద్య,ఆరోగ్య శాఖ జవాబుదారీతనంతో ప్రవర్తించడం లేదు. చిన్న మునిసిపాలిటీలు, పంచాయతీల్లో డాక్టర్లు పనిచేయడానికి ఇష్టపడటం లేదు. తమ నియామకాలను ప్రభుత్వాలు చేస్తుండటంతో తాము సర్కారుకే సమాధానం చెబుతామన్నట్లుగా ఉంది. అదే పంచాయతీలు, మునిసిపాలిటీల పరిధిలోనే నియామకాలు కలెక్టర్ల నేతృత్వంలో సాగితే కచ్చితంగా అక్కడే బాద్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. ఆరోగ్య వ్యవస్థ మెరుగుపడుతుంది. పట్టణాలు, నగర పాలక సంస్థల్లో కొంతమేరకు కరోనా చికిత్స అందుతోంది. గ్రామాల్లో అసలు కరోనా పరిస్థితులపై నియంత్రణే లేదు. తీవ్రత ఉంటే టెస్టు చేయించుకుంటే సమీప పట్ణణాలకు తరలిస్తున్నారు. అక్కడ కరోనా టెస్టులు సైతం సమగ్రంగా జరగడం లేదు. సెకండ్ వేవ్ పట్టణాల్లో అదుపులోకి వచ్చే సమయానికి గ్రామ సీమల్లో విజ్రుంభించ కుండా ఉండాలంటే అక్కడ కూడా రాండమ్ గా టెస్లులు చేయడం మంచిది. వైద్యవ్యవస్థను స్థానిక సంస్థల పరిధిలోకి తేవడమే ఇటువంటి రుగ్మతలకు శాశ్వత పరిష్కారం. నిధులు కేటాయించి పర్యవేక్షణకు మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిమితం కావాలి.
-ఎడిటోరియల్ డెస్క్