శ్రీవాణి బాణీ మార్చారా ?
అవును. అంతేగా మరి. ఏదీ కూడా తన దాకా వస్తే తప్ప ఎవరూ సర్దుకోరు. ఇపుడు అదే జరుగుతోంది. ఏడాది క్రితం అనూహ్యంగా ఉప ముఖ్యమంత్రి పదవిని [more]
అవును. అంతేగా మరి. ఏదీ కూడా తన దాకా వస్తే తప్ప ఎవరూ సర్దుకోరు. ఇపుడు అదే జరుగుతోంది. ఏడాది క్రితం అనూహ్యంగా ఉప ముఖ్యమంత్రి పదవిని [more]
అవును. అంతేగా మరి. ఏదీ కూడా తన దాకా వస్తే తప్ప ఎవరూ సర్దుకోరు. ఇపుడు అదే జరుగుతోంది. ఏడాది క్రితం అనూహ్యంగా ఉప ముఖ్యమంత్రి పదవిని చేతిలో పెట్టి 31 ఏళ్ళకే అత్యంత కీలకమైన బాధ్యతలు జగన్ అప్పగిస్తే పుష్ప శ్రీవాణికి ఆ విలువ తెలిసిరాలేదు. ఆమెకే గిరిజన సలహా మండలి చైర్మన్ పదవి కూడా అదనంగా ఇచ్చారు. ఇక నీ ఇష్టం, ఆకాశమే హద్దు అని జగన్ తన చెల్లెమ్మకు చెప్పారు. అయితే పుష్ప శ్రీవాణికి మంత్రిగా కాదు, కనీసం తనను రెండవ సారి గెలిపించిన కురుపాం జనం మన్ననలు కూడా ఏడాదిలో పొందలేకపోయారు. సొంత మామ మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర రాజు సైతం కోడలి ఏలుబడి బాలేదనేశారు.
హెచ్చరికలే….
పుష్ప శ్రీవాణి పనితీరు పట్ల అధినాయత్వం చాలా సార్లు హెచ్చరించి చూసినా తీరు అసలు మార్చుకోలేదని అంటారు. ఆమె ఎంతసేపూ భర్త పరీక్షిత్ రాజు మీద ఆధారపడడం తప్ప స్వీయ ప్రతిభను చాటుకోలేకపోయారని చెబుతారు. ఇక విజయనగరం జిల్లాలో కూడా పుష్ప శ్రీవాణి బయట నియోజకవర్గాల్లో పర్యటనలు చేయకుండా తన పరిధిని గిరి గీసుకుని తానే తగ్గించుకున్నారు. ఇక ఆమె మంత్రి కిరీటానికే ఇపుడు ముప్పు వస్తుందని సంకేతాలతో పాటు వార్తలు రావడంతో హఠాత్తుగా అలెర్ట్ అయ్యారని అంటున్నారు.
పాడేరు టూర్….
ఉప ముఖ్యమంత్రి అయిన ఏడాది తరువాత పుష్ప శ్రీవాణి పాడేరు టూర్ వేశారు. అక్కడ ఐటీడీయే అధికారులతో సమావేశమై సమీక్షించారు. అలాగే కొన్ని అభివ్రుధ్ధిపనులకు ప్రారంభోత్సవాలు చేశారు. అంతే కాదు, గిరిజన హక్కులను కాలరాసే విధంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మీద రివ్యూకి వెళ్తామని కూడా తాజాగా ప్రకటించారు. ఏజెన్సీలో నూటికి నూరు శాతం ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలని వైసీపీ తెచ్చిన జీవోను ఈ ఏడాది ఏప్రిల్ లో సుప్రీం కోర్టు కొట్టేసింది. దాని మీద మళ్లీ రివ్యూ పిటిషన్ వేయాలని చాలా కాలంగా గిరిజన సంఘాలు పోరాడుతున్నాయి. అయితే దీని మీద ఇంతకాలం స్పందించని మంత్రి ఇపుడు హడావుడి పడుతున్నారు.
అయినా ఉంటుందా…?
ఇంత జరిగినా పుష్ప శ్రీవాణి మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అన్నది ఒక చర్చగా ఉంది. ఆమెకు మంత్రి పదవి తీసేయకపోయినా జగన్ మత్రుల శాఖల్లో మార్పులు చేస్తారని, ఫలితంగా ఉప ముఖ్యమంత్రి పదవి ఆమె కోల్పోతారని కూడా ప్రచారం సాగుతోంది. ఒకవేళ భారీ విస్తరణకు జగన్ పూనుకుంటే మంత్రి పదవికి కూడా ముప్పేనని అంటున్నారు. ఏది ఏమైనా హై కమాండ్ వద్ద మైనస్ మార్కులు పుష్ప శ్రీవాణికి పడుతున్నాయని, ఆమె ఇకనైనా కష్టపడి పనిచేస్తే తన పదవితో పాటు పది కాలాలు రాజకీయాల్లో మనగలుగుతుందని అంటున్నారు. రేపో మాపో కొత్త జిల్లాలు వస్తున్నాయి. దాంతో ఆమె జిల్లానే శాసిస్తూ పొలిటికల్ గా తన హవా చాటుకోగలదని కూడా అంటున్నారు. మరి తన రూట్ మార్చిన పుష్ప శ్రీవాణి ఇదే దూకుడు కొనసాగిస్తే మాత్రం ఆమెకు అవకాశాలు ఎపుడూ తెరచే ఉంటాయి.