రామ …రామ… జన్మధన్యం
రఘు రామ కృష్ణంరాజు ఒక సాధారణ లోక్ సభ సభ్యుడు. మాస్ లీడర్ కాదు. ప్రజానీకాన్ని ప్రభావితం చేయగల సమ్మోహక శక్తి కూడా కాదు. నైతిక విలువలకు [more]
రఘు రామ కృష్ణంరాజు ఒక సాధారణ లోక్ సభ సభ్యుడు. మాస్ లీడర్ కాదు. ప్రజానీకాన్ని ప్రభావితం చేయగల సమ్మోహక శక్తి కూడా కాదు. నైతిక విలువలకు [more]
రఘు రామ కృష్ణంరాజు ఒక సాధారణ లోక్ సభ సభ్యుడు. మాస్ లీడర్ కాదు. ప్రజానీకాన్ని ప్రభావితం చేయగల సమ్మోహక శక్తి కూడా కాదు. నైతిక విలువలకు నీళ్లొదిలేసి తనను ఎంపీని చేసిన పార్టీపైనే తీవ్రమైన ఆరోపణలతో కొంతకాలంగా పోరాటం చేస్తున్నాడు. రాజకీయంగా , సైద్ధాంతికంగా పార్టీతో విభేదించినప్పుడు రాజీనామా చేసి తన దారి తాను చూసుకోవచ్చు. మళ్లీ ప్రజల ముందుకు వెళ్లి తన సత్తా చాటుకోవచ్చు. అందుకు సాహసించకుండా పరిధులు దాటి ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే ప్రక్రియ మొదలు పెట్టారు. ఫలితంగా రఘు రామ కృష్ణంరాజుపై ఉచ్చు బిగించాలని ప్రయత్నించింది వైసీపీ సర్కారు. కానీ అతి తెలివికి పోయి తానే ఉచ్చులో చిక్కుకుంది. జాతీయ స్థాయిలో అభాసు పాలవుతోంది. రఘు రామ కృష్ణంరాజును చూసీ చూడనట్టు పోయినా లేదా సాధారణ కేసులు నమోదు చేసినా కొంతకాలానికి అతని రచ్చ మామూలుగానే సద్దు మణిగిపోయి ఉండేది. కానీ రాజద్రోహం కేసుతో రఘు రామ కృష్ణంరాజు ఢిల్లీలో చక్రం తిప్పడం మొదలు పెట్టారు. పలితం ఎలా ఉంటుందనేది పక్కన పెడితే అతని పోరాటం మాత్రం రాజకీయ వర్గాలలో ఆసక్తి రేకెత్తిస్తోంది. అనుచితంగా అన్ని ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్న అసాధారణ చట్టంపై చర్చకు తావిస్తోంది..
ప్రభుత్వాల పాశుపతాస్త్రం…
రాజద్రోహం నేరాభియోగం కింద దేశంలో కేసులు నమోదు చేయడం కొత్త కాదు. తీవ్రమైన విమర్శను, ఆరోపణలను తట్టుకోలేని ప్రభుత్వాలు రాజకీయంగా తమకు నష్టం వాటిల్లుతుందని భావించిన సందర్బాల్లో దీనిని దుర్వినియోగం చేస్తున్నాయి. దశాబ్దాలుగా ఈ విచ్చలవిడితనం కొనసాగుతూనే వస్తోంది. వ్యతిరేక స్వరాలను తీవ్రంగా అణచి వేయాలనుకుంటున్నప్పుడు ఈ అస్త్రాన్ని బయటికి తీస్తున్నాయి ప్రభుత్వాలు. ఆర్థిక, అంగ బలాలు, రాజకీయ అండ ఉండటంతో రఘురామకృష్ణం రాజు సుప్రీం కోర్టును ఆశ్రయించగలిగారు. అదే సాధారణ జర్నలిస్టులు, సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే సామాన్యులకు మాత్రం దిక్కు తోచదు. సుప్రీం కోర్టు స్థాయిలో పోరాటం చేయలేరు. సర్కారీ చట్టానికి పాదాక్రాంతులై జైలు పాలు కావాల్సిందే. బెయిలు కూడా దొరకని కఠినమైన ఉక్కుపాదం ఈ చట్టం. దీనిని ప్రాతిపదిక చేసుకుంటూ ప్రభుత్వాలు ప్రత్యర్థులను కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సాధారణంగా పోరాటం చేయగలిగిన శక్తి ఉన్న రాజకీయ నేతలపై కాకుండా సామాన్యులపైనే దీనిని ఎక్కువగా ప్రయోగిస్తూ ఉంటారు. భిన్న స్వరాలు పెరగకుండా అదుపు చేస్తూ ఉంటారు. లాబీయింగ్ తెలిసిన రఘు రామ కృష్ణంరాజుపై సెక్సన్ 124(ఏ) ప్రయోగించి అత్యుత్సాహం చూపింది వైసీపీ సర్కారు. ప్రతికూలంగా పరిణమించింది ఈ పాచిక. ప్రభుత్వాన్నే ఆత్మరక్షణలోకి నెట్టివేసింది.
ప్రాథమిక హక్కులకు సంకెళ్లు…
వలస రాజ్యమైన బారత దేశాన్ని పరిపాలించడంలో సౌలభ్యం కోసం ఈ రాజద్రోహం చట్టాన్ని తెచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం. సెక్షన్ 124( ఏ ) కి స్వతంత్ర బారతంలో అవసరముందా? అంటే మేధావులు , న్యాయనిపుణులు ‘నో ’అని స్పష్టంగా చెబుతారు. అయినా కర్ర పెత్తనం, నియంతృత్వ పోకడలను వదులుకోవడానికి ఇష్టపడని ప్రభుత్వాలు దీనిని కొనసాగిస్తూ వస్తున్నాయి. గుజరాత్ లో పాలనలో విఫలమవుతున్న ముఖ్యమంత్రి ని అధిష్ఠానం మార్చేందుకు అవకాశముందంటూ ఒక పాత్రికేయుడు తన అభిప్రాయాన్ని ప్రకటిస్తే రాజద్రోహం నేరం మోపడం ఇటీవలి ఉదాహరణ. ప్రజాభిప్రాయం పట్ల ప్రభుత్వాల అసహనానికి ఇటువంటి సంఘటనలే అద్దం పడుతున్నాయి. ప్రభువుల మనసెరిగిన పోలీసులు అడ్డగోలుగా ఈ చట్టాన్ని వినియోగిస్తున్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని పౌర హక్కులకు వ్యతిరేకంగా ఎక్కుపెడుతున్నాయి. బ్రిటిష్ కాలంలో సైతం దీనిని విచక్షణ రహితంగా వినియోగించిన దాఖలాలు లేవు. అసలు చట్టం చేసిన తర్వాత దశాబ్దాల పాటు బ్రిటిష్ వాళ్లు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. స్వాతంత్ర్యోద్యమ తీవ్రత పెరిగిన తర్వాత జాతీయ నేతలను అదుపు చేయడానికి , ఉద్యమాన్ని నీరుకార్చడానికి రాజద్రోహం చట్టాన్ని వాడుకున్నారు. అది వలస పాలన. మరిప్పటి ప్రభుత్వాలూ అదే పని చేయడమే విచిత్రం.
సర్కారు సహకరిస్తుందా..?
జాతీయోద్యమ స్ఫూర్తితో యోచిస్తే స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే సెక్షన్ 124ని రద్దు చేసి ఉండాల్సింది. కానీ పాలకులు మారారు. వారి ధోరణి మారలేదు. బ్రిటిష్ కాలం నాటి పీడనకు గుర్తుగా తాము కూడా ఈ చట్టాన్ని కొనసాగిస్తూనే వచ్చారు భారత ప్రభువులు. ఈ చట్టంపై రఘురామ కృష్ణం రాజు సుప్రీం కోర్టులో కేసు వేసి పోరాటం సాగిస్తున్నారు. దేశంలోనే ప్రముఖ మైన న్యాయవాదులను నియమించుకున్నారు. అంతటితో ఆగకుండా దేశంలోని అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులను కదుపుతున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. న్యాయపరంగా, రాజకీయ పరంగా చట్టం రద్దుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే రాజకీయ పార్టీల్లో కదలిక మొదలైంది. రఘు రామ కృష్ణంరాజు లోక్ సభ సభ్యునిగా తన నియోజకవర్గ ప్రజలకు ఎంతమేరకు సేవలు అందించారు? తన పార్టీకి ఎంతమేరకు ఉపయోగపడ్డారనేది అప్రస్తుతం. ఈ చట్టం విషయంలో కనీసం పార్లమెంటులో చర్చ లేవనెత్తగలిగితే ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప విజయం సాధించినట్లే. అయితే కేంద్రంలోని బీజేపీ ఇందుకు సహకరిస్తుందా? అంటే అనుమానమే. ఎందుకంటే ప్రభుత్వాలు తమ చేతిలోని బడితే కర్రను వదులుకోవడానికి ఇష్టపడవు. ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ మౌలిక స్వరూపంపై కేశవానంద భారతి కేసును ఇప్పటికీ న్యాయస్థానాలు ప్రామాణికంగా చెబుతుంటాయి. రఘురామ కృష్ణం రాజు పుణ్యమా? అని రాజద్రోహం పై కూడా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరిస్తే. పార్లమెంటుకు మార్గ నిర్దేశం చేస్తే ప్రజాస్వామ్యం పరిమళిస్తుంది. వ్యక్తిగతంగా అతనికి కలిగే ప్రయోజనం కంటే దేశానికే మేలు చేకూరుతుంది. రఘు రామ కృష్ణంరాజు రాజకీయ జీవితం ధన్యమవుతుంది.
-ఎడిటోరియల్ డెస్క్