అలా చేస్తే ..అభాసుపాలే..?
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ లోక్ సభ సభ్యుడు రఘు రామకృష్ణ రాజు ఉదంతం ఆ పార్టీకి విషమ పరీక్షగా మారింది. ఇరువైపులా పంతానికి పోవడంతో పార్టీకే ఎక్కువ [more]
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ లోక్ సభ సభ్యుడు రఘు రామకృష్ణ రాజు ఉదంతం ఆ పార్టీకి విషమ పరీక్షగా మారింది. ఇరువైపులా పంతానికి పోవడంతో పార్టీకే ఎక్కువ [more]
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ లోక్ సభ సభ్యుడు రఘు రామకృష్ణ రాజు ఉదంతం ఆ పార్టీకి విషమ పరీక్షగా మారింది. ఇరువైపులా పంతానికి పోవడంతో పార్టీకే ఎక్కువ నష్టం వాటిల్లే సూచనలు కనిపిస్తున్నాయి. లోక్ సభ స్పీకర్ ను తాజాగా కలిసిన విజయసాయిరెడ్డి బృందం చేసిన హెచ్చరికలు కలకలం సృష్టిస్తున్నాయి. కొరివితో తలగోక్కుంటున్నట్లు లేనిపోని వివాదాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారని పరిశీలకులు పేర్కొంటున్నారు. నిజానికి రఘు రామకృష్ణ రాజు పార్టీలో ఉన్నా, లేకపోయినా వైసీపీకి వచ్చిన నష్టం లేదు. ప్రభుత్వానికి ఉండే సమస్యలతో పోలిస్తే అదో చిన్న వ్యవహారం. అతనిపై అనర్హత వేటు వేయించడానికి ప్రయత్నించడం తప్పు కాదు. ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తున్నారంటూ సభాపతి స్థానాన్నే సవాల్ చేసేలా మాట్టాడటం బీజేపీకి సైతం ఆగ్రహం కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వమూ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 19 నుంచి మొదలయ్యే లోక్ సభ సమావేశాల్లోపు తమ పార్టీ ఎంపీపై వేటు వేయించాలనేది వైసీపీ పట్టుదల. అతను సమావేశాల్లో పాల్గొనకుండా నిరోధించాలనేది పార్టీ ఆలోచన. అది ఫలించే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు తనపై పోలీసుల దాడి సంఘటనకు సంబంధించి సభాహక్కుల ఉల్లంఘన ప్రతిపాదనకు రఘురామ కృష్ణరాజు ఇతర పార్టీల సభ్యుల మద్దతు కూడగడుతున్నారు. అదే జరిగితే వైసీపీకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తవచ్చు.
ఈ ఇద్దరి పంతం…
మొండివాడు రాజు కంటే బలవంతుడు అన్న సామెతకు నిలువుటద్దం రఘురామ కృష్ణ రాజు. నిజానికి జగన్ మోహన్ రెడ్డితో ఆయనకు పెద్దగా విభేదాలు లేవు. ఏడాది క్రితం విజయసాయిరెడ్డితోనే ఆయనకు చెడింది. ఆయన స్వతంత్రించి కేంద్రమంత్రులను కలిసేవారు. బీజేపీ సభ్యులతో రాసుకుపూసుకు తిరిగే వారు. వైసీపీలోని మిగిలిన సభ్యులు ఏ నిర్ణయమైనా జగన్ , విజయసాయి ల కనుసన్నల్లో మాత్రమే చేసేవారు. ఆ ధోరణికి రఘు రామకృష్ణ రాజు పూర్తి విరుద్దం. పార్లమెంటరీ పార్టీ నేతగా తనకు కూడా తెలియకుండా తమ ఎంపీ వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేని విజయసాయి రెడ్డి రఘురామను నియంత్రించేందుకు ప్రయత్నించారు. జగన్ మోహన్ రెడ్డి మాత్రమే తనకు నేత, మిగిలిన వారికి తాను సబార్డినేట్ కాదంటూ రఘు రామకృష్ణ రాజు ఘాటుగానే హెచ్చరించారు. ఫలితంగా ఇద్దరి మద్య విభేదాలు ఏర్పడ్డాయి. పంతాలు, పట్టింపులు పెరిగిపోయాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, పార్లమెంటరీ నేతగా తనకున్న అధికారంతో సాయి రెడ్డి షో కాజ్ నోటీసు జారీ చేయడంతో గొడవ పతాక స్థాయికి చేరింది. ఈలోపుగానే పార్టీకి నష్టం చేకూరుస్తున్నాడు. బీజేపీకి సన్నిహితంగా మారాడంటూ జగన్ కు సైతం ఎంపీ తీరుపై నూరిపోశారు. ఫలితంగా ముఖ్యమంత్రితో సైతం దూరం పెరిగింది. విజయ సాయి , రఘురామల మధ్య వ్యక్తిగత వివాదం రాను రాను పార్టీ వర్సస్ ఎంపీగా రూపు దిద్దుకుంది. మొదట్లో ముఖ్యమంత్రిని కలిసేందుకు రఘు రామకృష్ణ రాజు ప్రయత్నించినా బెడిసికొట్టింది. దాంతో తిరుగుబాటు జెండా ఎగరవేశాడు.
ఇప్పటికే ఓ నిర్ణయం..
రఘురామ కృష్ణ రాజును బహిష్కరించకుండా అనర్హత వేటు వేయించాలని వైసీపీ ఏడాది కాలంగా ప్రయత్నిస్తోంది. కానీ చట్టంలో పేర్కొన్న రెండు నిబంధనలు వర్తించకపోవడంతో స్పీకర్ ఎటూ తేల్చడం లేదు. పార్టీ విప్ ను ధిక్కరించడం, స్వచ్చందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవడం చేస్తే ఆటోమేటిక్ గా ఎంపీగా అనర్హుడు అయిపోతాడు. కానీ రఘు రామకృష్ణ రాజు చాలా తెలివిగా తమ ప్రభుత్వంలోని తప్పులను ఎత్తి చూపుతున్నాడు. ఇతర పార్టీలతో కలిసి కార్యక్రమాలు చేయడం లేదు. పార్టీ విప్ ను ధిక్కరించిన ఉదంతాలూ లేవు. కానీ ప్రజల్లో పార్టీని పూర్తిగా బద్నాం చేస్తున్నాడు. దీనిని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం రాజద్రోహం కేసు నమోదు చేసి అత్యుత్సాహం కనబరిచింది. ప్రభువుల మనసు ఎరిగి ప్రవర్తించే పోలీసు అధికారులు ఆయన పట్ల అనుచితంగానే ప్రవర్తించినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. పోలీసు కస్టడీలో ఉండగా గాయాలు కావడం చిన్నవిషయం కాదు. వీటన్నిటినీ స్పీకర్ దృష్టికి, కేంద్ర ప్రభుత్వ దృష్టికి , న్యాయస్థానాల దృష్టికి, లోక్ సభలో ఇతర పార్టీల దృష్టికి కూడా తీసుకెళ్లాడు రఘు రామకృష్ణ రాజు. అందువల్ల అతనిపట్ల సానుభూతి పెరిగింది. వైసీపీ నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తున్నప్పటికీ అనర్హత వేటు వేయడానికి సభాపతి సాహసించడం లేదు. న్యాయస్థానాల్లో ఈ నిర్ణయాన్ని సవాల్ చేయవచ్చు. పైపెచ్చు ఇతర పార్లమెంటు సభ్యులు నిలదీసే అవకాశం కూడా ఉంది. అందుకే ప్రివిలేజెస్ కమిటీకి ఈ మొత్తం ఉదంతాన్ని నివేదించాలని ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఏం జరగబోతోంది..?
లోక్ సభ సభ్యుడినైన తనపై ప్రభుత్వం భౌతిక దాడి చేయించిందంటూ ప్రివిలేజ్ మోషన్ కోసం ప్రయత్నిస్తున్నారు రఘు రామకృష్ణ రాజుమ. కనీసం అయిదునిముషాలు సభలో తన ఆవేదనను చెప్పుకునే అవకాశం కల్పించాలని సభాపతిని కోరారు. అదే జరిగితే మిగిలిన పార్టీల సబ్యుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది. దీనిని నివారించేందుకు తక్షణం అతనిపై వేటు వేయాలని వైసీపీ స్పీకర్ పై ఒత్తిడి తెస్తోంది. అది జరగక పోతే తాము సభను స్తంభింప చేస్తామంటూ పరోక్షంగా హెచ్చరిస్తోంది. ఈ వైఖరి బూమ్ రాంగ్ అయ్యే సూచనలున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ, రైల్యేజోన్, విభజన హామీల అమలు వంటి అనేక హామీలను కేంద్రం తుంగలో తొక్కుతోంది. వాటిపై లోక్ సభను ఇంతవరకూ ఆంధ్రప్రదేశ్ ఎంపీలు స్తంభింప చేయలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం లోక్ సభలో నినదించలేదు. కేవలం ఒక వ్యక్తిగతమైన అంశం, పార్టీ అంతర్గత వ్యవహారం పై పార్లమెంటులో గొడవ చేస్తే పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుంది. ప్రజల్లోనూ చెడు ముద్ర పడుతుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం సస్పెండైనా మంచిదే తప్ప ఎవరీకి ఉపయోగపడని అంశంపై రచ్చ చేస్తే మరింతగా ఇతర పార్టీల దృష్టిలో పలచన అయ్యే ప్రమాదం కూడా ఉంది. అనర్హత అంశం ప్రివిలేజ్ కమిటీకి వెళితే అన్ని పార్టీల ముందు తమ వాదన నెగ్గదనే భావన పార్టీలో ఉంది. అందుకే అక్కడికి వెళ్లకుండా నిరోధించాలని వైసీపీ భావిస్తోంది. కానీ ఇప్పటికే స్పీకర్ తన నిర్ణయం స్పష్టం గా చెప్పేశారు. రెండు పక్షాల వాదనలు విన్నాక వాటిని ప్రివిలేజ్ కమిటికీ పంపుతానన్నారు. అంటే తాను ఈ బురదను పులుముకోవాలనుకోవడం లేదన్నమాట. 19 నుంచి జరిగే సభలో రఘు రామకృష్ణ రాజు ఏం చెబుతారు? వైసీపీ ఎలా అడ్డుకుంటుంది? ఇతర పార్టీలు ఎలా స్పందిస్తాయి? కేంద్ర పెద్దల సమక్షంలో ఏం జరగబోతోందనేది ఉత్కంఠభరితమైన రాజకీయ డ్రామా.
-ఎడిటోరియల్ డెస్క్