కాలికి బలపం కట్టారా…?
పాదయాత్రలకు యమ డిమాండ్ వచ్చిపడింది. పాదయాత్ర అంటే కేరాఫ్ పవర్ అన్న మాటే. ఎవరైతే పాదయాత్ర చేశారో వారు నమ్ముకున్న కాళ్లు సింహాసనం వైపే నడిపించాయి తప్ప [more]
పాదయాత్రలకు యమ డిమాండ్ వచ్చిపడింది. పాదయాత్ర అంటే కేరాఫ్ పవర్ అన్న మాటే. ఎవరైతే పాదయాత్ర చేశారో వారు నమ్ముకున్న కాళ్లు సింహాసనం వైపే నడిపించాయి తప్ప [more]
పాదయాత్రలకు యమ డిమాండ్ వచ్చిపడింది. పాదయాత్ర అంటే కేరాఫ్ పవర్ అన్న మాటే. ఎవరైతే పాదయాత్ర చేశారో వారు నమ్ముకున్న కాళ్లు సింహాసనం వైపే నడిపించాయి తప్ప వమ్ము చేయలేదు. అపుడెపుడో 1980 దశకంలో పాదయాత్ర చేసి లైం లైట్ లోకి వచ్చిన చంద్రశేఖర్ తరువాత కాలంలో దేశ ప్రధాని అయిపోయారు. ఆ తరువాత 2003లో ఏపీలో పాదయాత్ర చేసిన వైఎస్సార్ రాజకీయ గండరగండడు చంద్రబాబుని గద్దె నుంచి కూలదోసి ముఖ్యమంత్రి అయిపోయారు. ఆ పాదయాత్ర ప్రభావం ఎంత బలంగా ఉందంటే వైఎస్సార్ రెండవ మారు కూడా సీఎం అయ్యారు. ఇక 2013లో చంద్రబాబునాయుడు పాదయాత్ర చేసి నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రి అయిపోయారు. బాబు పదేళ్ల అధికార పోరాటానికి తుదిమెరుగులు దిద్దింది అచ్చంగా పాదయాత్రేమరి. ఇక జగన్ విషయానికి వస్తే ఆయన 2017 నవంబర్లో మొదలుపెట్టిన పాదయాత్ర 2019 జనవరి వరకూ కొనసాగించారు. తాజా ఎన్నికల్లో బంపర్ మెజారీతో పీఠం పట్టేశారు.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ….
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ రాహుల్ పాదయాత్ర చేస్తారట. దీనికి సంబంధించి టైం, షెడ్యూల్ ఇంకా ప్రకటించకపోయినా సాధ్యమైనంత త్వరలోనే రాహుల్ పాదయాత్ర ఉంటుందని కాంగ్రెస్ వర్గాల సమాచారం. ఈనాడు దేశంలో బీజేపీ ప్రభ వెలిగిపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. దాంతో ఆ వైపు నుంచి ఈ వైపు దాకా కాంగ్రెస్ కు ఊపు తేవాలంటే పాదయాత్ర అతి పెద్ద బ్రహ్మాస్త్రమని రాహుల్ భావిస్తున్నారుట. ఈ పాదయాత్ర ద్వారా కోట్లాది మంది ప్రజలను నేరుగా కలుసుకోవచ్చునని ఆయన ఉద్దేశ్యం. అలాగే పార్టీ నిర్మాణాన్ని అట్టడుగు నుంచి తిరిగి ప్రారంభించాలన్నది రాహుల్ ఆలోచనగా చెబుతున్నారు. ఇపుడున్న కాంగ్రెస్ లో అన్నీ వృధ్ధ జంబూకాలే ఉన్నాయి. అందువల్ల ప్రజల్లోకి వెళ్ళి వారి నుంచే మంచి యువ నాయకత్వాన్ని తయారు చేసుకోవాలని రాహుల్ భావిస్తున్నారట. అదే సమయంలో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను జనం మధ్య నుంచే ఎండగట్టాలన్నది రాహుల్ అసలైన ప్లాన్ గా ఉంది. మొత్తానికి రాహుల్ పాదయాత్ర చేపడితే అది దేశంలోనే ఓ పెద్ద సంచలనం అవుతుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
బీజేపీకి ఇబ్బందేనా…?
కేంద్రంలో రెండవమారు అధికారంలోకి కాంగ్రెస్ రావడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పూర్తిగా విఫలం కావడమే. బీజేపీ మీద కూడా ఎంతో కొంత వ్యతిరేకత ఉన్నా కాంగ్రెస్ కోలుకోలేని స్థితిలో ఉండడం, ప్రాంతీయ పార్టీలకు జాతీయ ద్రుక్పధం లేకపోవడం వంటి కారణాలతో మోడీకి మళ్ళీ పట్టం కట్టారు. ఇక మరో వైపు వామపక్షాలు జాతీయ స్థాయిలో తమ ప్రాభవాన్ని కోల్పోయాయి. రాహుల్ గాంధి కనుక కాంగ్రెస్ ని పునరుజ్జీవింపచేస్తే బీజేపీకి అది గట్టి సవాల్ గా మారుతుంది. ప్రజల ఆలోచనా విధానాలు కూడా ప్రతి అయిదేళ్ళకూ మారిపోతూంటాయి. ఒకరికే శాశ్వతంగా అధికారం అన్నది ప్రజాస్వామ్యంలో ఉత్త మాట. అందువల్ల రాహుల్ పాదయాత్ర కనుక చేస్తే అది కాంగ్రెస్ పార్టీ దిగువ స్థాయి నుంచి బతికి బట్టకట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అదే సమయంలో కాంగ్రెస్ లో అగ్రనాయకులు ఇంతకు ముందు ఎవరూ పాదయత్ర చేపట్టలేదు. రాహుల్ అది చేస్తే ఆయన తిరుగులేని జాతీయ నాయకుడు గా కూడా అవతరించడం ఖాయం. ఆయన రేపటి దేశానికి బలమైన ప్రధాని అభ్యర్ధిగా ముందుకు దూసుకువచ్చినా ఆశ్చర్యం లేదు.