అబ్బాయి తగ్గుతుంది ఇందుకేనా?
శ్రీకాకుళం జిల్లాలో కింజరపు కుటుంబ వారసుడు, యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈ మధ్య ఎందుకో సైలెంట్ గా ఉంటున్నారు. ఆయన వ్యవహార శైలికి భిన్నంగా ఉంటూ [more]
శ్రీకాకుళం జిల్లాలో కింజరపు కుటుంబ వారసుడు, యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈ మధ్య ఎందుకో సైలెంట్ గా ఉంటున్నారు. ఆయన వ్యవహార శైలికి భిన్నంగా ఉంటూ [more]
శ్రీకాకుళం జిల్లాలో కింజరపు కుటుంబ వారసుడు, యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈ మధ్య ఎందుకో సైలెంట్ గా ఉంటున్నారు. ఆయన వ్యవహార శైలికి భిన్నంగా ఉంటూ వస్తున్నారు. నిజానికి మొదటి అయిదేళ్ళూ ఎంపీగా వీర లెవెల్లో చెలరేగిన ఎర్రన్నాయుడు గారి అబ్బాయి ఇపుడు పెద్దగా పెదవి విప్పకపోవడం వెనక మతలబు ఏంటన్నది సొంత పార్టీలో చర్చ సాగుతోంది. ఎర్రన్నాయుడు రాజకీయ వారసత్వం కాస్తా ఆలస్యమైనా అందుకుని బెస్ట్ ఎంపీ అనిపించుకున్న రామ్మోహన్నాయుడుకు ఇంటి పోరు ఏమైనా ఉందా అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. సొంత బాబాయి అచ్చెన్నాయుడు ఇపుడు టీడీపీలో కీలకం కావడం కూడా అబ్బాయి మౌనానికి కారణమా అన్నది కూడా చర్చకు వస్తోంది. నిజానికి ఎర్రన్నాయుడు రాజకీయ వారసుడు ఎవరంటే రామ్మోహన్ నాయుడనే చెప్పాలి. కానీ బాబాయి దూకుడుతో అబ్బాయి వెనకబడిపోతున్నారని అంటున్నారు. పైగా చంద్రబాబుకు కుడి భుజంగా అచ్చెన్న మారిపోవడంతో జిల్లా పార్టీలోనూ ఆయన హవా బాగానే సాగుతోంది.
ఢిల్లీకే పరిమితమా…?
వాస్తవానికి రామ్మోహన్నాయుడు ఈసారి ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలనుకున్నారని అప్పట్లో ప్రచారం సాగింది. అదే సమయంలో అచ్చెన్నని ఎంపీగా పంపించాలనుకున్నారట. కానీ అచ్చెన్న పట్టుబట్టి అసెంబ్లీకే పోటీ చేయడం, దాని వెనక చంద్రబాబు మద్దతు కూడా ఉండడంతో నాడే కొంత రామ్మోహన్ నాయుడికి అసంత్రుప్తి కలిగిందని అంటారు. దానికి ప్రతిఫలంగా ఆయన చెల్లెలు భవానికి ఎమ్మెల్యేగా నిలబెట్టించారని అంటారు. అయితే సొంత జిల్లాలో తనకు పార్టీ పట్టు దొరకకపోవడంతో ఆ బాధ మాత్రం రామ్మోహన్ నాయుడు లో అలాగే ఉండిపోయిందని చెప్పుకుంటారు. ఇక ప్రతిపక్షంలో పార్టీ వచ్చాక కూడా అచ్చెన్న జోరు ఎక్కడా ఆగడంలేదు. ఆయన కనుసన్నలలోనే సిక్కోలు జిల్లా పార్టీ నడుస్తోంది. టీడీపీ లెజిస్లేచర్ పార్టీ ఉప నేతగా అచ్చెన్న కీలకంగా మారిపోయారు. ఇదే స్పీడ్ తో బాబాయ్ ఉంటే ఎప్పటికీ జిల్లా పార్టీలో అబ్బాయికి పట్టు చిక్కదన్న సందేహాలు ఉన్నాయి. దాంతోనే రామ్మోహన్ నాయుడుఈ మధ్య పెద్దగా నోరు చేసుకోవడంలేదా అన్న డౌట్లు తమ్ముళ్ల నుంచే వ్యక్తం అవుతున్నాయి. దాంతో ఓ సాధారణ ఎంపీగా ఢిల్లీకే తాను పరిమితం కావాల్సివస్తోందన్న ఆవేదన ఆయనలో ఉందని అంటున్నారు.
అలా ప్రచారం….?
రామ్మోహన్నాయుడు వేరే పార్టీ వైపు చూస్తున్నారు అన్న ప్రచారం కూడా ఆ మధ్య జోరుగా సాగింది. ఆయన బీజేపీలో చేరుతారని కూడా చెప్పుకున్నారు. అయితే ఆయన టీడీపీలోనే ఉంటారని కూడా ఆ పార్టీ పెద్దలు అంటున్నారు. ఢిల్లీలో అయితే ఎర్రన్నాయుడు కుమారుడుగా రామ్మోహన్ నాయుడికి కొంత గుర్తింపు ఉంది. ఆయన లాంటి బలమైన బీసీ నేత, యువకుడు పార్టీలో చేరితే కమలం ఉత్తరాంధ్రలో వికసిస్తుందని కూడా అంచనాలు లేకపోలేదు. మరో వైపు వైసీపీలో కూడా రామ్మోహన్ నాయుడు చేరుతారన్న మాట కూడా ప్రచారంలో ఉంది. ఆయన్ని తమ వైపు తిప్పుకునేందుకు ఈ రెండు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని అంటున్నా రామ్మోహన్ నాయుడు మాత్రం టీడీపీని వీడరనే అంటున్నారు. అయితే ఆయనలో అసంత్రుప్తి మాత్రం ఉందని గట్టిగా చెబుతున్నారు. టీడీపీకి ఉన్న ముగ్గురు ఎంపీలూ వివిధ కారణల వల్ల బాబుకు కొంత ఎడం పాటిస్తున్నట్లుగా అయితే ఏపీ రాజకీయాల్లో చర్చగా ఉంది. మరి అందులో ఒకరైన రామ్మోహన్నాయుడు ఏం చేస్తారు అన్నది చూడాలని అంటున్నారు.