బాబా.. బాబా… బ్లా..బ్లా..బ్లా …!
యోగా గురు బాబా రాందేవ్ ను హెచ్చరిస్తూ కేంద్రమంత్రి హర్షవర్ధన్ లేఖ రాయడం సంచలనం కలిగిస్తోంది. నిన్నామొన్నటివరకూ బీజేపీకి రాందేవ్ ప్రధాన మద్దతుదారు. గత సంవత్సరం కరోనా [more]
యోగా గురు బాబా రాందేవ్ ను హెచ్చరిస్తూ కేంద్రమంత్రి హర్షవర్ధన్ లేఖ రాయడం సంచలనం కలిగిస్తోంది. నిన్నామొన్నటివరకూ బీజేపీకి రాందేవ్ ప్రధాన మద్దతుదారు. గత సంవత్సరం కరోనా [more]
యోగా గురు బాబా రాందేవ్ ను హెచ్చరిస్తూ కేంద్రమంత్రి హర్షవర్ధన్ లేఖ రాయడం సంచలనం కలిగిస్తోంది. నిన్నామొన్నటివరకూ బీజేపీకి రాందేవ్ ప్రధాన మద్దతుదారు. గత సంవత్సరం కరోనా విజ్రుంభించేంతవరకూ సంబంధాలు సజావుగానే ఉన్నాయి. కానీ కరోనాను అరికడతానంటూ తమ ఆయుర్వేద సంస్థ ద్వారా తయారు చేసిన మందులకు ప్రత్యేక గుర్తింపు కోరడంతోనే రాందేవ్ కు చిక్కులు వచ్చి పడ్డాయి. శాస్త్రీయమైన నిర్ధారణ లేకుండానే తమ మందులు కరోనాను తగ్గిస్తాయంటూ తొలుత ఆయన ప్రచారం మొదలు పెట్టారు. దీనిపై రకరకాల ఫిర్యాదులు, చివరికి న్యాయస్తానంలో కేసుల స్థాయికి వ్యవహారం ముదిరింది. దాంతో రోగం నివారణ అనే ప్రచారాన్ని విరమించుకుని, రోగనిరోధకతకు తమ మందులు ఉపయోగపడతాయంటూ రాందేవ్ మాట మార్చాల్సి వచ్చింది. అయితే ఈ మొత్తం తతంగంలో కేంద్రం తనకు మద్దతుగా నిలవలేదని బాబా అలకబూనారు. అప్పట్నుంచి సంబంధాలు సజావుగా లేవు. తాజాగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫిర్యాదుతో వివాదం పరాకాష్టకు చేరింది. ఫలితమే ఘాటుగా రాందేవ్ కు కేంద్రం నుంచి సంకేతాలు అందాయి. ఒకవేళ అదుపు తప్పితే చట్టపరమైన చర్యలు తప్పవనే సంకేతాలూ లేఖలో అంతర్లీనంగా దాగి ఉన్నాయి.
బీజేపీ తో చెడింది..
యోగాభ్యాసాల ద్వారా ప్రఖ్యాతి తెచ్చుకున్న రాందేవ్ బాబా తర్వాత కాలంలో ఆయుర్వేదాన్ని తన ఆర్థిక వనరుగా మార్చుకున్నారు. వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని సృష్టించారు. యోగాలో తనకు లక్షల మంది ఫాలోవర్లు ఉండటంతో ప్రచారం సులభతరమైంది. సైద్దాంతికంగానూ బీజేపీకి చేరువయ్యారు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత వేగంగా , సులభంగా తన వ్యాపారం వృద్ధి చెందుతుందని ఆశించారు. అయితే బాబా రాందేవ్ చంచల స్వభావం తెలిసిన కేంద్రం నిరంతరం అప్రమత్తంగా ఉంటోంది. ఆచితూచి వ్యవహరించింది. దాంతో ఆయన ఎత్తుగడలు పారలేదు. ఒక దశలో బీజేపీ పట్ల తీవ్రమైన అసంతృప్తినే బాబా ప్రకటించారు. కానీ కేంద్రం తలచుకుంటే తన వ్యాపార మూలాలకే ఎసరు వస్తుందని గ్రహించి మళ్లీ తర్వాత సర్దుకున్నారు. తాజాగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాందేవ్ బాబాపై ధ్వజమెత్తడంతో కేంద్రం మరోసారి ఆయనకు హెచ్చరికలు జారీ చేసింది. అయితే కేంద్రం కూడా రాందేవ్ జోలికి నేరుగా వెళ్లడానికి ఇష్టపడటం లేదు. బాబాకు ఇప్పటికే సుస్థిరమైన వ్యాపార సామ్రాజ్యం , ఆయనను విశ్వసించే కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అందువల్ల పనిగట్టుకుని ఆయనపై చర్యలకు పూనుకోకపోవచ్చు. అయితే తమ కనుసన్నల్లో ఉండేలా చూసుకునేందుకే కేంద్రం ప్రయత్నిస్తుంది.
ఐఎంఎ వాదన కరెక్టేనా..
అల్లోపతి వైద్యం అంతా హంబగ్. కరోనా విషయంలో సాధించిందేమీ లేదంటూ బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆగ్రహానికి కారణమయ్యాయి. బాబా వ్యాఖ్యలు నిజంగా డాక్టర్ల నైతిక స్తైర్యాన్ని దెబ్బతీసేవని అంగీకరించాల్సిందే. కానీ ప్రజల్లోనూ అదే రకమైన భావనలు నెలకొంటున్నాయి. కరోనాకు రోజుకో రకమైన ట్రీట్ మెంట్ ను చెబుతున్నారు. రెమ్ డెసివర్ సర్వ రోగ నివారిణి అన్నట్లుగా తొలుత అల్లోపతి వైద్యులు ఆచరించారు. ప్రస్తుతం అది పెద్దగా పనికిరాదంటున్నారు. ఈలోపుగానే వేల కోట్ల రూపాయల దోపిడీ, బ్లాక్ మార్కెటింగ్ జరిగిపోయింది. ప్లాస్మా థెరపీలంటూ కొంతకాలం హడావిడి చేశారు. ఇప్పుడు వాటివల్ల పెద్ద ప్రయోజనం లేదంటున్నారు. అలాగే ఆవిరిపట్టడం, స్లెరాయిడ్ల వంటి అన్ని విషయాల్లోనూ పరస్పర వైరుద్ధ్యమైన చికిత్సలను అల్లోపతి ఆచరిస్తోంది. అనుసరిస్తోంది. తాజాగా అల్లోపతి వైద్యంలో తీవ్రత కారణంగానే బ్లాక్ ఫంగస్ వస్తుందనే కొత్త నిర్దారణలు వస్తున్నాయి. అంటే కరోనా చికిత్స విషయంలో అల్లోపతిలో కూడా శాస్త్రీయత లేదనే అర్థం చేసుకోవాలి. బాబా రాందేవ్ విమర్శించారన్న మాట పక్కన పెడితే సామాన్యుల లోనూ అల్లోపతిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. బాబా మాటల పట్ల అంతగా బాధ పడిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రయివేటు ఆసుపత్రుల దోపిడీపై ఎందుకు స్పందించడం లేదో అర్థం కాదు. పేదలకు నిర్దిష్ట ఛార్జీలు మించకుండా వైద్యం అందించేందుకు ఐఎంఎ తీసుకున్న చర్యలేమిటో తెలియదు. విమర్శలకు బాధ పడేముందు ఆత్మవిమర్శ కూడా అవసరమే.
ఆనందయ్య మాటేమిటి..?
కరోనా సమయంలో నెల్లూరుజిల్లా ఆనందయ్య ఆయుర్వేదానికి విపరీతమైన గిరాకి ఏర్పడింది. ప్రజలు ప్రభుత్వ వైద్యం, ప్రయివేటు దోపిడీని తట్టుకోలేని పరిస్తితుల్లో ఉచితంగా లభించే మందుపై ఆశగా ఎదురు చూడటం తప్పు కాదు. పైపెచ్చు వైద్యంపై విశ్వాసం ప్రజలలో మూడో వంతు రోగాన్ని తగ్గించేస్తుంది. ఇంతవరకూ అల్లోపతిలో ఏమేం మందులు, ఏ పాళ్లలో వాడటం వల్ల రోగం తగ్గుతుందో ఎవరికీ తెలియదు. అదే ఆనందయ్య మందులో ఏమేం వాడతారో ప్రజలందరికీ తెలిసిన మూలికలే. అందువల్ల వాటిపై విశ్వాసం పెంచుకుంటున్నారు. చుట్టూ చీకటిలో కలుగుతున్న చిరునమ్మకం వారికి ప్రాణం పోస్తోంది. మందులోని మహత్తరమైన మూలికలు ఎలా పనిచేస్తున్నాయో నిపుణులే తేల్చాలి. అంతవరకూ పేద ప్రజలకు పెన్నిధిగానే దీనిని భావించాలి. ఇక్కడ కూడా మాబ్ సైకాలజీ, మాస్ హిస్టీరియా ప్రవేశించకుండా తగు జాగ్రత్తలతో ప్రజలకు కనీసం ఈ మందు అయినా అందేలా చూడటం ప్రభుత్వ కర్తవ్యం. వీలైనంత తొందరగా దీనిపై శాస్త్రీయ నిర్ధారణ చేయాలి.
-ఎడిటోరియల్ డెస్క్