చివర్లో జంప్ చేస్తారట
జగన్ సునామీలో సైతం తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి కొరుకుడుపడని సీటు అది. ఎన్నికల ముందు చేసిన మార్పు చేర్పుల పుణ్యమాని వైసీపీ ఇంచార్జిలు పట్టు సంపాదించలేక చతికిలపడ్డారు. [more]
జగన్ సునామీలో సైతం తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి కొరుకుడుపడని సీటు అది. ఎన్నికల ముందు చేసిన మార్పు చేర్పుల పుణ్యమాని వైసీపీ ఇంచార్జిలు పట్టు సంపాదించలేక చతికిలపడ్డారు. [more]
జగన్ సునామీలో సైతం తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి కొరుకుడుపడని సీటు అది. ఎన్నికల ముందు చేసిన మార్పు చేర్పుల పుణ్యమాని వైసీపీ ఇంచార్జిలు పట్టు సంపాదించలేక చతికిలపడ్డారు. ఇక జగన్ వద్దకు వచ్చి పార్టీలో చేరుతానని చెప్పిన ఆ మాజీ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వలేను అని చెప్పేశారు. తాను మాట ఇచ్చిన వారికే టికెట్ అనేశారు. దాంతో జనసేనలో చేరి రాజోలు నుంచి పోటీ చేసిన రాపాక వర ప్రసాదరావు ఫలితాల తరువాత చూసుకుంటే మొత్తం పార్టీకే ఏకైక ఎమ్మెల్యే అయిపోయారు. ఓ విధంగా ఆయన మనసు వైసీపీలో ఉంది. కానీ జనసేన ఎమ్మెల్యేగా అయిపొయారు. 2009 ఎన్నికలో వైఎస్సార్ చలువతో తొలిసారి గెలిచిన రాపాకకు వైఎస్సార్ కుటుంబం అంటే అభిమానం. ఇక జనసేనకు ఎటూ అధికారం లేదు, పదవులు రావు, గెలిచిన ఎమ్మెల్యేగా పని చేయాలి, అందుకే ఆయన తాను మనసు పడ్డ వైసీపీకే జై అనేస్తున్నారు.
అసెంబ్లీలోనే మద్దతు…..
ఇక నిండు అసెంబ్లీలో రాపాక వరప్రసాద్ జగన్ ని పొగిడేశారు. బడ్జెట్ పై మాట్లాడుతూ పేదల పక్షపాతిగా జగన్ చరిత్ర సృష్టించారని కొనియాడారు. జగన్ తన తండ్రి వైఎస్సార్ లాగానే బీదల దేవుడు అంటూ చెప్పుకొచ్చారు. బడ్జెట్ లో పెట్టినవన్నీ అమలు చేస్తే జగన్ కి ఎప్పటికీ తిరుగులేదని కూడా జోస్యం చెప్పారు. మరి బయట మాత్రం జనసేన అధినేత కనీసం మంచి పనులకు కూడా జగన్ ని మెచ్చుకోరు. కానీ రాపాక వరప్రసాదరావు మాత్రం జగన్ ని పొగుడుతూనే ఉంటారు. ఈ మధ్య ఆటో కార్మికులకు పదివేలు వైఎస్సార్ వాహన మిత్ర పధకం ద్వారా అందించినందుకు ఆటో కార్మికులతో కలిసి వైఎస్ జగన్ చిత్రపటానికి రాపాక వరప్రసాద్ పాలాభిషేకం చేశారు. వీలు దొరికినపుడల్లా ఆయన గుండె విప్పుతూ అక్కడ ఉన్న వైఎస్సార్, జగన్ ల బొమ్మను ప్రదర్శించేస్తున్నారు.ఇది జనసైనికులకు కంటగింపుగా ఉన్నా ఆయన ఎక్కడా తగ్గడంలేదు.
అయిదేళ్ళు ఇలాగేనట….
తాను వైసీపీలోకి చేరాలనుకుంటే పార్టీ పదవికి, ఎమ్మెల్యే గిరికి రాజీనామా చేయాలి. ఉప ఎన్నికలు వస్తే పెద్ద తలనొప్పి. అందువల్ల ఇలాగే జగన్ ని పొగుడుతూ అయిదేళ్ళ పాటు బయట నుంచి మిత్ర ఎమ్మెల్యేగా కాలక్షేపం చేయాలని వరప్రసాద్ వ్యూహరచన చేస్తున్నారుట. ఆ విధంగా వచ్చే ఎన్నికల నాటికి వైసీపీలో చేరి పోటీ చేయాలన్నది ఆయన ప్లాన్ అంటున్నారు. మరో వైపు జనసేనలో ఆయనకు పెద్దగా గౌరవం దక్కడం లేదన్న ప్రచారం ఉంది. పార్టీలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అయినా పవన్ ఆయన్ని పట్టించుకున్నట్లుగా కనిపించరని అంటున్నారు.
మాజీలను కూర్చోబెట్టుకుని…..
మాజీలను కూర్చోబెట్టుకుని సమావేశాలు నిర్వహించే పవన్ కి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద్ మాత్రం గుర్తుకురావడంలేదని, అందుకే అత్యున్నత కమిటీల్లో ఆయన్ని నియమించలేదని అంటారు. ఓ విధంగా పార్టీకి రాపాక వరప్రసాద్ కు దూరం పెరిగింది అంటారు. అయితే బయటకు మాత్రం ఆయన తమ ఎమ్మెల్యే అని చెప్పుకునే రాజకీయం జనసేన చేస్తోంది. ఇది ఓ రకమైన రాజకీయమైతే రాపాక వరప్రసాద్ సైతం ఇక్కడ ఉంటూ అక్కడ జై కొడుతూ తన మార్క్ రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి ఈ ఎమ్మెల్యే కధ చాలా వెరైటీగా ఉందని, మనసొక చోట, మనువు ఒక చోటలా తయారైందని సెటైర్లు పడుతున్నాయి.