రాపాక టెన్షన్ ఫ్రీ అయ్యారట
రాజోలు నియోజకవర్గంలో వైసీపీ ఒక్కొక్క అడ్డును తొలిగించుకుని వెళుతుంది. వైసీపీలో ఉన్న అసంతృప్తులకు చెక్ పెడుతుంది. గత ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గంలో మాత్రమే జనసేన గెలిచింది. అక్కడ [more]
రాజోలు నియోజకవర్గంలో వైసీపీ ఒక్కొక్క అడ్డును తొలిగించుకుని వెళుతుంది. వైసీపీలో ఉన్న అసంతృప్తులకు చెక్ పెడుతుంది. గత ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గంలో మాత్రమే జనసేన గెలిచింది. అక్కడ [more]
![రాపాక టెన్షన్ ఫ్రీ అయ్యారట రాపాక టెన్షన్ ఫ్రీ అయ్యారట](https://telugu.telugupost.com/wp-content/uploads/sites/2/2021/08/rapaka-varaprasad-july-20.jpg)
రాజోలు నియోజకవర్గంలో వైసీపీ ఒక్కొక్క అడ్డును తొలిగించుకుని వెళుతుంది. వైసీపీలో ఉన్న అసంతృప్తులకు చెక్ పెడుతుంది. గత ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గంలో మాత్రమే జనసేన గెలిచింది. అక్కడ విజయం సాధించిన రాపాక వరప్రసాద్ తర్వాతి కాలంలో జగన్ కు మద్దతుదారుగా మారిపోయారు. అయితే ఆయనకు నియోజకవర్గంలో ఏ మాత్రం వైసీపీ నుంచి సహకారం అందడం లేదు. జనసేన క్యాడర్ దూరమయిపోగా, ఇటు వైసీపీ క్యాడర్ దగ్గరకు రానివ్వకపోవడంతో రాపాక వరప్రసాద్ ఒంటరి అయ్యారు.
మూడు గ్రూపులు…
తాజాగా జగన్ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడం రాపాక వరప్రసాద్ కు కొంత ఊరటనిచ్చిందనే చెప్పాలి. రాజోలు వైసీపీలో మొత్తం మూడు గ్రూపులున్నాయి. ఒకటి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ది కాగా, మరొకటి అమ్మాజీది. ఇక గత ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయని బొంతు రాజేశ్వరరావుది మరొక బలమైన గ్రూపు. ఈ మూడు గ్రూపులతో రాజోలు వైసీపీ క్యాడర్ అయోమయంలో పడింది. ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరుకుంది.
పోటీ పెరగడంతో….
మంత్రులు సయితం రాపాక వరప్రసాద్ కు అండగా నిలబడటంతో మిగిలిన నేతలు మరింత ఆగ్రహంగా ఉన్నారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేసి ఎలాగైనా గెలవాలన్నది వైసీపీ నేత బొంతు రాజేశ్వరరావు ఆకాంక్ష. 2019 ఎన్నికల్లో కేవలం 700 ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యానని, ఈసారి ఖచ్చితంగా గెలుపుతనదేనని బొంతు రాజేశ్వరరావు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కానీ రాపాక వరప్రసాద్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. జగన్ కూడా అందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
నామినేటెడ్ పోస్టుల భర్తీతో…
ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడం కొంత ఊరట నిచ్చింది. రూరల్ వాటర్ సప్లై సలహాదారుగా బొంతు రాజేశ్వరరావును జగన్ నియమించారు. దీంతో ఆయన అసంతృప్తి కొంత వరకూ చల్లారినట్లేనని అంటున్నారు. అమ్మాజీకి ఇంతకు ముందే నామినేటెడ్ పదవి దక్కింది. దీంతో మూడు వర్గాలు ఐక్యతగా పనిచేయాలని జగన్ ఆదేశించినట్లు తెలిసింది. మొత్తం మీద ప్రస్తుత ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ టెన్షన్ చాలా తగ్గిందంటున్నారు.