నమ్మకం లేకే జారిపోతున్నారా..?
‘ఐదేళ్లు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నా వద్ద అన్ని పనులు చేయించుకొని ఇప్పుడు పార్టీ మారుతున్నారు. కుట్రలో భాగంగానే మా నేతలను లాక్కుంటున్నారు. పార్టీ మారే వారికి నేను [more]
‘ఐదేళ్లు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నా వద్ద అన్ని పనులు చేయించుకొని ఇప్పుడు పార్టీ మారుతున్నారు. కుట్రలో భాగంగానే మా నేతలను లాక్కుంటున్నారు. పార్టీ మారే వారికి నేను [more]
‘ఐదేళ్లు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నా వద్ద అన్ని పనులు చేయించుకొని ఇప్పుడు పార్టీ మారుతున్నారు. కుట్రలో భాగంగానే మా నేతలను లాక్కుంటున్నారు. పార్టీ మారే వారికి నేను భయపడను’.. పార్టీ మారుతున్న నేతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలివి. అయితే, భయపడాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకు లేదు కానీ ఆలోచించుకోవాల్సిన అవసరం మాత్రం ఉన్నట్లు కనిపిస్తోంది. మరోసారి అధికారంలోకి వస్తామని చంద్రబాబు సహా తెలుగుదేశం పార్టీ నేతలంతా ధీమాగా చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉంది అన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే, ఎన్నికల వేళ అధికార పార్టీని వీడి ప్రతిపక్ష పార్టీలోకి చేరడం మాత్రం అసాధారణమే. అదీ టీడీపీ బలంగా ఉందని చెప్పుకుంటున్న సమయంలో వరుసగా నేతలు పార్టీని వీడటం టీడీపీ ముఖ్యులను లోలోన కలవరపరుస్తోంది. అసలు పార్టీ మారేందుకు కారణాలను విశ్లేషించుకునే పనిలో ఉన్నారు. పైకి సీట్ల వ్యవహారంలో ఇబ్బందితోనే పార్టీ మారుతున్నారని అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నా… వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది.
టిక్కెట్లకు ఇబ్బందేం లేదు…
గతంలో ఎన్నడూ లేనంత సీరియస్ గా చంద్రబాబు ఈ ఎన్నికలను తీసుకున్నారు. కచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఆయన ప్రతి క్షణం శ్రమిస్తున్నారు. కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అందుకున్నారు. మోడీకి వ్యతిరేక ఉద్యమాన్ని నడుపుతున్నారు. అయితే, ఇంత చేస్తున్నా టీడీపీ నేతలు పార్టీని ఎందుకు వీడి వైసీపీలో చేరుతున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం చంద్రబాబుపై ఉంది. అయితే, సీట్ల కోసం, టీడీపీలో సీట్ల సర్దుబాటులో తమకు ఇబ్బంది జరుగుతుందనే పార్టీ మారుతున్నారనేది టీడీపీ నుంచి వస్తున్న వాదన. అయితే, పార్టీ మారిన వారికి టీడీపీలో ఉన్నా సీట్లు దక్కేవే. కడప జిల్లాలో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఓకే ఒక్క ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వైసీపీలో చేరారు. ఆయనకు టీడీపీలో ఉంటే కచ్చితంగా మళ్లీ రాజంపేట టిక్కెట్ దక్కేదే. ఇక, చీరాల నుంచి గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ స్థానికంగా బలమైన నేత. అందుకే ఆయన పార్టీ వీడకుండా టీడీపీ చాలా ప్రయత్నం చేసింది. ఆయనకు కూడా టీడీపీలో ఉంటే టిక్కెట్ దక్కేది. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు భీమిలి ఎమ్మెల్యే టిక్కెట్ అడిగారు. ఆయన కోసం గంటా శ్రీనివాస్ రావు భీమిలి వదులుకుంటానని అన్నారని టీడీపీ నేతలే అంటున్నారు. అయితే, ఆయన అక్కడ వదులుకొని వైసీపీలో చేరారు. ఇలా టిక్కెట్లపై ఎటువంటి సమస్య లేకుండా టీడీపీని వీడి వైసీపీలో చేరారు.
అధికార పార్టీకి ఇబ్బందే..!
అయితే, ఎన్ని చేసినా మళ్లీ అధికారంలోకి వస్తామనే నమ్మకం టీడీపీ నేతల్లో కలగకపోవడం, ఇటీవల వివిధ అంశాలపై చంద్రబాబు యూటర్న్ లు తీసుకోవడం, కాంగ్రెస్ తో జట్టు కట్టడం, ఎన్నికల వేళ ఓట్ల కోసం పథకాలు పెట్టడం, ఒక సామాజకవర్గ పెత్తనం పెరగడం కూడా వీరు పార్టీ మారేందుకు కారణాలుగా కనినిస్తున్నాయి. ఇక, టిక్కెట్ల కేటాయింపులో ఆలస్యం కూడా మరికొందరిలో అసంతృప్తికి కారణమంటున్నారు. వాస్తవానికి సంక్రాంతి తర్వాత 100 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్టు విడుదల చేస్తామని టీడీపీ నేతలు చెప్పారు. కానీ, అలా జరగలేదు. దీంతో చాలామంది టిక్కెట్లు దక్కుతాయా లేదని అనే అభద్రతాభావంతోనూ ఉన్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల వేళ టిక్కెట్ల కోసం పార్టీలు మారడం సహజమే. అయితే, కారణాలు ఏమైనా ఎన్నికలకు మూడు నెలల ముందు ఇంతపెద్ద ఎత్తున అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలో చేరుతుండటం మాత్రం టీడీపీకి ఇబ్బందికరమైన పరిస్థితే. ఇక, వైసీపీకి మాత్రం చేరికలు బూస్ట్ ఇచ్చేవే. పార్టీలోకి చేరికలు పెరగడం ద్వారా వైసీపీ అధికారంలోకి వస్తుందనే ఒక విశ్వాసం పార్టీ క్యాడర్ లో వ్యక్తం అవుతోంది. ఇప్పటికైనా టీడీపీ అప్రమత్తమై పార్టీ నేతలు జారిపోకుండా కాపాడుకోవాలి. లేకపోతే ఆ పార్టీకి మరింత నష్టం చేసే అవకాశం ఉంది.