సబ్బం హరి…సిసలైన లోకల్
సబ్బం హరి విలక్షణమైన నాయకుడు. ఆయనలో ఉన్న ఆ ప్రత్యేకతే ఇంత స్థాయికి తీసుకువచ్చింది. సబ్బం హరి అతి సామాన్యమైన కుటుంబం నుంచి ఈ రోజు రాజకీయాల్లో [more]
సబ్బం హరి విలక్షణమైన నాయకుడు. ఆయనలో ఉన్న ఆ ప్రత్యేకతే ఇంత స్థాయికి తీసుకువచ్చింది. సబ్బం హరి అతి సామాన్యమైన కుటుంబం నుంచి ఈ రోజు రాజకీయాల్లో [more]
సబ్బం హరి విలక్షణమైన నాయకుడు. ఆయనలో ఉన్న ఆ ప్రత్యేకతే ఇంత స్థాయికి తీసుకువచ్చింది. సబ్బం హరి అతి సామాన్యమైన కుటుంబం నుంచి ఈ రోజు రాజకీయాల్లో కీలకమైన స్థాయికి వచ్చారంటే అది స్వయం కృషి తప్ప మరేమీ కాదు. సమయస్పూర్తి, చాకచక్యం, మాటలతో ఆకట్టుకునే తీరు ఇవన్నీ కూడా హరిని ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా నిలబెట్టాయని చెప్పాలి. ఆయనకు గాంధీ కుటుంబం అంటే వల్లమాలిన అభిమానం. అందుకే కాంగ్రెస్ జెండా పట్టుకుని తిరిగేవారు. అలా మూడున్నర దశాబ్దాల క్రితం యూత్ కాంగ్రెస్ లీడర్ గా పాలిటిక్స్ లోకి అడుగుపెట్టారు. విశాఖ కాంగ్రెస్ లో దిగ్గజ నేతలు ఉన్న చోట సబ్బం హరి యువ నేతగా రాణించారు.
అలా గుర్తింపు….
తమ నాయకుడు రాజీవ్ గాంధీని ఏదో మాట అన్నారని నాటి తెలుగుదేశం మంత్రి అశోక్ గజపతిరాజుని విశాఖ ఎయిర్ పోర్టు నుంచి బయటకు రాకుండా యూత్ కాంగ్రెస్ నేతగా సబ్బం హరి అడ్డుకున్నారు. దాంతో ఒక్కసారిగా ఆయన మీడియాలో హైలెట్ అయ్యారు. హరిలో మొండితనం దూకుడూ రెండూ ఉన్నాయి. దేనికీ లొంగని నైజం ఆయనది. పెద్ద నాయకులను అయినా ఆయన పట్టించుకునేవారు కారు. అప్పట్లో విశాఖ జిల్లా రాజకీయాలను ద్రోణంరాజు సత్యనారాయణ శాసించేవారు. ఆయనకు ఎదురు నిలిచి సబ్బం హరి కాంగ్రెస్ లో మరో వర్గంగా వెలిగారు. యువతను తన వైపు తిప్పుకున్నారు. ఇక కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండడంతో ఆయన పోరాటం కూడా పార్టీకి కలసి వచ్చింది.
అన్నీ అనూహ్యంగానే ..?
కాంగ్రెస్ లో చేరిన పదేళ్లకే విశాఖ వంటి ఘనమైన చరిత్ర కలిగిన నగరానికి మేయర్ కావడం అంటే ఆషామాషీ కాదు, అందునా మహా సాగరమైన కాంగ్రెస్ లో ఎవరి అండా దండా లేకుండా ఎదగడం అంటే అది చిన్న విషయం కాదు. కానీ సబ్బం హరి దానిని సాధించారు. 1994 డిసెంబర్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఏపీలో ఓడింది. ఎన్టీయార్ ప్రభజనం బలంగా వీచింది. ఆ తరువాత మూడు నెలలకే వచ్చిన లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏ ఖద్దరు నేతా సాహసించలేదు. దాంతో విశాఖ మేయర్ గా పోటీకి నేను రెడీ అంటూ సబ్బం హరి బరిలోకి దూకారు. ప్రత్యక్ష పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో ఆయన కచ్చితంగా ఓడిపోతారు అని అంతా అనుకున్నారు. కానీ హరి మాత్రం టీడీపీ ప్రభజనాన్ని సైతం అడ్డుకుని అనూహ్యంగా గెలిచారు. అలాగే 2009 లో జరిగిన ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిగా కాంగ్రెస్ తరఫున సబ్బం హరి పోటీ చేశారు. అవతల వైపు టీడీపీ నుంచి పత్రికాధిపతి నూకారపు సూర్యప్రకాశరావు ఉంటే ఇవతల ప్రజారాజ్యం నుంచి చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ బరిలో ఉన్నారు. వీరి మధ్యన సబ్బం హరి గెలవడం అంటే అంతకంటే అనూహ్యమైన పరిణామం మరోటి లేదు. మొత్తానికి హరి లోకల్ కార్డు తోనే తన సత్తా చాటారు.
చివరి గొంతుక …..
విశాఖ పేరు చెబితే ఒకనాడు ఎంతో మంది స్థానిక నేతలు గుర్తుకు వచ్చేవారు. వారంతా అక్కడే పుట్టి పెరిగి నాయకులుగా సేవ చేసిన వారు. అలాంటి వారు అంతా కనుమరుగు అయిపోయారు. ఇక విశాఖకు సంబందించి సిసలైన లోకల్ వాయిస్ గా సబ్బం హరి మాత్రమే ఇప్పటిదాకా ఉన్నారు. ఆయనకు విశాఖ గురించి అణువణువూ తెలుసు. అలాంటి నేత ఇపుడు కరోనాతో లోకం వీడారు. దాంతో విశాఖకు చెందిన లోకల్ నేతల శకం ఆయనతో ముగిసింది అనే చెప్పాలి. ఇపుడంతా నాన్ లోకల్ మయంగా వైజాగ్ పాలిటిక్స్ సాగుతోంది. లోకల్ లీడర్లు రావాలని సబ్బం హరి ఎలుగెత్తి చాటేవారు. మరి విశాఖ నుంచి కొత్త తరం వస్తుందా. చూడాలి.