బిగ్ వికెట్ పై బీజేపీ ఆశ…?
ఉత్తరప్రదేశ్ తర్వాత దేశంలో పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ అధికారాన్ని రెండోసారి కైవసం చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేసి విఫలమైంది బీజేపీ. మిత్రపక్షమైన శివసేన, దీర్ఘకాలం చక్రం తిప్పిన [more]
ఉత్తరప్రదేశ్ తర్వాత దేశంలో పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ అధికారాన్ని రెండోసారి కైవసం చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేసి విఫలమైంది బీజేపీ. మిత్రపక్షమైన శివసేన, దీర్ఘకాలం చక్రం తిప్పిన [more]
ఉత్తరప్రదేశ్ తర్వాత దేశంలో పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ అధికారాన్ని రెండోసారి కైవసం చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేసి విఫలమైంది బీజేపీ. మిత్రపక్షమైన శివసేన, దీర్ఘకాలం చక్రం తిప్పిన కాంగ్రెసు, ఎన్సీపీలను తోసి రాజంటూ అతి పెద్దపక్షంగా అవతరించింది. శివసేన దూరం జరిగాక ఎన్సీపీ, కాంగ్రెసులను చీల్చి అయినా అయినా అధికారంలోకి రావాలని శతవిధాలా ప్రయత్నించింది. పని కాలేదు. పునరధికారం అందని ద్రాక్షగా మిగిలింది. లోక్స భ సభ్యుల సంఖ్యలో ఉత్తరప్రదేశ్ పెద్దదే. కానీ దేశానికి ఆర్థికంగా గుండె కాయ మహారాష్ట్ర. దీనిని తిరిగి ఎలాగైనా దక్కించుకోవాలని చేయని ప్రయత్నమంటూ లేదు. తాజాగా మరాఠా యోధుడు శరద్ పవార్ ను దువ్వే పనిలో పడ్డారు కమలనాథులు. శివసేన, ఎన్సీపీల మధ్య విభేదాలు పొడచూపుతున్న నేపథ్యంలో తమతో చేయి కలిపి రాష్ట్రంతో పాటు జాతీయంగానూ అధికారంలో భాగస్వామి కావాలని ఆహ్వానిస్తున్నారు. అయితే పవార్ లెక్కలే వేరు.
మాయల మరాఠీ…
శరద్ పవార్ చిక్కడు. దొరకడు. అన్న టైపులో ఉంటారు. రాజకీయ వ్యూహాలు పన్నడంలో దిట్ట. దేశంలో అగ్రశ్రేణి రాజకీయవేత్తలు అయిదారుగురిలో ఒక్కరిగా ఉంటారు. అంతటి ముదురు బీజేపీ పిలిస్తే వెంటనే చేయి కలిపేస్తారా? అనే ప్రశ్న తలెత్తుతుంది. తనకు, తన వారసులకు కచ్చితమైన రాజకీయ భవిష్యత్తు బంగారుమయంగా ఉంటే మాత్రమే బీజేపీని కౌగిలించుకుంటారు. సోనియా గాంధీ ఏఐసీసీ అధినేతగా మారినప్పుడు కాంగ్రెసు పార్టీలో తనకు భవిష్యత్ లేదని బయటికి వచ్చేశారు పవార్. తన ప్రధాన మంత్రి కల నెరవేరదని తెలిసి కాంగ్రెసును ఛీ కొట్టారు. ఎన్సీపీ పేరిట వేరు కుంపటి పెట్టుకున్నారు. పీవీ నరసింహారావు ప్రధానమంత్రి అయిన సమయంలోనే ఆ సీటుకు పోటీ పడ్డారు. అప్పట్నుంచీ ప్రధాని పదవిపై ఆశలు పెంచుకుంటూనే వచ్చారు. పీవీకే పోటీ తానే నని భావించారు. వేరు కుంపటి పెట్టుకున్నప్పటికీ ప్రధాని పదవిపై మోజు, ఆశ మాత్రం తీరిపోలేదు. సంకీర్ణాల యుగంలో తనకో చాన్సు వస్తుందనుకుంటూ కాలం గడుపుతున్నారు. బీజేపీ హవా మొదలయ్యాక అవకాశాలు మరింతగా క్షీణించిపోయాయి. అయినా బీజేపీకి చెక్ పెడుతూ ప్రత్యామ్నాయ రాజకీయాలకు దేశంలో తానే పెద్ద దిక్కు అని నిరూపించుకోవాలని చూస్తున్నారు. కమలం చేతి నుంచి అధికార మార్పిడి సాగితే సంకీర్ణ పార్టీల అభ్యర్థిగా ప్రధాని కావచ్చనేది పవార్ యోచన. అందుకే మహారాష్ట్రలో ఎన్నెన్నో వ్యూహాలు పన్ని , శివసేనతో చేతులు కలిపి మరీ కాంగ్రెసుతో సంకీర్ణం ఏర్పాటు చేశారు. ఇదంతా ముందు చూపే.
కలవడు.. కలవర పెడతాడు…
మహారాష్ట్రలో బీజేపీకి ఎన్సీపీ మద్దతిచ్చి ఉంటే అనేక విధాలుగా పవార్ కు ప్రయోజనాలుండేవి. తనకు, కుమార్తెకు, మరొక పార్టీ నేతకు కేంద్రమంత్రి పదవులు లభించి ఉండేవి. రాష్ట్రంలో అజిత్ పవార్ కు ఎలాగూ పదవి ఖాయమే. అయినప్పటికీ బీజేపీని వ్యతిరేకించారు. బీజేపీతో కలిస్తే తక్షణ ప్రయోజనాలు ఉన్నప్పటికీ భవిష్యత్ అందకారబంధురమవుతుందని భయపడ్డారు. మొదట్లో శివసేన బీజేపీ కంటే పెద్ద పార్టీ. దాని స్థానాన్ని ఆక్రమిస్తూ బీజేపీ క్రమేపీ బలపడింది. శివసేన జూనియర్ పార్టనర్ అయిపోయింది. ఎన్సీపీకి కూడా ఆ దుస్థితి తప్పదని పవార్ కు తెలుసు. అయినప్పటికీ మహారాష్ట్ర ఎన్నికల తర్వాత అధికార క్రీడలో పవార్ పాచికలు వేశారు. ఆయన సూచనల మేరకే అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలిపినట్లు నాటకం ఆడారు. డ్రామా రక్తి కట్టిన దశలో మళ్లీ వ్యూహం మార్చేశారు. కాంగ్రెసు, శివసేన, ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు . ఇదంతా శరద్ పవార్ కనుసన్నల్లోనే సాగింది. బీజేపీకే ఝలక్ ఇవ్వడానికి, తన రాజకీయ చతురతను నిరూపించుకోవడానికే పవార్ ఇటువంటి ఎత్తగడలు వేశారు. అమిత్ షా ను తాజాగా రహస్యంగా కలవడంతో కమలంతో చెలిమి చేస్తారేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వమైన శివసేనకు ఇదొక హెచ్చరిక. ఎన్సీపీకి చెందిన మహారాష్ట్ర హోం మంత్రి విషయంలో శివసేన ఆరోపణలు గుప్పిస్తోంది. శరద్ పవార్ పైన కూడా పరోక్షంగా విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాన్ని కంట్రోల్ లో పెట్టడానికి పవార్ అమిత్ షా తో భేటీ ఎత్తుగడను ఎంచుకున్నారంటున్నారు పరిశీలకులు.
అదొక్కటే చాన్సు….
శరద్ పవార్ కు బీజేపీ ఎప్పుడో రెడ్ కార్పెట్ పరిచి ఉంచింది. ఆయనతో చేతులు కలిపితే మహారాష్ట్రలో బీజేపీ శాశ్వత అధికారం ఖాయమని కమల నాథులు విశ్వసిస్తున్నారు. పవార్ రాజకీయ జీవితం చరమ దశకు చేరుకుంది. దేశానికి ప్రదాని కావాలన్న కల నెరవేరే సూచనలు కానరావడం లేదు. దేశ అత్యున్నత పీఠమైన రాష్ట్రపతి పదవి అయినా దక్కితే చాలనుకుంటున్నారు. అందుకోసం కాంప్రమైజింగ్ ఫార్ములాను ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. 2022లో రాష్ట్రపతి పదవికి పవార్ ను ప్రతిపాదించేందుకు బీజేపీ అంగీకరిస్తే చేతులు కలిపేందుకు ఆయన సిద్ధమే. అదొక్కటే పవార్ ను కమలం గూటికి తెచ్చేందుకు మిగిలిన మార్గం. కానీ పవార్ ను విశ్వసించడమంటే కొరివితో తలగోక్కోవడమే. 2024 ఎన్నికలలో బలాబలాలు ఎలా ఉంటాయో తెలియదు. కేంద్ర ప్రభుత్వ ఎంపికలో రాష్ట్రపతి చాలా కీలకంగా మారుతారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైనా రాజ్యాంగ పదవుల ఎంపిక, వివిధ బిల్లులు, ఆర్డినెన్సుల విషయంలోనూ రాష్ట్రపతి చురుకైన పాత్రనే పోషిస్తారు. అటువంటి క్లిష్ట సమయంలో తమ పార్టీకి చెందిన వ్యక్తి రాష్ట్రపతిగా ఉంటే మేలని బీజేపీ భావిస్తుంది. అందులోనూ పవార్ వంటి రాజకీయవేత్తను కూర్చోబెట్టి సమస్యలు కొని తెచ్చుకోదు. అందువల్ల బీజేపీ, పవార్ ల కలయిక అనేది సుదూర స్వప్నమే. అయితే పశ్చిమబంగలో మమత ఓటమి పాలైతే ప్రతిపక్ష రాజకీయాలు బలహీనమవుతాయి. నెగోషియేషన్ బలం కోల్పోతారు. నిరాశలో ఉన్న ప్రతిపక్షాలను మరింతగా దెబ్బతీసేందుకు బీజేపీ పవార్ తో సంప్రతింపులు మొదలు పెట్టవచ్చు. కేంద్రంలో పదవు ల ఆఫర్ తో ఊరించే ప్రయత్నం చేయవచ్చు. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం సాధ్యం కాదని పవార్ భావిస్తే తానే కమల నాథులతో బేరసారాలు మొదలు పెట్టనూ వచ్చు. ఏది చేసినా తనకు అనుకూలమైన ఫలితం రాబట్టుకుంటాడు. కిందపడ్డా తన చేయి పైనే ఉందని నిరూపించుకోగల ఘటనాఘటన సమర్థుడు పవార్.
– ఎడిటోరియల్ డెస్క్