వ్రతం చెడ్డా ఫలం దక్కేనా…?
మహారాష్ట్రలో ఏదోవిధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని శివసేన, నేషనలిస్టు కాంగ్రెసు పార్టీ, కాంగ్రెసు పార్టీలు ఒక అవగాహనకు వచ్చినట్లే కనిపిస్తోంది. సిద్ధాంత రాద్ధాంతాలు పెట్టుకోకుండా సర్కారు ఏర్పాటే [more]
మహారాష్ట్రలో ఏదోవిధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని శివసేన, నేషనలిస్టు కాంగ్రెసు పార్టీ, కాంగ్రెసు పార్టీలు ఒక అవగాహనకు వచ్చినట్లే కనిపిస్తోంది. సిద్ధాంత రాద్ధాంతాలు పెట్టుకోకుండా సర్కారు ఏర్పాటే [more]
మహారాష్ట్రలో ఏదోవిధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని శివసేన, నేషనలిస్టు కాంగ్రెసు పార్టీ, కాంగ్రెసు పార్టీలు ఒక అవగాహనకు వచ్చినట్లే కనిపిస్తోంది. సిద్ధాంత రాద్ధాంతాలు పెట్టుకోకుండా సర్కారు ఏర్పాటే లక్ష్యంగా ప్రస్థానించాలనేది ఈ మూడు పార్టీలు ఉమ్మడి నిర్ణయంగా చెప్పుకోవాలి. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచాలనే విషయంలో మాత్రం ఈ మూడు పార్టీల మధ్య స్పష్టమైన ఏకాభిప్రాయం ఉంది. అదొక్కటే ఐక్యతాసూత్రం. పరిపాలనకు దిశానిర్దేశం చేయాల్సిన ఉమ్మడి అజెండా విషయంలో ఇంకా అవగాహనకు రాలేకపోతున్నారు. మంత్రి పదవుల పంపిణీ, పోర్టు ఫోలియోల కేటాయింపు వంటివన్నీ కీలకమే. వాటిపై అంతా ఒకే మాట ఒకే బాటగా అంగీకరించడం చిన్నవిషయం కాదు. బీజేపీతో కలిసి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడే శివసేన చీటికిమాటికి పేచీలు పెడుతుండేది. అసంత్రుప్తితో రగిలిపోతుండేది. తగిన ప్రాధాన్యమున్న మంత్రిత్వశాఖలు కేటాయించలేదనేది ఆ పార్టీ ప్రధాన అభియోగంగా ఉండేది. ఇప్పుడు మూడు స్తంభాలాట. నిన్నామొన్నటివరకూ రోడ్డున పడి విమర్శలు చేసుకున్న పార్టీలు కలిసి నడవడం వింతగానే అనిపించినా రాజకీయాల్లో అది పెద్ద విశేషమేమీ కాదు. సర్కారు ఏర్పాటైతే బొటాబొటి మెజార్టీయే. మరి ఈ సంకీర్ణ ప్రయోగం బీజేపీ వ్యూహాల నుంచి ఎంతమేరకు తట్టుకొని మనుగడ సాగించగలుగుతుందన్నది ఉత్కంఠభరితమైన విషయం.
కర్ణాటక ప్రయోగమేనా..?
ఊపిరి పోసుకోకముందు నుంచే సందేహాలు వ్యక్తమవుతున్న మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ప్రయత్నం దేశ రాజకీయాల్లోనే దీర్ఘకాల కసరత్తుగా సాగుతోంది. ముందుగా పదవులు, కనీస ఉమ్మడి కార్యక్రమంపై కాంగ్రెసు, ఎన్సీపీలు ఒక అంచనాకు రావడం మొదటి ఎత్తు. శివసేనతో స్పష్టమైన అజెండాకు ప్రాతిపదికను సిద్ధం చేసుకోవడం రెండో ఎత్తు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లో ఉండటంతో కేంద్రం సైతం సానుకూలంగా స్పందించాల్సి ఉంటుంది. గవర్నర్ కు మూడు పార్టీల ఎమ్మెల్యేల సంతకాలతో లేఖలు ఇవ్వాల్సిఉంటుంది. రాజ్యాంగ బద్ధంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉందని గవర్నర్ సైతం సొంత అంచనాకు రావాలి. ఎందుకంటే శివసేన బీజేపీ పొత్తుతో తన ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. గవర్నర్ తొలుత ఇచ్చిన కాలవ్యవధిలో శివసేన, ఎన్సీపీలు కాంగ్రెసుతో కలిసి ముందుకు వచ్చి ఉంటే పరిస్థితులు వేరే విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు కేంద్రప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించే గవర్నర్ విచక్షణకు సైతం కొంత ఆస్కారం ఏర్పడింది. ఒకవేళ గవర్నర్ ఆయా పక్షాల సంఖ్యాబలాన్ని దృష్టిలో పెట్టుకొని పచ్చ జెండా ఊపినా ప్రభుత్వానికి సవాళ్లు ఎదురయ్యే సూచనలున్నాయనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. కర్ణాటక తరహాలో ఆయా పార్టీల్లోని వైరుద్ద్యాలతో మెజార్టీ కోల్పోవచ్చని ముందస్తుగానే అంచనా వేసేస్తున్నారు.
పవార్ పాలిటిక్స్…
అయిదేళ్ల పాటు సుస్థిర ప్రభుత్వమంటూ ఎన్సీపీ నినాదమిస్తోంది. 25 ఏళ్లపాటు శివసేన అధికారంలో ఉంటుంది. తమ ముఖ్యమంత్రి కొనసాగుతారంటూ శివసేన డాంబికాలు పలుకుతోంది. కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించుకునేందుకే రోజుల తరబడి చర్చలు సాగుతున్నప్పటికీ కొలిక్కి రావడం లేదు. ఇంక స్థిరత్వం సంగతి రాజకీయాలకే తెలియాలి. మహాపాలిటిక్స్ లో అంతా తలపండిన రాజకీయవేత్తలే. శివసేన మంకుతనం, మొండిపట్టు అందరికీ తెలిసిందే. శరద్ పవార్ చక్రం తిప్పడం మొదలు పెడితే మరాఠా పాలిటిక్స్ లో మరెన్ని మలుపులు చూడాల్సి వస్తుందో. ఇందిరాగాంధీ వంటి నాయకురాలికే చుక్కలు చూపించిన నాయకుడాయన. ఏమాత్రం అవకాశమొచ్చినా తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటారు. రాజకీయావసరాలను అనుసరించి తన విధేయతలను మార్చుకునేందుకు పవార్ ఏమీ వెనకాడరు. ఒకవైపు సంకీర్ణంపై చర్చలు సాగుతుండగానే ప్రధాని మోడీతో పవార్ భేటీ కావడమూ రాజకీయంలో భాగమే. ఎంతకీ తేల్చకుండా సాగదీస్తున్నకాంగ్రెసును కలవరపరచడం ఆయన వ్యూహం. అదే సమయంలో శివసేన ను లొంగదీయడమూ ఎత్తుగడే. నిజానికి ప్రభుత్వానికి శివసేన నాయకత్వం వహించినప్పటికీ పవార్ పాలిటిక్సే కొనసాగేలా చూసుకోవాలనేది ఎన్సీపీ ఎత్తుగడ. ప్రధానితో పవార్ సమావేశం కాగానే కాంగ్రెసు, శివసేనలు రాజకీయ అనివార్యతను గుర్తించాయి. ఎన్సీపీ అధినేత చెప్పిన మాటకు మిగిలిన రెండు పార్టీలు అంగీకరించిన తర్వాతనే చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. సూత్రప్రాయంగా కలిసి నడవాల్సిందేనని నిర్ణయించుకున్నాయి. దీంతో మహారాష్ట్రలో పవార్ పాచికలు పారినట్లే .
తిరుగుబాట్లు…?
కేంద్రంలో అధికారంలో ఉండటంతోపాటు రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ మహారాష్ట్రలో ప్రత్యామ్నాయ సంకీర్ణ సర్కారు ఏర్పాటు పట్ల ప్రేక్షకపాత్ర వహిస్తుందని చెప్పలేం. చూస్తూ చేతులు ముడుచుకుని కూర్చునే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటికీ బీజేపీ నాయకులు తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. 105 మంది శాసనసభ్యుల సొంతబలంతోపాటు మరో 15 మంది ఇండిపెండెంట్లు మద్దతిస్తున్నారని బీజేపీ క్లెయిం చేస్తోంది. మొత్తంగా చూస్తే బీజేపీ, మద్దతు దారుల బలం 120 వరకూ కనిపిస్తోంది. శివసేనలో కొందరు కాంగ్రెసు, ఎన్సీపీలతో చేయి కలపడాన్ని తీవ్రంగా విభేదిస్తున్నట్లు సమాచారం. వారి సంఖ్య 17 వరకూ ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. ఒకవేళ శివసేనలో తిరుగుబాటు తలెత్తితే బీజేపీకే లాభించే అవకాశాలున్నాయి. 56 మంది సభ్యుల బలంతో ఉన్న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలను కోల్పోతే దానిబలం 39కి పడిపోతుంది. అప్పుడు సంకీర్ణంలో ఆ పార్టీయే మైనారిటీ పక్షమవుతుంది. నాయకత్వ స్థానాన్ని కోల్పోతుంది. బీజేపీతో వైరానికి దిగిన లక్ష్యమే నీరుగారిపోతుంది. రెంటికీ చెడ్డ రేవడిలా మిగిలిపోతుంది. గవర్నర్ కు మద్దతు లేఖ ఇచ్చే సమయంలో అసమ్మతివాదులు సంతకం పెడతారా? లేదా? అన్నదీ సందేహమే. అదే జరిగితే గవర్నర్ సైతం మెలిక పెట్టవచ్చు. సంకీర్ణానికి అధిష్టానాలు అనుకూలంగా కదులుతుంటే అంతర్గతంగా చిచ్చు రగిలే సూచనలూ కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ రాష్ట్రపతి పాలన ఆయా రాజకీయశక్తులకు వ్యూహనిర్మాణాలకు అవకాశం కల్పించింది. మరో రెండు మూడు రోజుల్లోనే ఫలితం అటో ఇటో తేలిపోవచ్చు. ఒకవేళ సంకీర్ణం కావాలనుకుంటున్న పక్షాలు విఫలమైతే బీజేపీ చేతిలోకి పగ్గాలు వచ్చేసినట్లే.
-ఎడిటోరియల్ డెస్క్