గంగూలీ ఎంట్రీతో మూడినట్లేనా?
సౌరవ్ గంగూలీ … రెండు దశాబ్దాల క్రితం భారత క్రికెట్ ను కష్టకాలంలో గట్టున పడేసిన డేరింగ్ డాషింగ్ హీరో. ఇప్పుడు భారత క్రికెట్ బోర్డు పగ్గాలు [more]
సౌరవ్ గంగూలీ … రెండు దశాబ్దాల క్రితం భారత క్రికెట్ ను కష్టకాలంలో గట్టున పడేసిన డేరింగ్ డాషింగ్ హీరో. ఇప్పుడు భారత క్రికెట్ బోర్డు పగ్గాలు [more]
సౌరవ్ గంగూలీ … రెండు దశాబ్దాల క్రితం భారత క్రికెట్ ను కష్టకాలంలో గట్టున పడేసిన డేరింగ్ డాషింగ్ హీరో. ఇప్పుడు భారత క్రికెట్ బోర్డు పగ్గాలు చేపట్టనుండటం విశేషం. అయితే గంగూలీ ఎంట్రీ ఇప్పుడు అందరికన్నా టీం ఇండియా కోచ్ రవిశాస్త్రిని కలవరపరుస్తోంది. ఎందుకంటే వీరిద్దరికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. గతంలోనే కోచ్ గా శాస్త్రి పగ్గాలు చేపట్టాల్సిన దశలో గంగూలీ చక్రం తిప్పి కుంబ్లే కు ఆ ఛాన్స్ దక్కేలా చేయడంతో రవి ఇంటాబయటా గగ్గోలు పెట్టడం తెలిసిందే. తన హయాం అంతా వివాదాల సుడిలో నడిచిన ఈ మాజీ కెప్టెన్ ఇంగ్లాండ్ లో చొక్కా విప్పి ప్రత్యర్థి కి షాక్ ఇచ్చాడు. కోచ్ చాపెల్ తో వివాదం. నటి నగ్మా తో ప్రేమాయణం. ఇలా ఒకటేమిటి గంగూలీ అటు బ్యాట్ తో మైదానంలో తన చర్యలతో మైదానం బయట ఒక హాట్ టాపిక్ గా ఉండేవాడు. అలాంటి దూకుడు వ్యక్తిత్వం వున్న గంగూలీ ఇప్పుడు భారత క్రికెట్ బోర్డు స్టీరింగ్ తిప్పనుండటం ఆసక్తికరంగా మారింది.
కోహ్లీ – శాస్త్రి జిగిడి …
మొన్నటి వన్డే వరల్డ్ కప్ లో సెమిస్ లో ఓటమిపై ఇప్పటివరకు సమీక్ష జరగలేదు. ఆ మ్యాచ్ ఓటమికి కెప్టెన్ కోహ్లీ – కోచ్ రవిశాస్త్రి తప్పుడు నిర్ణయాలే అన్న విమర్శలు పెద్ద ఎత్తున ఒక వర్గం నుంచి వచ్చినా బోర్డు సమీక్ష కు ధైర్యం చేయలేదు. ఇప్పుడు గంగూలీ సారధ్యంలో దానిపైనా సమీక్ష జరిగే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే టీం ఇండియా కెప్టెన్ కోహ్లీ – శాస్త్రి జోడి ఇకముందు గడ్డుకాలమే ఎదుర్కోక తప్పదని క్రీడానిపుణులు చెబుతున్నారు. శాస్త్రిని ఏరికోరి కోహ్లీ కోచ్ ఎంపికలో పట్టుబట్టి నియమించేలా బోర్డు ను ప్రభావితం చేశాడన్నది బహిరంగ సత్యం. కానీ ఇప్పుడు సీన్ మారింది. వీరి జోడికి రోజులు దగ్గరపడినట్లే అంటున్నారు. ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ బోర్డు ను రాజకీయాలే శాసిస్తున్నాయి. యుపిఎ హయాంలో కూడా తెరవెనుక నేతలు చక్రం తిప్పేవారు. ఈసారి కాషాయదళం అదే చేసింది.
శ్రీనివాసన్ వ్యూహాన్ని దెబ్బకొట్టిన షా …
వాస్తవానికి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వున్న సౌరవ్ గంగూలీ బోర్డు ఉపాధ్యక్షుడు మహా అయితే అవుతారని అంతా లెక్కేశారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం శ్రీనివాసన్ ముంబాయిలో బోర్డు మెంబర్స్ కి భారీ విందు ఏర్పాటు చేశాడు. అయితే ఈ విందులో పాల్గొన్న వారే ఆయన ప్రతిపాదనలను వ్యతిరేకించారు. బోర్డు కార్యకలాపాలు సుప్రీం కోర్టు వరకు వెళ్ళడానికి శ్రీనివాసన్ చర్యలే కారణమని ఆగ్రహించారు. ఈలోగా అనురాగ్ ఠాకూర్ అమిత్ షా డైరెక్షన్ లో చక్రం తిప్పారు. గంగూలీ పేరును తెరపైకి తేవడంతో అంతా షాక్ అయ్యారు. షా కుమారుడిని కార్యదర్శిగా ప్రతిపాదించారు. ఇప్పుడు రానున్న కొత్త కార్యవర్గానికి పోటీ దారులు లేకుండా ఏకగ్రీవం అయ్యేలా తెరవెనుక అంతా జరిగిపోయింది. స్వయంగా షా బృందం రంగంలోకి దిగడంతో శ్రీనివాసన్ వెనక్కి తగ్గక తప్పలేదు.
అమిత్ తో సౌరవ్ భేటీ …
బెంగాల్ రాజకీయాలు లక్ష్యంగా అమిత్ షా ఇటీవల పావులు కదుపుతున్నారు. అందుకే అయన సౌరవ్ గంగూలీని బిసిసిఐ కి అధ్యక్షుడు అయ్యేలా వ్యూహం రూపొందించారు. సౌరవ్ గంగూలీ ఇటీవల షా తో భేటీ వెనుక చాలా కధే నడిచిందన్నది ఇప్పుడు స్పష్టం అయ్యింది. ఈనెల 23 న బిసిసిఐ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న గంగూలీ ఆ పదవిలో పదినెలలు కొనసాగుతారు. ఆ తరువాత అయన బిజెపి తీర్ధం పుచ్చుకోవచ్చనే ప్రచారం నడుస్తుంది. మరోపక్క అమిత్ షా బిసిసిఐ లో తన కుమారుడికి ప్రాధాన్యత గల కార్యదర్శి పోస్ట్ దక్కేలా చేయడంపై చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కస్సు మన్నారు. తన తండ్రి హోం మంత్రిగా వున్న సమయంలో తనను బిసిసిఐ లో కూర్చోబెట్టి ఉంటే బిజెపి ఎలా స్పందించేడో అంటూ సెటైర్లు వేశారు.
దాదా వెరీ సీరియస్ …
ఇంకా బాధ్యతలు చేపట్టకుండానే కాబోయే అధ్యక్షుడు బోర్డు పై దూకుడు చూపించేందుకు సిద్ధమయినట్లు సంకేతాలు పంపాడు. ఐసీసీ నుంచి బోర్డు కి ఆరేళ్ళు నిధులు సగమే వచ్చే అంశంపై సీరియస్ అయ్యి పూర్తి సొమ్ము రాబట్టడానికి కృషి చేస్తా అని ప్రకటించాడు. ఐసిసి కి అందే సొమ్ములో భారత్ నుంచే 70 నుంచి 80 శాతం నిధులు ఉండటం విశేషం. అందుకే గంగూలీ న్యాయంగా బోర్డు కి దక్కాలిసిన సొమ్ముపై పోరాటానికి దిగుతా అనే సంకేతాలు ఇచ్చేశాడు. అదే విధంగా దేశంలోని ఫస్ట్ క్లాస్ క్రికెటర్లకు దక్కే పారితోషికాన్ని పెంచేందుకు సిద్ధం అవుతుండటం పట్ల క్రికెట్ వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతుంది. దేశ క్రికెట్ దిశా దశ మరింతగా మార్చాలనే సంకల్పంతో వున్నాడు గంగూలీ. ఇక చరిత్ర పరంగా చూస్తే విజయానంద గజపతిరాజు తరువాత టీం ఇండియా కెప్టెన్ బోర్డు పగ్గాలు అందుకోవడం ఆరున్నర దశాబ్దాల తరువాత ఇదే తొలిసారి. గతంలో సునీల్ గవాస్కర్, శివలాల్ యాదవ్ వంటివారు బోర్డు అధ్యక్షులు అయినా వారు తాత్కాలిక బాధ్యతలే చేపట్టారు. కానీ భారత కెప్టెన్ గా విశేషంగా రాణించి బోర్డు అధ్యక్షుడిగా ఎంపికై కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టేందుకు సౌరవ్ గంగూలీ సిద్ధం కావడంతో అన్ని వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. దీనివెనుక రాజకీయాలు వున్నా నిబద్ధతగల ఆటగాడిగా అందరు గంగూలీ ని స్వాగతిస్తున్నారు.