పీక్కు తినడమే పనిగా పెట్టుకున్నట్లుందే?
మంచికో, చెడుకో చరిత్ర నిర్ణయించాలి. మన దేశమైతే మరో ప్రస్థానం దిశగా నడక మొదలు పెట్టింది. ఇంతవరకూ కేంద్ర, రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తూ వస్తున్నాయి. [more]
మంచికో, చెడుకో చరిత్ర నిర్ణయించాలి. మన దేశమైతే మరో ప్రస్థానం దిశగా నడక మొదలు పెట్టింది. ఇంతవరకూ కేంద్ర, రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తూ వస్తున్నాయి. [more]
మంచికో, చెడుకో చరిత్ర నిర్ణయించాలి. మన దేశమైతే మరో ప్రస్థానం దిశగా నడక మొదలు పెట్టింది. ఇంతవరకూ కేంద్ర, రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తూ వస్తున్నాయి. ఇకపై అదేం సాగదు. అంతా కేంద్రం పెత్తనమే. రాష్ట్రాలు ఇష్టారాజ్యంగా అమలు చేస్తున్న అనేక స్కీములకు గండి పడే ప్రమాదం ఉంది. నేరుగా కాకపోయినా ఆర్థిక ఉచ్చులో బిగించడం ద్వారా భారత ప్రభుత్వం తన కనుసన్నల్లోకి రాష్ట్రాలను తెచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. భారతీయ జనతాపార్టీ అజెండాలో కీలక దశకే చేరుకుంది. కొన్ని చెప్పి చేస్తుంటే , మరికొన్ని చెప్పకుండానే ఆచరణలోకి తెస్తోంది. మొత్తమ్మీద దేశం మీద గుత్తాధిపత్యం సాధిస్తోంది. వివిద వర్గాలకు గడచిన డెబ్భై సంవత్సరాలుగా అలవాటైన ధోరణికి భిన్నమైన వైఖరిని రుచి చూపించబోతోంది. రాష్ట్ర ప్రభుత్వాలకూ చెక్ పెట్టనుంది. సంక్షేమ వితరణ చేస్తున్న ప్రభుత్వాలు భవిష్యత్తులో నిధులకు కటకట ఎదుర్కోక తప్పదు. మొత్తం ఆర్థిక నియంత్రణను కేంద్రం తన చెప్పుచేతల్లోకి తెచ్చుకోబోతోంది. ఇప్పటికే ఎఫ్ఆర్ బీఎం వంటి చట్టాలు ఉన్నప్పటికీ రాష్ట్రాలు వివిధ మార్గాల్లో నిధులను దొడ్డిదారిన సమీకరిస్తున్నాయి. వాటికి సైతం అడ్డుకట్ట వేసేలా ప్రణాళిక రచన సాగుతున్నట్లుగా బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. స్థూలంగా ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే వ్యవస్థ అన్నట్లుగా పరోక్షంగా విధాన పరమైన నియంత్రణకు అవసరమైన కసరత్తు సాగుతోంది.
.
పెట్రో డీజిల్ పెరపెర…
పెట్రోలియం ఉత్పత్తులపై గడచిన రెండు నెలలుగా భారం పెరిగిపోతూ వస్తోంది. ఇందులో 60శాతంపైగా పన్నులే. కేంద్ర,రాష్ట్రాలకు ఇంధన ధరలు కామధేనువుగా మారాయి. ఈ స్థితిలో ఇప్పుడిప్పుడే ప్రజావ్యతిరేకత మొదలైంది. అతి ప్రధానమైన ఆదాయవనరుగా ఉన్న ఇంధన ధరలపై డ్యూయల్ టాక్స్ విధానం అమలవుతోంది. దేశవ్యాప్తంగా జీఎస్ టీ అమల్లోకి వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవడానికి ఇష్టపడలేదు. తమకు నచ్చినంత పన్ను విధించుకుని అవసరాన్ని బట్టి డబ్బులు ప్రజలనుంచి గుంజుకోవచ్చుననే దుర్బుద్ధి ఇందుకు కారణం. దీనిని ఆసరాగా చేసుకుంటూ కేంద్రం సైతం సెస్సుల రూపంలో నిధులు కొల్లగొ్ట్టేస్తోంది. ఎక్సైజ్ ఇతర కేంద్ర పన్నుల్లో 41 శాతం వరకూ రాష్ట్రాలకు పంపిణీ చేస్తోంది. కానీ సెస్సుల్లో పైసా ఇవ్వడం లేదు. ఒకవైపు ప్రజావ్యతిరేకత, మరోవైపు సెస్సులతో కేంద్రం కొల్లగొట్టడం రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతోంది. మధ్యేమార్గంగా పెట్రోలియం ఉత్పత్తులను కూడా జీఎస్టీలోకి తెచ్చేందుకు రాష్ట్రాలు అంగీకరించక తప్పదని కేంద్రం బావిస్తోంది. తద్వారా కొంతమేరకు వినియోగదారులకు ఉపశమనం లభిస్తోందని అంచనా వేస్తోంది. ఈ విషయంలో రాష్ట్రాలు దిగిరావాలనే డిమాండ్ ను కేంద్రం ఇప్పటికే బయట పెట్టింది. రానున్న కాలంలో బీజేపీ శ్రేణులు జీఎస్టీ పరిధిలోకి పెట్రోలియం రావాలనే నినాదాన్ని ప్రజల డిమాండ్ గా మార్చే అవకాశం ఉంది.
తోలు తీయడమేనా…?
ప్రయివేటు కంపెనీలు టోల్ టాక్స్ రూపంలో వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయి. వాటికి లెక్కాపత్రం సక్రమంగా ఉండటం లేదు. నిర్ణీతకాలానికి టోల్ గడువు ముగిసినప్పటికీ నష్టపోతున్నామనే సాకుతో మౌలిక వసతుల కంపెనీలు తమ పన్ను వసూలు కాలవ్యవధిని పెంచుకుంటున్నాయి. పూర్తి ఫాస్ట్ టాగ్ అమలుతో దేశవ్యాప్తంగా టోల్ ఎంతవసూలవుతుందనేది కచ్చితమైన లెక్కల పరిధిలోకి వచ్చేసింది. బ్యాంకుల ద్వారా కేంద్రానికి తెలిసిపోతోంది. ఇక దొంగలెక్కలు చూపడం సాధ్యం కాదు. తాజాగా టోల్ వసూళ్లు పెరిగిన విషయం ఇదే నిజాన్ని ధ్రువపరుస్తోంది. అయితే దీనివల్ల వాహనదారులు లాభపడేదేమీ లేదు. నిర్ణీత కాలవ్యవధి ముగిసిన తర్వాత ప్రభుత్వమే టోల్ వసూలు చేస్తుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అంటే పన్ను పెంచుకునేందుకుఫాస్టు టాగ్ ఒక మార్గం అన్నమాట. ప్రయివేటు వ్యక్తుల అదనపు ఆర్జన కాకుండా ఇకపై ప్రభుత్వమే ఖజానా నింపుకుంటుంది.
నో సబ్సిడీ.. నో రిజర్వేషన్…
వంట గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ దాదాపు ఎత్తేసినట్లే. నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తొలిదశలోనే ఈ అలోచన మొగ్గ తొడిగింది. అప్పట్లో వెంటనే సాహసించలేదు. డబ్బున్న వాళ్లు స్వచ్ఛందంగా సబ్సిడీ వదులుకోవాలని విన్నవించారు. దానికి పెద్దగా రెస్సాన్స్ రాలేదు. గడచిన మూడు నెలల్లో గ్యాస్ సిలిండర్ ధర 225కి పైచిలుకు పెరగడంతో ఇక రాయితీకి మంగళం పాడేసినట్లయింది. పేద, పెద్ద అనే భేదం లేకుండా ఒకే ధర ఆచరణలోకి వచ్చేసింది. చెప్పాపెట్టకుండానే అమల్లోకి తెచ్చిన పెద్ద సంస్కరణ ఇది. మరోవైపు ప్రయివేటీకరణ దిశలో అడుగులు పడుతున్నాయి. అత్యవసర ప్రభుత్వ సేవలు మినహా మిగిలిన వ్యాపారాల్లో ప్రభుత్వం ఉండదని ప్రధాని మోడీ తేల్చి చెప్పేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలు అన్నీ ప్రయివేటుపరమైతే క్రమేపీ రిజర్వేషన్లు అంతరించిపోతాయి. తొలిదశలో ఎస్సీ,ఎస్టీలకు పదేళ్లకే రిజర్వేషన్లు అంటూ అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. తర్వాత రాజకీయ కారణాలతో వాటిని పొడిగించుకుంటూ వచ్చారు. రిజర్వేషన్ సదుపాయం పొందిన కుటుంబాలు, వర్గాలు మాత్రమే పదే పదే ఆ సదుపాయాన్ని వినియోగించకుంటున్నాయి. అదే సామాజిక వర్గంలోని మిగిలిన వారికి రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు. దీనిపై బీజేపీ అనవసర వివాదాన్ని తల కెత్తుకుని రాజకీయ నష్టం చవిచూడటానికి సిద్దంగా లేదు. ప్రత్యామ్నాయంగా క్రమేపీ ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగులను కుదించడం ద్వారా రిజర్వేషన్ సదుపాయాలను నామమాత్రం చేయబోతోంది. వీటన్నిటి ద్వారా దేశంలో పెనుమార్పునకు, బాధ్యతాయుతమైన పాలనకు తెర తీస్తామని బీజేపీ విశ్వసిస్తోంది. అయితే ఈ హిడెన్ అజెండాకు ఇతర రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.
-ఎడిటోరియల్ డెస్క్