ఇప్పుటికైనా సరిదిద్దుకుంటారా? ముందుకు వెళతారా?
ప్రజాస్వామ్యంలో ప్రజలు నిస్సహాయులవుతున్నారా? ప్రతిపక్షాలు వైఫల్యం చెందుతున్నాయా? ఏకచ్ఛత్రాధిపత్య పాలనలో ఎక్కడో లోపం గంట కొడుతోంది. అత్యుత్సాహంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు దాని మెడలు వంచే బాద్యత [more]
ప్రజాస్వామ్యంలో ప్రజలు నిస్సహాయులవుతున్నారా? ప్రతిపక్షాలు వైఫల్యం చెందుతున్నాయా? ఏకచ్ఛత్రాధిపత్య పాలనలో ఎక్కడో లోపం గంట కొడుతోంది. అత్యుత్సాహంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు దాని మెడలు వంచే బాద్యత [more]
ప్రజాస్వామ్యంలో ప్రజలు నిస్సహాయులవుతున్నారా? ప్రతిపక్షాలు వైఫల్యం చెందుతున్నాయా? ఏకచ్ఛత్రాధిపత్య పాలనలో ఎక్కడో లోపం గంట కొడుతోంది. అత్యుత్సాహంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు దాని మెడలు వంచే బాద్యత ప్రతిపక్షాలది. ఆందోళనలు, నిరసనలతో ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల ముందు నిలబెట్టాలి. సర్కారు దిగి రావాలి. ఇదంతా రాజకీయంలో భాగం. కానీ రాజకీయ నిర్ణయాలను సైతం న్యాయవ్యవస్థ సరిదిద్దాల్సిన దుస్థితి దేశంలో ఏర్పడుతోంది. ప్రభుత్వమూ, ప్రతిపక్షాలు న్యాయ ఛత్రం కింద రక్షణ పొందుతున్నాయి. ఇప్పటికే దేశంలో న్యాయ క్రియాశీలత్వం (జ్యుడిషియల్ యాక్టివిజం) పెరిగిపోయిందని గగ్గోలు వినిపిస్తోంది. మరోవైపు తమ తమ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు కోర్టుల ఛత్రం కింద సేఫ్ గేమ్ ఆడాలని చూస్తున్నాయి. తాజాగా వ్యవసాయ చట్టాలపై తాను జోక్యం చేసుకుంటానంటూ సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇందుకు సరికొత్త ఉదాహరణ. రామజన్మభూమి వంటి సీరియస్ ఇష్యూలో భారతప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం గట్టున పడేసింది. ముందుకు వెళ్లలేక, వెనక్కి తగ్గలేక సతమతమవుతున్న వ్యవసాయ చట్టాల విషయంలోనూ న్యాయసమీక్ష ఇప్పుడు కేంద్రానికి రక్షణ కాబోతోంది. పరువు దక్కించుకునేందుకు అదే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.
విపక్షాల వైఫల్యం…
పంటల విక్రయాలు, ఉత్పత్తులు, ధరవరల నిర్ణయాలను మార్కెట్ శక్తుల ఇష్టారాజ్యానికి వదిలేస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాలపై ఉత్తరభారతంలో తీవ్ర ఆందోళనలు చెలరేగుతున్నాయి. కేంద్రం గుక్కతిప్పుకోలేకపోతోంది. కానీ కాంగ్రెస్ వంటి ప్రధాన ప్రతిపక్షం , ఇతర ప్రాంతీయ పార్టీలు ఈవిషయంలో తమంతతాము చొరవ తీసుకుని ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లలేకపోతున్నాయి. దక్షిణ భారత దేశంలో ఆంధ్రా,తెలంగాణల్లోని ప్రాంతీయపార్టీలైతే చేతులెత్తేశాయి. దీనిపై ఒక స్పష్టమైన విధానాన్ని ఆంధ్రాముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంతవరకూ ప్రకటించలేకపోయారు. తెలంగాణ ముఖ్యమంత్రి వ్యతిరేకించి తన నిర్ణయాన్ని వెనక్కి తీసేసుకున్నారు. వ్యవసాయ చట్టాల అమలు తీవ్రత ఏమిటో, భవిష్యత్తులో దీని ప్రభావం రైతాంగంపైనా, సమాజంపైనా ఏవిధంగా పడనుందో తెలియచెప్పే బాధ్యతను విపక్షాలు తీసుకోలేకపోయాయి. దక్షిణభారత రైతులు ముందుకు కదలకపోవడానికి ప్రధాన కారణం వారికి అవగాహన కల్పించడంలో సంఘటితం చేయడంలో ప్రతిపక్షాల ఉదాసీనతే.
సమాంతర ఛత్రం..
గతంలో ఇందిరాగాంధీ హయాంలో అనధికారికంగా సూపర్ కేబినెట్, ప్యారలల్ కేబినెట్, కిచెన్ క్యాబినెట్ అంటూ రకరకాల పేర్లతో కోటరీ హవా నడిచేది. ఎంతోకొంత ప్రజాజీవితంలో ఉన్నవాళ్లు ప్రదాని నిర్ణయాలపై ప్రభావం చూపేవారు. పైకి ఇందిరాగాంధీ నిర్ణయంగా ఏకపక్షంగా కనిపించినప్పటికీ కోటరీలోని మూడు వ్యవస్థలు సమాచారాన్ని సేకరించి ప్రధానికి నివేదించడం, అందులో వ్యత్యాసాలు ఉంటే సరిచూసుకోవడం జరిగేది. తద్వారా చెక్ పాయింట్ గా పార్టీలోని ఆంతరంగికులను వినియోగించుకునేవారు ఇందిర. కానీ మోడీహయాంలో అటువంటి ఏర్పాట్లు కనిపించడంలేదు. వ్యవసాయ చట్టాలను భారతీయ కిసాన్ సంఘ్ వంటి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలే వ్యతిరేకించినా ముందుకే వెళుతున్నారు. దేశంలో కీలక నిర్ణయాలు, చట్టాల వంటి వాటిపై క్యాబినెట్ లో అధ్యయనం సాగుతున్న తీరు కనిపించడం లేదు. మొత్తం వ్యవహారాలకు , మంత్రిమండలి నిర్ణయాలకు ఏక కేంద్రంగా సమాంతర క్యాబినెట్ గా ప్రదానమంత్రి కార్యాలయం కొనసాగుతోంది. కేంద్రంలో చాలామంది సీనియర్ మంత్రులున్నారు. దేశ రాజ్య వ్యవస్థపైనా, వ్యవసాయరంగంపైనా కాకలు తీరిన వారికీ కొదవ లేదు. పరోక్ష సంభాషణల్లో వ్యవసాయ చట్టాలపై బీజేపీ నాయకులు కూడా పెదవి విరుస్తున్నారు. అయినప్పటికీ వ్యవసాయచట్టాలు అమల్లోకి వచ్చేశాయి. తామేం చేసినా చెల్లుబాటవుతుందనే ప్రధాని ఏకపక్ష ధోరణి ఇక్కడ తేటతెల్లమవుతోంది.
మాటకు మన్నన లేదు…
వ్యవసాయ రంగానికి గిట్టుబాటు ధర కావాలంటే ఉత్పత్తి ధరపై కనీసం 50 శాతం అదనంగా రేటు ఉండాలని స్వామినాథన్ కమిషన్ సూచించింది. దానిని అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నించాల్సిన ప్రభుత్వం మరో మార్గాన్ని ఎంచుకుంది. కనీసమద్దతు ధరకే మంగళం పాడేసింది. ఓపెన్ మార్కెట్ లో అమ్ముకుంటే 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు అవుతుందని నమ్మబలుకుతోంది. ఈ వ్యవసాయ చట్టాల్లో కనీస మద్దతు ధర ప్రస్తావన లేకపోవడాన్ని బట్టి చూస్తే మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు రైతులను వదిలేస్తున్న్నట్లుగానే భావించాలి. గతంలో దళారులు పంటపై అప్పులిచ్చి కళ్లాల నుంచే ఉత్పత్తిని తోలుకుపోయేవారు. ఆరుగాలం శ్రమించిన అన్నదాత వెక్కిళ్లతో వెనుదిరగాల్సి వచ్చేది. ఇప్పుడు మరో రూపంలో కార్పొరేట్ సంస్థలు అదే పని చేస్తాయి. దీనివల్ల వినియోగదారునికైనా ప్రయోజనం ఉంటుందా? అంటే అదీ శూన్యమే. ఉదాహరణకు పండ్ల విక్రయాన్ని తీసుకుంటే సూపర్ మార్కెట్లలో రేట్లు గూబగుయ్యి మని పిస్తున్నాయి. బహిరంగంగా దొరికే చోట్లనే చౌకగా పండ్లు లభిస్తున్నాయి. భవిష్యత్తులో ఆకుకూరలు మొదలు కూరగాయలు, పండ్లు, ఆహార ధాన్యాలు అన్నిటిపైనా కార్పొరేట్ శక్తుల ప్రాబల్యం పెరిగిపోతుంది. కనీసమద్దతు ధరకు హామీ ఇస్తున్నామంటూ కేంద్రం ప్రకటిస్తోంది. చట్టంలో లేని హామీ, ప్రమాణాలు, మాట వరసకు చెప్పే మాటలు ఎన్నికల వాగ్దానాల వంటివే .ప్రతిపక్షాల బలహీనతను, రైతాంగం నిస్సహాయతను తన అడ్డగోలు నిర్ణయాలకు ఆధారంగా చేసుకొంటే ప్రజాప్రభుత్వమనిపించుకోదు. సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని చట్టాల అమలును నిలుపుదల చేసిన తర్వాతైనా కేంద్రం తన తప్పు తెలుసుకుని దిద్దుకొంటుందని రైతాంగం ఆశిస్తోంది.
-ఎడిటోరియల్ డెస్క్