సర్వేలు సర్వం మాయేనా....?
ఇప్పుడు దేశంలో సర్వేల మీద సర్వేలు దుమ్ము రేపుతున్నాయి. పార్టీ సర్వేలు, అధ్యయనసంస్థల సర్వేలు, మీడియా సర్వేల పేరిట బహుముఖాలుగా పుంఖానుపుంఖాలుగా ప్రజల మెదడును తొలిచేస్తున్నాయి. తమ అనుకూల సర్వేలను ఆయా పార్టీలు ప్రచారంలోకి తెస్తూ వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపని చాటుకుంటున్నాయి. ఆయా సంస్థల సర్వేలకు సాధికారత కల్పించాలని తెగతాపత్రయపడిపోతున్నాయి. గతంలో వాస్తవంగా నిరూపితమైన కొన్ని సంస్థల విశ్వసనీయతను ప్రాతిపదికగా చేసుకుంటూ సోషల్ మీడియాలోనూ సర్వేల హవా సాగుతోంది. కేంద్రంలో బీజేపీ ప్రాభవం క్షీణిస్తోందంటూ ఇటీవల వెలువడిన అంచనాలు దేశంలో సంచలనం కలిగించాయి. లగటిపాటి ఫ్లాష్ టీమ్, మరో ప్రధాన పత్రిక కలిసి చేశాయంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్థితిగతులపై వెలువడిన మరో సర్వే కూడా చర్చనీయమవుతోంది. నిజానికి ఈ సర్వే అంచనాలు వాస్తవాలా? అతిశయోక్తులా ? తేల్చుకునేందుకు సామాన్యునికి చాలా కష్టం. కానీ ఏదో ఒక సమాచారంతో తమ క్యాడర్ లో జోష్ నింపాలని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. తమ పాఠకుడు, ప్రేక్షకుడిని ఆకట్టుకొనేందుకు మీడియా వర్గాలు చూస్తాయి. మన దేశంలో గతంలో వెలువడిన సర్వేల్లో కేవలం 25 నుంచి 30 శాతం సర్వేలు మాత్రమే వాస్తవ ఫలితాలకు చేరువగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ప్రసార మాధ్యాల పక్కదారి...
నిరంతరం ప్రజలను ఏదో ఒక అంశంతో అనుసంధానం చేస్తూ టీఆర్పీ రేట్లు పెంచుకునేందుకు టీవీ ఛానళ్లు ప్రయత్నిస్తుంటాయి. అలాగే ప్రింట్ మీడియా సైతం పాఠకులను కాపాడుకోవడానికి, సర్క్యులేషన్ పెంచుకోవడానికి ఇదేరకం ఎత్తుగడలు వేస్తూ ఉంటుంది. దేశంలో పొలిటికల్ వాతావరణం హీటెక్కి ఉన్న స్థితిలో ప్రజలకు 2019లో ఏం జరగబోతోందన్న ఆసక్తి బాగా పెరిగిపోయింది. చిల్లరమల్లరగా ఉన్న విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి నరేంద్రమోడీ నేత్రుత్వంలోని ప్రభుత్వాన్ని గద్దె దింపగలుగుతాయా? అనేది ఒక అనుమానం. మళ్లీ మోడీ హవా నే కొనసాగుతుందా? తెలుసుకోవాలనే కుతూహలం మరోవైపు. వీటిని ఆసరాగా చేసుకుంటూ మీడియా సంస్థలు సర్వేల వైపు మొగ్గు చూపుతున్నాయి. కానీ ఇవన్నీ కొండను తవ్వి ఎలుకను పట్టిన తంతే. దేశంలో 543 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. అందులో పదోవంతు స్థానాల్లోనే నమూనా తీసి మమ అనిపించేందుకే మెజార్టీ సర్వేలు పరిమితమవుతున్నాయి. నమూనాగా తీసుకునే శాంప్లింగ్ నామమాత్రం. సామాజిక సమీకరణలు, పట్టణ, గ్రామీణ ఓటర్ల మనోభావాల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. వయసుల వారీ అభిప్రాయాల్లోనూ అంతరం ఉంటుంది. కులాలవారీ కొన్ని నిశ్చిత అభిప్రాయాలుంటాయి. ఉద్యోగ,వ్యాపార, వృత్తిపరమైన అంశాల్లోనూ ఓటర్ల మొగ్గులో వ్యత్యాసాలు కనిపిస్తుంటాయి. వీటన్నిటినీ కలుపుకుంటూ సమగ్రంగా నమూనా పరిమాణాన్ని పెంచితే తప్ప శాస్త్రీయత రాదు. క్షేత్ర స్థాయిలో పనిచేసే సర్వే బ్రుందాల కమిట్మెంట్, గ్రౌండ్ వర్క్ కూడా చాలా ముఖ్యం. కానీ సర్వేల్లో ఆ రకమైన వివరాలేమీ ప్రతిబించడం లేదు.
ఎగ్జిట్ పోల్స్ కే ఎదురు దెబ్బ...
ఓటు వేసి వచ్చిన వాడు చెప్పే వివరాలనే ఎగ్జిట్ పోల్స్ లో తీసుకుంటారు. ఇది నిజానికి నూటికి నూరుపాళ్లు ప్రతిబింబించాలి. కానీ ఆదరబాదరా వ్యవహారాలతో ఎగ్జిట్ పోల్స్ కూడా తప్పుదారి పట్టిపోతున్నాయి. గతంలో బీహార్, ఢిల్లీ వంటి ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ దాదాపు తప్పు చూపించాయి. ఇటీవల కర్ణాటక ఎన్నికలలోనూ ఎగ్జిట్ పోల్స్ రకరకాల భిన్న ఫలితాలను వెల్లడి చేశాయి. రెండు సర్వేలు కాంగ్రెసు అధికారంలోకి వచ్చేస్తోందంటే మరో నాలుగు సర్వేలు బీజేపీదే హవా అని చెప్పేశాయి. బీజేపీకి అసెంబ్లీలో మెజార్టీ వచ్చేస్తోందని కూడా ఆ సర్వేలు తేల్చేశాయి. మధ్యాహ్నం మూడు గంటల నుంచీ కనిపించే పుష్ పోలింగ్ వంటి అంశాలను పట్టించుకోకుండా ఉదయం 12 గంటలకే ఎగ్జిట్ పోల్స్ దుకాణం మూసేసి విశ్లేషణలు చేసేస్తుంటారు. ఒక శాస్త్రీయత, ప్రామాణికత లోపిస్తోంది. దీనివల్ల మొత్తం సర్వేల విశ్వసనీయతే దెబ్బతింటోంది. సాధారణంగా వ్యక్తం చేసే జోస్యంలా మారిపోతున్నాయి. అప్పటికప్పుడు తమ పాఠకుడు, ప్రేక్షకుడిని సంత్రుప్తిపరిచినా వీటిని ప్రసారం చేసే ,ప్రచురించే మాధ్యమాల క్రెడిబిలిటీ కూడా దీర్ఘకాలంలో దెబ్బతింటోంది. గతంలో ఎన్డీటీవీ సర్వేల పట్ల ప్రజల్లో ఒక నమ్మకం ఉండేది.ఇటీవల రెండు మూడు సర్వేల్లో తప్పుడు ఫలితాలు ఇవ్వడంతో దానిపై కూడా అనుమానాలు మొదలయ్యాయి.
ఏపీలో ఏం జరుగుతోంది? ...
ఏపీలో తాజాగా ఒక ప్రముఖ పత్రిక నిర్వహించిన సర్వే వెనక ఉద్దేశాలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. తెలుగుదేశం,బీజేపీతో విడిపోయిన తర్వాత కేంద్రం నుంచి సహకారం లోపించింది. గతంలో కలిసి నడిచిన పవన్ విడి కుంపటి పెట్టుకున్నారు. ప్రతిపక్ష వైసీపీ నేత జగన్ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ఇచ్చిన హామీల మేరకు అభివృద్ది, నిర్మాణాలు ఫీల్డు లెవెల్ లో కనిపించడం లేదు. దీంతో ప్రజల్లోనూ, పార్టీ శ్రేణుల్లోనూ టీడీపీ విజయంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. దీనిని పటాపంచలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. క్యాడర్ ను ఒంటరిపోరుకు సన్నద్దం చేయాలి. ప్రజల్లో తమకే పలుకుబడి ఉందన్న విషయాన్ని చాటి చెప్పాలి. ఇందుకోసం ప్రధానపత్రిక సర్వే ఒక అస్త్రంగా ప్రయోగించి ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 175 నియోజకవర్గాలున్న ఏపీలో ఈ శాంపిల్ సర్వే కేవలం 19 నియోజకవర్గాలకే పరిమితమైంది. అదీ నమూనా సైజు చాలా తక్కువ. కుల,మత, ప్రాంత విధేయతలతో భయంకరమైన చీలిక కనిపిస్తున్న ఏపీలో ఒక డజను నియోజకవర్గాలను నమూనా చేసుకుని మొత్తం రాష్ట్రాన్ని ప్రొజెక్టు చేయడమంటే దుస్సాహసమనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఓటరు నాడిని పట్టుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది. దాదాపు ప్రజల్లో 40శాతం మంది తమ మనోభావాలను బహిరంగంగా సర్వేల్లో వ్యక్తం చేయడానికి ఇష్టపడటం లేదు. ఇది నిగూఢమైన అర్థం. సర్వేల మబ్బులు కచ్చితంగా ఓట్ల వర్షం కురిపిస్తాయని చెప్పలేం.
-ఎడిటోరియల్ డెస్క్
- Tags
- andhra pradesh
- ap politics
- bharathiya janatha party
- janasena party
- nara chandrababu naidu
- narendra modi
- pavan kalyan
- surveys
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నరేంద్ర మోదీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- భారతీయ జనతా పార్టీ
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
- సర్వేలు