అదే కావాలయ్యా నాకు
మంత్రి పదవి అంటే మోజు లేనిదెవరికి. ఎన్ని సార్లు చేసినా అదే పదవి కావాలనుకుంటారు. జీవితంలో రిటైర్మెంట్ అంటూ లేని వృత్తి రాజకీయమే మరి. అందుకే ముదిమి [more]
మంత్రి పదవి అంటే మోజు లేనిదెవరికి. ఎన్ని సార్లు చేసినా అదే పదవి కావాలనుకుంటారు. జీవితంలో రిటైర్మెంట్ అంటూ లేని వృత్తి రాజకీయమే మరి. అందుకే ముదిమి [more]
మంత్రి పదవి అంటే మోజు లేనిదెవరికి. ఎన్ని సార్లు చేసినా అదే పదవి కావాలనుకుంటారు. జీవితంలో రిటైర్మెంట్ అంటూ లేని వృత్తి రాజకీయమే మరి. అందుకే ముదిమి వయసులో కూడా సమరానికి సై అంటూ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గుతారు. ఇంతా చేసి పడిన కష్టమంతా దేనికోసం అంటే అచ్చంగా అమాత్యయోగం కోసమేనని జవాబు వస్తుంది. మరి ఏకంగా రెండు దశాబ్దాల పదవీ వియోగం, విరహం తమ్మినేని సీతారాంది. ఆయన ఎపుడో బాబు జమానాలో యువజ సర్వీసులు, క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా 1990 దశకం చివర్లో తమ్మినేని సీతారాం పనిచేశారు. ఆ తరువాత ఆయన మళ్ళీ మంత్రి కాలేకపోయారు. ఆ మాటకు వస్తే ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు.
పెద్దాశతోనే….
జగన్ ని ప్రతి రోజూ పొగుడుతూనే తమ్మినేని సీతారాం తన దైనందిన రాజకీయాన్ని ప్రారంభిస్తారని టాక్. ఆయన తాను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నానని మరచి మరీ జగన్ ని ఎక్కువగానే కీర్తిస్తున్నారు. అసెంబ్లీలో ఆయన అధ్యక్ష స్థానంలో రిఫరీగా ఉండాల్సిన చోట కూడా అధికార పక్షం పాట పాడుతున్నారని టీడీపీ ఆరోపణలూ చేస్తోంది. ఇవన్నీ ఎలా ఉన్నా తమ్మినేని సీతారాంకి పెద్దాశే ఉందని అంటున్నారు. మళ్ళీ మంత్రిగా కుర్చీ ఎక్కి చక్రం తిప్పాలందే ఆ ఆశ. మరి జగన్ కరుణిస్తారా అన్నది ఇక్కడ పాయింట్.
రెండు బెర్తులపైనే….
శాసనమండలి రద్దుతో తొమ్మిది మంది వైసీపీ ఎమ్మెల్సీలు బిక్కచచ్చిపోతే ఖాళీ అయ్యే రెండు మంత్రి పదవుల కోసం వైసీపీలో పెద్ద ఎత్తున పోటీ పెరిగిపోతోంది. ఉత్తరాంధ్ర నుంచి కోస్తాంధ్రా. రాయలసీమ వరకూ మంత్రి యోగం కోసం డజన్ల లెక్కన ఎమ్మెల్యేలు కాచుకుని కూర్చుకున్నారు. ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణల ప్లేస్ లో చేరే ఆ ఇద్దరూ ఎవరా అన్నది పెద్ద ఎత్తున వైసీపీలో చర్చ సాగుతోంది. కుర్చీ దిగిపోయే ఆ ఇద్దరూ బీసీలే కావడంతో బీసీ కోటా నుంచి తమకు తప్పకుండా అవకాశం ఉంటుందని ఆ వర్గం ఎమ్మెల్యేలు గట్టిగా భావిస్తున్నారు. దాంతో మంత్రి కిరీటం ఎవరి నెత్తిన పెడతారన్నది కూడా చర్చగా ఉంది.
చివరి ఛాన్సేనా…?
తమ్మినేని సీతారాం విషయానికి వస్తే ఆయన బీసీ వర్గానికి చెందినవారు. పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నవారు. అన్నింటికీ మించి జగన్ మెచ్చుకున్న నాయకుడు. ఇంకా చెప్పాలంటే కింజారపు కుటుంబంపై ఒక రేంజిలో విరుచుకుపడే నాయకుడు. ఇక్కడే జగన్ కి తమ్మినేని సీతారాం ఇంకా బాగా నచ్చేస్తారని అంటున్నారు. ఇప్పటివరకు అయితే శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన కృష్ణ దాస్ మంత్రిగా ఉన్నా జోరు ఏ మాత్రం చూపించలేకపోయారు. దానికి తోడు ధర్మాన కుటుంబానికి కింజారపు ఫ్యామిలీతో లోపాయికారి సంబంధాలు ఉన్నాయన్న అనుమానాలు వైసీపీ పెద్దల్లో ఉన్నాయి. సిక్కోలులో ఎవరిని ఎంపీగా నిలబెట్టినా ఓడగొట్టి మరీ కింజారపు కుటుంబానికి మేలు చేస్తున్నారని ప్రచారమూ ఉంది. దాంతో సిక్కోలు నుంచి నరుక్కురావాలంటే తమ్మినేని సీతారాం బెస్ట్ ఛాయిస్ అన్న మాట కూడా ఉంది.
సభలోనే సవాల్….
ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలో అచ్చెన్నాయుడు ఏకంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మీదనే బాణాలు వేశారు. స్పీకర్ స్థానంలో ఉండి రాజకీయాలు చేసే బదులు కిందకు వచ్చి మంత్రి అయితే బెటర్ అంటూ వెటకారంగానే మాట్లాడారు. దానికి ఆగ్రహంగా బదులిచ్చిన తమ్మినేని సీతారాం అలాగే వస్తాను అచ్చెన్నా, ఆ రోజూ వస్తుందని అంటూ సభ మొత్తం చూస్తుండగా సవాల్ చేశారు. మరి ముఖ్యమంత్రి జగన్ సభలో ఉండగానే ఇదంతా జరిగింది. ఓ విధంగా తమ్మినేని సీతారాం జగన్ కి కూడా తన మనసులో మాటని వినిపించేశారనుకోవాలి. మొత్తానికి చూసుకుంటే స్పీకర్ గా తానుండలేనని, మంత్రిగానే సెటిల్ అవాలనుకుందని తమ్మినేని చెప్పేసుకుంటున్నారు. జగన్ ఆయన మొర ఆలకించి మంత్రిని చేస్తారా లేదా అన్నదే ఇపుడు చూడాలి.