అంతా మాజీలే మరి… ?
తెలుగుదేశం పార్టీ ఇపుడు మాజీలకు నిలయంగా మారుతోంది. 2014 ఎన్నికల్లో వందకు పైగా ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ కాస్తా అయిదవ వంతుకు పడిపోయింది. దాంతో పెద్ద ఎత్తున [more]
తెలుగుదేశం పార్టీ ఇపుడు మాజీలకు నిలయంగా మారుతోంది. 2014 ఎన్నికల్లో వందకు పైగా ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ కాస్తా అయిదవ వంతుకు పడిపోయింది. దాంతో పెద్ద ఎత్తున [more]
తెలుగుదేశం పార్టీ ఇపుడు మాజీలకు నిలయంగా మారుతోంది. 2014 ఎన్నికల్లో వందకు పైగా ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ కాస్తా అయిదవ వంతుకు పడిపోయింది. దాంతో పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యేలు పార్టీలో తేలారు. వారికి తోడు అన్నట్లుగా గత రెండేళ్లలో రాజ్య సభ్య సభ్యులు, శాసన మండలి సభ్యులు మాజీలు అయ్యారు. ఇక తాజాగా మరికొందరు మాజీలు కాబోతున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాల్లో చూసుకుంటే ఇక అధికార వైభోగాలు టీడీపీకి గతమే అన్నట్లుగా సీన్ మారుతోంది. మూడు జిల్లాలో ఒకనాడు అటు పెద్ద సభతో పాటు ఇటు అసెంబ్లీలో లోక్ సభలో అంతా పసుపు తమ్ముళ్ళే కనిపించేవారు. వైసీపీ ప్రభంజనం మూలంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు మాజీలై మూలకు చేరితే ఇపుడు వారి సరసన మరికొందరు చేరబోతున్నారు.
ఒకేసారి ముగ్గురు….?
టీడీపీలో కాస్తా పెద్ద గొంతు చేసే ఎమ్మెల్సీలు కొద్ది రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్నారు. అనకాపల్లి నుంచి టీడీపీ వాయిస్ ని గట్టిగా వినిపించే బుద్దా నాగజగదీశ్వరరావు పదవీ కాలం ఈ నెల 18తో పూర్తి అయిపోతోంది. ఆయన బాబుకు అండగా ఉంటూ వైసీపీ మీద గట్టిగా విరుచుకుపడే నేతగా గుర్తింపు పొందారు. దాదాపుగా ప్రతీ రోజూ పార్టీ వాణిని వినిపించే నేతగా కూడా ఆయనకు అటు మీడియాలోనూ ఇటు పార్టీలోనూ గుర్తింపు ఉంది. మరి అటువంటి జగదీష్ రిటైర్ కావడం అంటే టీడీపీకి పెద్ద షాక్ గానే చూడాలి.
సీనియర్ పక్కకే….?
ఇక రూరల్ జిల్లాలో చూసుకుంటే ఎంపీగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా అనేక పదవులు నిర్వహించిన పప్పల చలపతిరావు కూడా రిటైర్ కాబోతున్నారు. ఆయన కూడా ఇదే నెలలో మాజీ ఎమ్మెల్సీ కాబోతున్నారు. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన పప్పల ఎన్టీయార్ హయాం నుంచి టీడీపీలో చురుకుగా ఉన్నారు. ఆయన ఊరకే విమర్శలు చేయరు అన్న పేరుంది. సమర్ధుడైన నేతగా ఉన్న పప్పల మాజీ అయితే టీడీపీకి రూరల్ లో పట్టు ఇంకా జారుతుందని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే విజయనగరం జిల్లాలో బీసీ నేతగా మాజీ జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్న ద్వారపురెడ్డి జగదీష్ కూడా మాజీ ఎమ్మెల్సీ కాబోతున్నారు. ఆయన కూడా టీడీపీ ఎదుగుదలకు విశేష కృషి చేశారు. మరి అధికార పదవులు లేకపోతే ఈ నేతలకు మీడియా గుర్తింపు కూడా ఇపుడు దొరకడం కష్టమే అంటున్నారు.
సైలెంట్ మోడ్ లో …?
ఉత్తరాంధ్రాలో తిప్పి తిప్పి చూస్తే ఇద్దరు నేతలు మాత్రమే టీడీపీకి పెద్దల సభలో మిగిలారు. శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల కోటాలో నెగ్గిన మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, అలాగే విశాఖ నుంచి బీసీ నేత దువ్వారపు రామారావు మాత్రమే ఉన్నారు. ఇందులో శత్రుచర్ల 2023లో రిటైర్ అవుతారు. దువ్వాడ పదవీకాలం 2025 దాకా ఉంది. దువ్వాడ పార్టీ గురించి పెద్దగా మాట్లాడింది ఎపుడూ లేదు. ఆయన బీసీ సమస్యలే ప్రస్తావిస్తారు. ఇక శత్రుచర్ల అయితే చాలా కాలంగా సైలెంట్ గానే ఉంటున్నారు. దాంతో ఈ ఇద్దరూ ఉన్నా పార్టీకి అసలైన లోటు అలాగే ఉంటుందని అంటున్నారు. టీడీపీకి మళ్ళీ నాటి కాంతులు రావాలంటే 2024లో అధికారంలోకి రావాల్సిందే. లేకపోతే ఇక్కడితోనే పదవీ భోగాలనీ పరిసమాప్తమవుతాయి. టీడీపీ గొంతు కూడా గట్టిగా వినిపించే సీన్ ఉండని చెప్పాల్సిందే.