జమ్మలమడుగులో అగ్గి చల్లారుతుందా?
ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద నాలుగు రోజులుగా జరుగుతున్న జమ్మలమడుగు పంచాయితీకి ఎట్టకేలకు ఇవాళ తెరపడింది. అధినేత ఆదేశాలను పాటిస్తామని మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి స్పష్టం చేశారు. [more]
ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద నాలుగు రోజులుగా జరుగుతున్న జమ్మలమడుగు పంచాయితీకి ఎట్టకేలకు ఇవాళ తెరపడింది. అధినేత ఆదేశాలను పాటిస్తామని మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి స్పష్టం చేశారు. [more]
ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద నాలుగు రోజులుగా జరుగుతున్న జమ్మలమడుగు పంచాయితీకి ఎట్టకేలకు ఇవాళ తెరపడింది. అధినేత ఆదేశాలను పాటిస్తామని మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అయితే, అధినేత మనస్సులో ఏముంది, నిజంగా అస్సలు సమయంలో చంద్రబాబు ఆదేశాలను పాటిస్తారా అనేది అనుమానంగానే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో జమ్మలమడుగులో టీడీపీ నుంచి రామసుబ్బారెడ్డి, వైసీపీ నుంచి ఆదినారాయణరెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. వీరి రెండు కుటుంబాల మధ్య బద్ధవైరం ఉంది. వీరి మధ్య ఫ్యాక్షన్ గొడవల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఫిరాయింపులను టీడీపీ ప్రోత్సహించిన సమయంలో ఆదినారాయణరెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరి మంత్రి పదవి కూడా చేపట్టారు. ఇక, రామసుబ్బారెడ్డికి కూడా ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఇప్పటివరకు ఏమీ గొడవలు లేక అంతా సాఫీగానే సాగుతోంది. అయితే, రానున్న ఎన్నికల్లో జమ్మలమడుగు సీటు ఎవరికి అనే పంచాయితీ ఇప్పుడొచ్చింది.
అసెంబ్లీ వైపే ఇద్దరి చూపు
ఇద్దరిలో ఒకరిని జమ్మలమడుగు అసెంబ్లీకి, ఒకరిని కడప పార్లమెంటుకు పోటీ చేస్తారనేది స్పష్టమయ్యింది. అయితే, కడప పార్లమెంటు స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నందున పోటీ చేస్తే ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయనేది వీరిద్దరి భావన. ఓడిపోయే సీటు నుంచి పోటీ చేయడం ఇద్దరికీ ఇష్టం లేదు. ముఖ్యంగా జమ్మలమడుగును వదులుకునేందుకు వారికి మనసొప్పడం లేదు. అయితే, వరుసగా వారం రోజుల పాటు ముఖ్యమంత్రి సమక్షంలో ఈ చర్చలు జరిగాయి. అయినా ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తేలలేదు. చంద్రబాబు ఏది చెబితే అది చేస్తామని మాత్రం ప్రకటించారు. అయితే, ఒక్కసారి జమ్మలమడుగును వదిలేస్తే నియోజకవర్గంపై పట్టు కోల్పోయే అవకాశం ఉంటుంది. వీరిద్దరికీ అక్కడ ప్రత్యేకంగా క్యాడర్ ఉండటంతో ఎవరు పోటీ చేయరో వారి క్యాడర్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
నేతల మధ్యే మాటలు లేవు…
క్యాడర్ ను కాపాడుకోవాలంటే పోటీ చేయడం తప్పనిసరిగా ఇద్దరు నేతలూ భావిస్తున్నారు. ఒక నేత అనుచరులైతే ఏకంగా ఇండిపెండెంట్ గానైనా పోటీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఈ ఇద్దరు నేతలు పైకి కలిసినట్లుగా కనిపిస్తున్నా ఇద్దరి మధ్య మాటలే లేవు. నేతల మధ్యే మాటలు లేకపోతే క్యాడర్ మాత్రం కలిసి పనిచేసే అవకాశం ఉండదంటున్నారు. దీంతో పోటీ చేసిన నేతకు ఇతర క్యాడర్ అనుచరులు సహకరించే అవకాశాలు కూడా కనిపించడం లేదు. కాబట్టి, కేవలం నేతలను ఒప్పించడమే కాకుండా క్యాడర్ ను కూడా కలపాల్సిన అవసరం పార్టీపై ఉంటుంది. మరి, అనేక ఏళ్లుగా బద్ధవైరం కలిగిన రెండు పక్షాల క్యాడర్ ఏమేర కలిసి పనిచేస్తుందో చూడాలి. అయితే, ఇప్పటివరకైతే అధినేత మాటే ఫైనల్ అని నేతలు పైకి చెబుతున్నా… టిక్కెట్లు ప్రకటించిన తర్వాత టిక్కెట్ దక్కని నేత ‘కార్యకర్తల ఒత్తిడి’ అనే అంశాన్ని తెరపైకి తెచ్చి వేరే పార్టీ నుంచో, ఇండిపెండెంట్ గానో పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. మరి, జమ్మలమడుగు పంచాయితీ టీడీపీలో ఇంకా ఎన్ని రోజులు జరుగుతుందో చూడాలి.